TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం… దాతల ప్రివిలేజెస్‌ను హేతుబద్ధీకరించడం. ఇప్పటివరకు విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి అనేక సౌకర్యాలు ఉండేవి. అయితే ఇటీవల దాతల సంఖ్య భారీగా పెరగడంతో… సాధారణ భక్తులకు దర్శనం లభించే అవకాశాలు తగ్గుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దాతలకు గౌరవం కొనసాగిస్తూ… సామాన్య భక్తుల ప్రయోజనాలను కూడా కాపాడేలా కొత్త పాలసీని రూపొందించింది టీటీడీ.

టీటీడీ ఛైర్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం దేవస్థానానికి దాదాపు 1.90 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో రూ.1 లక్ష విరాళం ఇచ్చిన వారు 1.50 లక్షల మంది, రూ.10 లక్షలు విరాళం ఇచ్చిన వారు 22 వేల మంది ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రూ.10 లక్షల దాతల సంఖ్య 19 వేల నుంచి 22 వేలకు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల ప్రత్యేక దర్శనాలపై ఒత్తిడి పెరుగుతోందని టీటీడీ గుర్తించింది. అందుకే కొత్త మార్గదర్శకాలను రూపొందించి… మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త పాలసీలో దాతలను విరాళం మొత్తాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా విభజించారు. అంతేకాదు… వ్యక్తిగత దాతలు, సంస్థలు లేదా ట్రస్టులకు వేర్వేరు నిబంధనలు రూపొందించారు. బిగినింగ్ బ్రేక్ దర్శనం, సుపథం ప్రవేశం, సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, బస, లడ్డూలు, పట్టు వస్త్రాలు వంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు విరాళం స్థాయిని బట్టి నిర్ణయించబడతాయి.

మొదటి కేటగిరీ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు విరాళం ఇచ్చిన వారికి వర్తిస్తుంది. వీరికి ఏడాదిలో ఒకటి నుంచి మూడు సార్లు సుపథం ప్రవేశం లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం లభిస్తుంది. అలాగే విరాళం మొత్తాన్ని బట్టి ఒకటి నుంచి మూడు రోజుల వరకు తక్కువ అద్దెతో గది కేటాయిస్తారు. ప్రతి ఏడాది చిన్న లడ్డూలు, పట్టు దుపట్టా, బ్లౌజ్ పీస్‌ను బహుమతిగా అందజేస్తారు.

రెండో కేటగిరీ రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విరాళం ఇచ్చిన వారికి వర్తిస్తుంది. వీరికి ఏడాదికి ఒకటి నుంచి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, సుపథం ప్రవేశం లభిస్తుంది. ట్రస్టులకు కూడా విరాళం స్థాయిని బట్టి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అందిస్తారు. బస కోసం ఒకటి లేదా రెండు రోజుల పాటు మెరుగైన వసతి కల్పిస్తారు. ప్రతి ఏడాది 15 చిన్న లడ్డూలు, పట్టు వస్త్రాలు బహుమతిగా ఇస్తారు.

మూడో కేటగిరీలో రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు విరాళం ఇచ్చిన వారు ఉంటారు. వీరికి ఏడాదికి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ప్రవేశం లభిస్తుంది. అంతేకాదు… జీవితకాలంలో పదిసార్లు లేదా పన్నెండుసార్లు సుప్రభాత సేవ చేసే అవకాశం ఉంటుంది. కల్యాణోత్సవ సేవల్లో కూడా ప్రత్యేక అవకాశం కల్పించారు. మూడు రోజుల పాటు వసతి, ప్రతి ఏడాది పెద్ద, చిన్న లడ్డూలతో పాటు పట్టు వస్త్రాలు అందిస్తారు. అదనంగా జీవితకాలంలో ఒక్కసారి రెండు గ్రాముల బంగారు డాలర్, పది గ్రాముల వెండి నాణెం కూడా బహుమతిగా ఇస్తారు.
యాంకర్‌
ఇక, నాలుగో కేటగిరీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు వర్తిస్తుంది. వీరికి ఏడాదికి నాలుగు లేదా ఐదు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ప్రవేశం, జీవితకాలంలో 20 నుంచి 40 సార్లు సుప్రభాత సేవ చేసే అవకాశం ఉంటుంది. ఒకేసారి మూడు నుంచి ఐదు కల్యాణోత్సవ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. మూడు నుంచి నాలుగు రోజుల పాటు మెరుగైన వసతి, ఎక్కువ సంఖ్యలో లడ్డూలు, పట్టు వస్త్రాలు, బంగారు డాలర్, వెండి నాణెం వంటి ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.

అయితే… ఈ నిర్ణయాల్లో దాతలకే కాదు… సామాన్య భక్తులకూ పెద్దపీట వేశారు. తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకునే భక్తులు ఎండ, వానలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.6.31 కోట్లతో ఆధునిక షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. అలాగే కుమారధార, పసుపుధార డ్యామ్ ప్రాంతంలో రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు.

పర్యావరణ పరిరక్షణపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. GNC ప్రాంతంలో 800 కిలోవాట్ల సామర్థ్యం గల విండ్ టర్బైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఒక ప్రైవేట్ సంస్థ ఉచితంగా అందించనుండగా… దీని ద్వారా దాదాపు 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభించనుంది. అలాగే పాత చెత్త తొలగింపునకు రూ.5 కోట్లు, ఫైర్ సేఫ్టీ పనులకు రూ.2.35 కోట్లు మంజూరు చేశారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వద్ద రూ.17.84 కోట్లతో వంద గదుల సత్రం నిర్మించనున్నారు. ఆలయానికి బంగారు కవచాల కోసం ఒక కిలో బంగారాన్ని కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో నిరంతర వేదపారాయణం జరిగేలా 791 మంది వేద పండితులను నియమించాలని నిర్ణయించారు. అలాగే 2027 సంవత్సరానికి సంబంధించి 10 లక్షల డైరీలు, 14 లక్షలకు పైగా క్యాలెండర్లను ముద్రించనున్నారు.

మొత్తానికి… దాతలకు గౌరవం కొనసాగిస్తూనే, సామాన్య భక్తులకు దర్శనం మరింత సులభంగా అందేలా సమతుల్యత సాధించడమే ఈ కొత్త పాలసీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో… తిరుమలలో దర్శన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఈ కొత్త పాలసీపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published.