ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

మీరు ఎప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించారా? రైల్వే అందించే బెడ్‌రోల్‌ను ఉపయోగించారా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే… ఇండియన్ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు భారీగా మాయమయ్యాయి. తాజాగా ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు రైళ్ల నుంచి చోరీకి గురయ్యాయి. ఈ చోరీల వల్ల రైల్వేకు రూ.104 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అసలు ఏ వస్తువులు ఎక్కువగా మాయమయ్యాయి? ఏ డివిజన్‌లో అత్యధిక చోరీలు జరిగాయి?


భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ బెడ్‌రోల్ కిట్ అందిస్తుంది. ఇందులో రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, దిండు కవర్, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. ప్రయాణం పూర్తయిన తర్వాత ఇవన్నీ కోచ్‌లోనే వదిలేయాలి. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం వాటిని తమ సొంత ఆస్తిగా భావించి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇదే ఇప్పుడు భారీ ఆర్థిక నష్టానికి కారణమైంది.

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… 2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశంలోని వివిధ రైల్వే డివిజన్లలో నిర్వహించిన లెక్కల్లో దాదాపు 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు మాయమైనట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 69 రైల్వే డివిజన్లలో 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారంతోనే ఈ గణాంకాలు బయటపడ్డాయి. అంటే మిగిలిన డివిజన్ల వివరాలు కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ వివరాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా సేకరించింది. 16 రైల్వే జోన్ల పరిధిలోని 54 డివిజన్ల నుంచి వచ్చిన సమాధానాలను విశ్లేషించగా… 2022 నుంచి 2025 మధ్య బెడ్‌రోల్ చోరీలు 56 శాతం పెరిగినట్లు తేలింది. అంటే ప్రతి ఏడాది ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని అర్థమవుతోంది.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… దొంగిలించిన వస్తువుల జాబితాలో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. మొత్తం 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయమయ్యాయి. ఆ తర్వాత 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ ప్రయాణికులే తీసుకెళ్లినట్లు రైల్వే రికార్డులు చెబుతున్నాయి.

ఈ చోరీల కారణంగా రైల్వే శాఖకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. కేవలం 54 డివిజన్ల లెక్కల ప్రకారమే… దాదాపు రూ.104 కోట్ల విలువైన వస్తువులు మాయమయ్యాయి. ప్రతి ప్రయాణం తర్వాత కొత్త బెడ్‌రోల్ వస్తువులు కొనుగోలు చేయాల్సి రావడం వల్ల రైల్వేపై అదనపు భారం పడుతోంది. ఈ ఖర్చు చివరికి ప్రభుత్వ ఖజానాపైనే పడుతోంది. అంటే పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బే ఇలా వృథా అవుతోంది.

రైల్వే అధికారుల అంచనా ప్రకారం… ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో కనీసం ఒకరు బెడ్‌షీట్, టవల్ లేదా దుప్పటి వంటి వస్తువులను తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండే ఏసీ కోచ్ ప్రయాణికులే ఇలాంటి పనులకు పాల్పడటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిన్న వస్తువే కదా అని భావించి ఇంటికి తీసుకెళ్లడం… నిజానికి ప్రభుత్వ ఆస్తిని దొంగిలించినట్టేనని అధికారులు చెబుతున్నారు.

చట్టపరంగా కూడా ఇది చిన్న విషయం కాదు. రైల్వే ఆస్తులను అనుమతి లేకుండా తీసుకెళ్లడం నేరం. అవసరమైతే అలాంటి ప్రయాణికులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ… ఇలాంటి ఘటనలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం… ఈ సమస్యను అరికట్టేందుకు రైల్వే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోచ్‌లలో సీసీటీవీ నిఘా పెంచడం, బెడ్‌రోల్ పంపిణీ, తిరిగి సేకరణలో డిజిటల్ ట్రాకింగ్ తీసుకురావడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు ఉపయోగపడవచ్చు. అలాగే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తులను తీసుకెళ్లే వారిపై కఠిన జరిమానాలు విధించాలని కూడా సూచిస్తున్నారు.

మొత్తానికి… రైల్వే బెడ్‌షీట్, టవల్, దుప్పటి వంటి వస్తువులు ఉచిత బహుమతులు కావు. అవి ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఆస్తులు. వాటిని ఇంటికి తీసుకెళ్లడమంటే సరదా కాదు… అది చట్టరీత్యా నేరం. కొందరి ప్రయాణికుల కక్కుర్తి,, ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం కలిగించింది. కాబట్టి ప్రజా ఆస్తిని కాపాడటం ప్రతి ప్రయాణికుడి సామాజిక బాధ్యత. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? రైల్వే ఇలాంటి దొంగతనాలను అరికట్టేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చ? కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published.