AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!

ఉల్లి ధరలు పెరుగుతున్న వేళ.. సామాన్యులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో పెరిగిన ఉల్లి ధరల భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నారు. ప్రజల స్పందన, డిమాండ్‌ను బట్టి ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. అయితే ఈ సబ్సిడీ ఉల్లి ఎవరు పొందవచ్చు..? ఎన్ని కిలోలు ఇస్తారు..? కొనుగోలు చేసేందుకు ఏం తీసుకెళ్లాలి..?

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు ఉల్లిని అందించాలని నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయలను రూ.35 చొప్పున విక్రయించనున్నారు.

సబ్సిడీ ఉల్లి పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ కార్డుల ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు గరిష్టంగా రెండు కిలోల ఉల్లిపాయలను మాత్రమే అందించనున్నారు.

సబ్సిడీ ఉల్లి విక్రయాల్లో అక్రమాలు జరగకుండా, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్డు ఆధారంగా విక్రయాలు చేపట్టడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నిర్ణయాన్ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోందని, ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఉల్లితో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే బియ్యం ధరల నియంత్రణలో భాగంగా బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు అందించే ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించేందుకు మీ మార్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1 నాటికి వెయ్యి మీ మార్ట్‌లు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 870 మీ మార్ట్ షాపులు సిద్ధంగా ఉన్నాయి. ఈ మీ మార్టుల ద్వారా తక్కువ ధరలకు 64 రకాల నిత్యావసర వస్తువులు అమ్మకాలు చేపట్టారు. ఈ మీ మార్టుల్లో 100, 250, 500 గ్రాముల చిన్న ప్యాకెట్లలో సరుకులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు కందిపప్పు, పామాయిల్ కూడా సబ్సిడీ ధరపై త్వరలోనే ప్రజలకు అందిస్తామని గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మొత్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సబ్సిడీ విక్రయాలను ప్రారంభించింది. విజయవాడలో మొదలైన ఈ విధానం.. త్వరలోనే రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు విస్తరించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.