Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో కో-పైలట్‌.. భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. అసలు విమానంలో ఏం జరిగింది? ప్రయాణికులు ఎలా స్పందించారు? తీవ్రంగా గాయపడిన పైలట్‌ విమానాన్ని ప్రమాదం నుంచి ఎలా బయటపడేశారన్న దానిపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఫ్లైదుబాయ్‌కి చెందిన FZ1073 విమానం దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్‌.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుమార్లు దాడి చేయడంతో కెప్టెన్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం ఒక్కసారిగా 14వేల అడుగల ఎత్తు కోల్పోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక కొందరు ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు.. మరికొందరు కాక్‌పిట్‌ వైపు పరుగులు తీశారు.

ఈ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన వీడియోలో విమానం లోపల నెలకొన్న గందరగోళ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికులు ఇంగ్లిష్‌, హీబ్రూ భాషల్లో పెద్దగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. “అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు” అంటూ ఓ ప్రయాణికుడు చెప్పడం కూడా వీడియోలో రికార్డైంది. కాక్‌పిట్‌లో ఉన్నవారు బయటకు రావాలని, ప్రశాంతంగా ఉండాలని కొందరు సూచించగా.. క్యాబిన్‌లోని ప్రయాణికులను తమ సీట్లలోనే కూర్చోవాలని సిబ్బంది కోరారు.

ఈ గందరగోళ పరిస్థితుల్లో “ఎవరైనా డాక్టర్ ఉన్నారా?” అంటూ ఓ క్రూ మెంబర్‌ ప్రయాణికులను అడిగారు. దీంతో విమానంలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన డెంటిస్ట్‌ డాక్టర్‌ షోటా ముసయెవ్‌ ముందుకు వచ్చారు. ఆయన కాక్‌పిట్‌ వైపు వెళ్లి గాయపడిన కెప్టెన్‌కు సహాయం చేసినట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత కాక్‌పిట్‌ బయట రక్తస్రావంతో ఉన్న కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ దృశ్యాలు కూడా ఆ వీడియో కనిపించాయి.

తనపై కో-పైలట్‌ కత్తితో పలుమార్లు దాడి చేసినట్లు కెప్టెన్‌ మచ్చార్‌ చెప్పినట్లు వీడియోలో వినిపించింది. గాయపడిన చేతిని కదపగలుగుతున్నానని, అయితే పిడికిలి బిగించలేకపోతున్నానని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది.

ఈ సమయంలో కొందరు ప్రయాణికులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇజ్రాయెల్ కు చెందిన ప్లంబర్ యానివ్‌ తో పాటు మరికొందరు ప్రయాణికులు కో-పైలట్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఇతర ప్రయాణికులు, సిబ్బంది కూడా సహకరించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. “పోలీసులు వచ్చే వరకు అతడిని వదలొద్దు” అంటూ ప్రయాణికులు కేకలు వేయడం వీడియోలో వినిపించింది. చివరకు కో-పైలట్‌ చేతులను వెనక్కి కట్టి విమానం ఫ్లోర్‌పై మోకాళ్లపై కూర్చోబెట్టారు.

ఈ ఘటనలో ప్రయాణికుల సహకారం కీలకంగా మారింది. డెంటిస్ట్‌ షోటా ముసయెవ్‌ గాయపడిన కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించగా.. విమానంలో ఉన్న ఆఫ్‌-డ్యూటీ పైలట్లు కూడా పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించినట్లు సమాచారం. కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంపై సిబ్బంది దృష్టి పెట్టారు.

విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. అనంతరం గాయపడిన కెప్టెన్‌ స్మిత్ మచ్చార్‌కు వైద్య చికిత్స అందించారు. పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆ తర్వాత యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. యూఏఈలో భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ ఆస్పత్రికి వెళ్లి కెప్టెన్‌ మచ్చార్‌, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మచ్చార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

మరోవైపు ఘటన అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత అతడిని యూఏఈ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏంటి? విమానాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందా? ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? కో-పైలట్‌ ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కో-పైలట్‌ తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కో-పైలట్‌ “కిల్‌ మీ.. కిల్‌ మీ” అంటూ అరచినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.మరోవైపు ఫ్లైదుబాయ్‌ కూడా దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది.

మొత్తంగా.. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తో పాటు.. ప్లంబర్‌, డెంటిస్ట్‌.. ప్రయాణికులను కూడా రియల్ హీరోలనే చెప్పుకోవాలి. అయితే, గాల్లో ఉన్న విమానంలో కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి జరగడం, ఆ సమయంలో విమానం భారీగా ఎత్తు కోల్పోవడం, భయంతో ప్రయాణికుల హాహాకారాలు.. పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవడం, ప్రయాణికులు ధైర్యంగా ముందుకొచ్చి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం కీలకంగా మారింది. చివరకు విమానాన్ని తబూక్ లో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటి? విమానాన్ని కూల్చే ఉద్దేశం ఉందా? ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది.

Leave a Reply

Your email address will not be published.