Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్‌.. సౌదీకి మద్దతుగా అమెరికా..!

పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త సంక్షోభం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడ్డారు. యెమెన్‌కు చెందిన హౌతీలు.. సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది. అసలు ఈ దాడులకు కారణమేంటి? హౌతీల వెనుక నిజంగానే ఇరాన్ ఉందా? సనా ఎయిర్‌పోర్ట్‌పై దాడికి ప్రతీకారంగానే హౌతీలు రంగంలోకి దిగారా? సౌదీ అరేబియా వెనుక అమెరికా వ్యూహం ఏంటి? ఈ తాజా పరిణామాలు పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెడతాయా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సోమవారం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టామని వెల్లడించారు. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

ఈ ఘర్షణకు మూల కారణం సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడే అని సమాచారం. ఇరాన్‌లో జరిగిన అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన హౌతీ ప్రతినిధుల బృందం తిరిగి యెమెన్‌కు వస్తుండగా.. ఆ విమానాన్ని అడ్డుకునేందుకు సౌదీ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్ ప్రభుత్వం సనా విమానాశ్రయం రన్‌వేపై దాడి చేసినట్లు హౌతీలు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతీకారంగా సౌదీలోని అభా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.

మరోవైపు హౌతీల దాడులపై సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి స్పందించింది. హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. అయితే కొన్ని పేలుళ్లతో అభా విమానాశ్రయ పరిసరాల్లో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో సౌదీలో భద్రతా పరిస్థితులపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.

యెమెన్‌లో ఉత్తర ప్రాంతాన్ని హౌతీ తిరుగుబాటుదారులు నియంత్రిస్తుండగా.. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందని సౌదీ, అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీల తాజా దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హౌతీలపై సైనిక చర్యలు ప్రారంభించే ముందు సౌదీ అరేబియా అమెరికాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికా కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారికంగా ఇరు దేశాలు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇదే సమయంలో హౌతీలు సనా విమానాశ్రయంపై ఆంక్షలు కొనసాగితే.. సౌదీ గగనతలంలో ప్రయాణించే విమానాలకు ముప్పు ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

మొత్తానికి.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఇప్పటికే అస్థిరంగా మారిన పశ్చిమాసియాలో.. ఇప్పుడు సౌదీ-హౌతీ ఘర్షణలు మరో కొత్త ఆందోళనకు తెరలేపాయి. ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, గల్ఫ్ దేశాల భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజా దాడులపై ఇరు వర్గాల అధికారిక ప్రకటనలు, దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందన.. అలాగే, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య కొత్త ఘర్షణలు
సౌదీపై హౌతీల క్షిపణులు, డ్రోన్ దాడులు
సౌదీలోని అభా విమానాశ్రయంపై హూతీల దాడి..
సనా ఎయిర్‌పోర్ట్ దాడులకు ప్రతీకారమేనన్న హౌతీలు
హౌతీ ప్రతినిధుల విమానాన్ని అడ్డుకునేందుకే దాడి!
సౌదీ మద్దతుతో సనా రన్‌వేపై బాంబు దాడి
హౌతీల వెనుక ఇరాన్ మద్దతు
క్షిపణులను అడ్డుకున్నామన్న సౌదీ కూటమి
అభా ఎయిర్‌పోర్ట్‌లో మంటలు..
వైరల్ అవుతున్న వీడియోలు
నాలుగేళ్ల ప్రశాంతతకు బ్రేక్ పడిందా?
2022 కాల్పుల విరమణకు మళ్లీ ముప్పు
హౌతీలపై చర్యలకు అమెరికా సహకారం కోరిన సౌదీ?
యెమెన్ సంక్షోభంతో మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
ప్రపంచ చమురు సరఫరాపై తాజా ఘర్షణల ప్రభావం
పశ్చిమాసియాలో మరో యుద్ధానికి సంకేతాలా?

SaudiArabia #Houthi #Yemen #MiddleEast #Iran #AbhaAirport #MissileAttack #DroneAttack #Geopolitics #InternationalNews

Leave a Reply

Your email address will not be published.