విజయవాడలో భారీ మోసం..
రూ.10 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు!
పోలీసులమంటూ రిటైర్డ్ ఇంజినీర్‌కు బెదిరింపులు
అసలేంటీ డిజిటల్ అరెస్ట్?
ఇంత భారీ మోసం ఎలా జరిగింది?
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎంత దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారో చెప్పే మరో ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. కేసులు, అరెస్టు పేరుతో ఓ రిటైర్డ్ ఇంజినీర్‌ను భయపెట్టారు. ఏకంగా రూ.10 కోట్లు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ ఖాతాలో ఉన్న రూ.7 కోట్లను ఫ్రీజ్ చేశారు. అయితే మరో ఖాతాలోకి వెళ్లిన రూ.3 కోట్లు మాత్రం అప్పటికే వందల ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు.
విజయవాడలో జరిగిన ఈ ఘటన.. డిజిటల్ అరెస్ట్ మోసాల తీవ్రతను మరోసారి బయటపెట్టింది. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం.. విజయవాడ గురునానక్ కాలనీకి చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్‌కు సెప్టెంబర్ 18న ఒక Unknown నంబర్ నుంచి కాల్ వచ్చింది. తాము సీబీఐ అధికారులమని, ముంబై నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. మీ ఫోన్ నంబర్ పలు నేరాల్లో వినియోగించబడిందని, మీ బ్యాంక్ ఖాతాకు ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పి రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆ వృద్ధుడిని తీవ్రంగా ఆ భయపెట్టారు.
ఆ తర్వాత వీడియో కాల్లోకి తీసుకుని.. మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. కేసుల నుంచి బయటపడాలంటే భారీగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఇలా దాదాపు వారం రోజుల పాటు రోజూ ఫోన్ చేస్తూ భయపెట్టడంతో.. వృద్ధుడు సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మాడు.
ముందుగా సెప్టెంబర్ 22న మూడు కోట్లు బదిలీ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత విడతలవారీగా మరో ఏడు కోట్లు పంపించాడు. ఇలా మొత్తం నాలుగు లావాదేవీల్లో 10 కోట్ల రూపాయలు.. నిందితులు చెప్పిన రెండు బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లాయి. ఇందుకోసం తన ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం బ్రేక్ చేసి డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇక్కడే బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. భారీ మొత్తంలో డబ్బును ఎందుకు, ఎవరి ఖాతాల్లోకి పంపుతున్నారంటూ ప్రశ్నించారు. అయితే పరువు పోతుందనే భయంతో వృద్ధుడు అసలు విషయం చెప్పలేదు. చివరకు ఖాతాలో భారీగా డబ్బు తగ్గిపోవడం గమనించిన ఆయన కుమారుడు కూడా ఆరా తీశాడు. అయినా మొదట్లో నిజం బయటపెట్టలేదు. పైగా ఆ పది కోట్లు తనకు పల్లీబఠాణీతో సమానమంటూ.. విషయాన్ని దాటవేశాడు.
ఇదిలా ఉండగా.. సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. దీంతో, ఇక చేసేదేం లేక… మంగళవారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. అందులో ఒక ఖాతాలో ఉన్న సుమారు రూ.7 కోట్లను ఫ్రీజ్ చేశారు.
మరో ఖాతాలోకి వెళ్లిన సుమారు రూ.3 కోట్లు మాత్రం అప్పటికే ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ డబ్బు దాదాపు 264 బ్యాంక్ ఖాతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయా ఖాతాల KYC వివరాలను పరిశీలిస్తూ.. డబ్బును తిరిగి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా, డిజిటల్ అరెస్ట్ పేరుతో పోలీసులు, సీబీఐ, ఈడీ అంటూ బెదిరించి, డబ్బులు అడగడం సైబర్ నేరగాళ్ల ట్రాప్. భారతదేశంలో చట్టపరంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానం లేదు. ఎవరైనా వీడియో కాల్లో అరెస్ట్ చేస్తున్నామని చెప్పినా.. డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేసినా వెంటనే అప్రమత్తం కావాలి. భయపడకుండా కాల్‌ను కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విజయవాడలో జరిగిన ఈ ఘటనలో సకాలంలో ఫిర్యాదు చేయడంతో రూ.7 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. సో.. బీ అలర్ట్.. బీ సేఫ్..!

Leave a Reply