YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!

యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య..
నాడు చెల్లెలి సమాధి సాక్షిగా అన్న శపథం..
కట్నం కోసం నిండు గర్భిణిని హత్య చేసిన భర్త!
చెల్లెలిని చంపాడన్న కసితో రగిలిపోయిన అన్న
మాటువేసి చెల్లెలి భర్తను చంపిన అన్న
ఎనిమిది సెకెన్లు.. తొమ్మిది కత్తిపోట్లు !
హత్య వెనుక అసలేం జరిగింది?

ఒక హత్యకు ప్రతీకార హత్యగా మారిన ఈ ఘటన ఇప్పుడు నిజామాబాద్‌లో సంచలనంగా మారింది. యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో అసలు కారణాలు, పాత కక్షలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన చెల్లెలి మరణానికి కారణం హరిబాబేనని భావించిన సంతోష్‌.. అప్పటి నుంచి పగతో రగిలిపోయాడని పోలీసులు చెబుతున్నారు. చివరకు సరైన సమయం కోసం ఎదురుచూసి.. వైష్ణవి భర్త హరిబాబును దారుణంగా హత్య చేశాడు.ఈ హత్యకు ముందు అసలేం జరిగింది? యూట్యూబర్‌ వైష్ణవి కుటుంబంలో మొదలైన విషాదం.. చివరకు మరో ప్రాణాన్ని ఎలా బలితీసుకుంది..?

కట్నం దాహంతో నిండు గర్భిణి అయిన తన చెల్లిని పొట్టనబెట్టుకున్నాడన్న కసి.. ఆ అన్న రక్తాన్ని మరిగించింది. చెల్లెలి సమాధి సాక్షిగా తీసుకున్న ప్రతీకార దీక్ష.. నడిరోడ్డుపై నెత్తుటేరులై పారింది. యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రతీకారం తీర్చుకున్న తర్వాత.. హరిబాబును తానే హతమార్చానంటూ వైష్ణవి అన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు.

ఎనిమిది సెకన్లు.. తొమ్మిది కత్తిపోట్లు! ఎప్పటికైనా చంపుతానని నాడు చెల్లి సమాధి దగ్గర శపథం చేశాడు! అవకాశం కోసం ఎదురుచూశాడు! చివరకు మాటువేసి మరీ హరిబాబును హతమార్చాడు..! యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్యలో సస్పెన్స్ వీడింది. హరిబాబును తానే చంపానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు వైష్ణవి సోదరుడు సంతోష్. తన చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదన్న సంతోష్‌, హత్య చేసిన తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోతున్నానని చెప్పాడు. అందరూ పోరాటం చేసి తనను శిక్ష పడకుండా చూసి త్వరగా బయటకు తీసుకురావాలని సంతోష్ కోరాడు.

నిన్న నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాలకు చాట్ బండార్‌లో చాట్ కోసం హరిబాబు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అప్పటికే అతని కోసం కారులో కాపుగాచిన సంతోష్‌… పరుగెత్తుకుంటూ వెళ్లి కత్తితో విరుచుకుపడ్డాడు. 8 సెకన్ల వ్యవధిలో 9 సార్లు కత్తితో దాడి చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని రెప్పపాటులో అక్కడ్నుంచి కారులో వెళ్లిపోయాడు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి, చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి ‘వైషు అమ్మ’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో అదనపు కట్నం కోసం ఆరునెలల క్రితం హత్యచేశాడు హరిబాబు. తర్వాత పారిపోయిన హరిబాబును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈమధ్యనే బెయిల్‌పై విడుదలైన హరిబాబు ప్రాణభయంతో కోరుట్ల వెళ్లకుండా నిజామాబాద్‌లోని ఉంటున్నాడు. ఆర్ ఆర్ చౌరస్తాలో మక్కబుట్టలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆ రోజు తన చెల్లి సమాధి దగ్గర గుండె పగిలేలా ఏడ్చిన సంతోష్.. హరిబాబును ఎప్పటికైనా చంపేస్తానని సమాధి సాక్షిగా శపథం చేశాడు. అప్పటి నుంచి పగతో రగిలిపోయిన వైష్ణవి అన్న సంతోష్.. పక్కా స్కెచ్‌తో సరైన సమయం కోసం చూసి అన్నంత పని చేశాడు. అయితే చెల్లిని చంపినవాడిని.. హత్యచేసిన తన భర్తను ప్రజలే కాపాడాలని విజ్ఞప్తి చేశారు సంతోష్‌ భార్య.

మరోవైపు కారులో సంతోష్‌తో పాటు వైష్ణవి తల్లి కూడా ఉందని మృతుడు హరిబాబు తల్లి చెబుతోంది. ప్రాణ భయంతోనే తాము నిజామాబాద్‌ వచ్చి ఉంటుంన్నామని చెబుతోంది.

ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది..? కారులో ఇంకెవరు ఉన్నారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాడు కట్నం దాహం వైష్ణవి ప్రాణాన్ని బలితీసుకుంటే.. నేడు అదే పగ హరిబాబు ప్రాణం తీసి సంతోష్‌ను హంతకుడిగా మార్చింది. చెల్లికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన అన్న రక్త తర్పణంతో.. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published.