ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..!
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జీవో నంబర్ 581 రద్దు..
జీవో నంబర్ 592 అమల్లోకి..!
మళ్లీ పాత విధానంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీ
కొత్త జీవోతో పాత విధానానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
అసలు జీవో 581లో ఏముంది? కొత్త 592తో ఏం మారింది?
ఏపీ ప్రజలకు రెసిడెన్స్ సర్టిఫికెట్ విషయంలో కీలక మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం మార్పులు చేసింది. రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటే ఇకపై ఏం చేయాలి?
2015 జూన్ 20న ప్రభుత్వం జీవో నంబర్ 581ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్ల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు. ప్రజల నివాసానికి ఆధారంగా ఆధార్, రేషన్ కార్డులను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే.. రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేకంగా సర్టిఫికెట్ తీసుకునే విధానం అప్పట్లో నిలిచిపోయింది. అందుబాటులో ఉన్న ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలను నివాస రుజువులుగా ఉపయోగించే విధానం అమల్లోకి వచ్చింది.
అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. విద్య, ఉద్యోగాలు, ఆధార్ నమోదు, ఓటరు జాబితాలో పేరు నమోదు లేదా సవరణ వంటి వివిధ అవసరాల్లో కొన్నిసార్లు అధికారికంగా నివాసాన్ని ధ్రువీకరించే పత్రం అవసరమవుతోంది. దీంతో రెసిడెన్స్ సర్టిఫికెట్లను మళ్లీ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో జారీ చేసిన జీవో నంబర్ 581ను రద్దు చేసి.. జీవో నంబర్ 592ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో తహసీల్దార్లకు మళ్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది.
అంటే.. ఇకపై మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరమైతే తహసీల్దార్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ నివాసాన్ని నిర్ధారించే తగిన ఆధారాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత తహసీల్దారు నివాసాన్ని ధ్రువీకరించి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఒకవేళ మీ వద్ద సరైన నివాస ఆధారాలు లేకపోతే.. ఆ కారణంతో దరఖాస్తు తిరస్కరించాల్సిన అవసరం లేదు. తహసీల్దారు స్థానికంగా విచారణ నిర్వహించి.. మీరు అక్కడ నివసిస్తున్నట్లు ధ్రువీకరించిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రతి పని కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నది కాదు. ఏ అవసరానికి ఏ పత్రం కావాలనేది సంబంధిత శాఖ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరమైన సందర్భాల్లో ఇప్పుడు తహసీల్దార్ ద్వారా పొందే అవకాశం మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే ఆధార్, రేషన్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్ వంటి పత్రాలు ఉన్నప్పుడు.. మళ్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఎంతవరకు ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం అవసరమైన సందర్భాల్లో ప్రజలకు అధికారిక నివాస ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది.
సో.. మొత్తం విషయాన్ని సింపుల్‌గా చెప్పాలంటే.. 2015లో జీవో 581తో నిలిచిపోయిన తహసీల్దార్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ.. ఇప్పుడు జీవో 592తో మళ్లీ ప్రారంభమైంది. ఇక రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరమైన వారు తగిన ఆధారాలతో తహసీల్దార్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే తాజా నిర్ణయంలో కీలక మార్పు.

Leave a Reply