2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు

ఎండలు ఏడాది ఏడాదికి ఎందుకు పెరుగుతున్నాయి? గ్రామాల కంటే నగరాల్లో ఎందుకు ఎక్కువ వేడి అనిపిస్తోంది? సాయంత్రం సూర్యుడు అస్తమించినా.. రాత్రి వరకు రోడ్లు, భవనాలు ఎందుకు వేడిగానే ఉంటున్నాయి? దీనికి కేవలం క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణం కాదు. మనం నిర్మిస్తున్న నగరాలే ఇప్పుడు “హీట్ ట్రాప్”లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు “అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” అని పిలుస్తున్నారు. ఈ ప్రభావం వల్ల నగరాల ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామాల కంటే 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏమిటి? ఎందుకు వస్తోంది? దీని నుంచి బయటపడే మార్గాలేంటి?

మనం మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లినప్పుడు… ఎండ కంటే నేల నుంచి వచ్చే వేడే ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ భవనాలు, గాజు టవర్లు, వాహనాల నుంచి వెలువడే వేడి… ఇవన్నీ కలిసి నగరాలను ఒక పెద్ద ఓవెన్‌లా మారుస్తున్నాయి. పగటిపూట సూర్యరశ్మిని ఎక్కువగా పీల్చుకున్న కాంక్రీట్, తారు రోడ్లు, ఇనుము నిర్మాణాలు ఆ వేడిని రాత్రి వరకు నెమ్మదిగా విడుదల చేస్తుంటాయి. అందుకే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నగరాల్లో ఉక్కపోత తగ్గడం లేదు. ఇదే ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’. వాతావరణ మార్పులతో పాటు మన నగరాల నిర్మాణ విధానమే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కేవలం అసౌకర్యానికే కాదు… ఆరోగ్యానికీ తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. అధిక వేడి కారణంగా శరీరంలో నీరు వేగంగా తగ్గి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీంతో మూత్రం పరిమాణం తగ్గి, కాల్షియం, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు గడ్డకట్టి కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, ఎక్కువ రోజుల పాటు తీవ్రమైన ఎండలకు గురైతే కిడ్నీల పనితీరు దెబ్బతిని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే… నగరాలు తమ చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువ వేడిని గ్రహించి, ఎక్కువసేపు నిల్వ చేసుకోవడం. దీనికి కేవలం వాతావరణ మార్పులే కాదు… మనుషులు చేపట్టే నిర్మాణాలు, తగ్గుతున్న పచ్చదనం, పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలూ ప్రధాన కారణాలు. ఇటీవల నేచర్‌ సిటీస్‌ (Nature Cities) జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం… భారత నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు దాదాపు 60 శాతం వరకు పట్టణీకరణే కారణమని తేలింది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో శ్రేణి నగరాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఒకవైపు క్లైమేట్ చేంజ్ ప్రభావం పెరుగుతుంటే… మరోవైపు ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్న నగరాల నిర్మాణం కూడా వేడిని మరింత తీవ్రం చేస్తోందన్న మాట.

అసలు నగరాల్లో వేడి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? గ్రామాల్లో చెట్లు, పొలాలు, మట్టి నేలలు సూర్యరశ్మిని ఎక్కువగా పీల్చుకోకుండా సహజంగా చల్లదనాన్ని కాపాడుతాయి. కానీ నగరాల్లో వాటి స్థానంలో కాంక్రీట్, తారు రోడ్లు, గాజు భవనాలు వచ్చాయి. ఇవి వేడిని బాగా గ్రహించి… చాలా సేపు నిల్వ ఉంచుతాయి. చెట్లు తగ్గిపోవడం వల్ల నీడ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా నగర ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి.

ఇంకో ప్రధాన కారణం… ఎయిర్ కండిషనర్లు. ఎందుకంటే.. ఇంట్లో చల్లదనం కల్పించే ఏసీలు.. బయటకు మాత్రం వేడిగాలినే విడుదల చేస్తాయి. లక్షల సంఖ్యలో ఏసీలు ఒకేసారి పనిచేస్తే… ఆ వేడి మొత్తం బయట వాతావరణంలో చేరుతుంది. దీంతో వీధుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఇదే సమయంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతుంది. అంతేకాదు… ఎత్తైన భవనాలు దగ్గర దగ్గరగా ఉండటంతో గాలి సహజంగా ప్రవహించే అవకాశం తగ్గిపోతోంది. ట్రాఫిక్ నుంచి వచ్చే వేడి, పరిశ్రమలు, జనరేటర్లు… ఇవన్నీ కలసి నగరాల్లో వేడిని బంధిస్తాయి.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) అంచనా ప్రకారం… ప్రపంచంలోని నగరాలు గ్లోబల్ సగటుతో పోలిస్తే దాదాపు రెండింతల వేగంతో వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లకు పైగా పట్టణ ప్రజలు తీవ్రమైన వేడి ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

ఇక, భారత్‌లో పరిస్థితి మరింత సవాల్‌గా మారుతోంది. ప్రతి ఏడాది నగరాలు విస్తరిస్తున్నాయి. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, భారీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మితమవుతున్నాయి. కానీ అదే స్థాయిలో చెట్లను మాత్రం పెంచడం లేదు. పచ్చదనం తగ్గుతోంది. దీంతో ప్రతి వేసవిలో నగరాలు మరింత వేడెక్కుతున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా ఇప్పుడిదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణంలోనే వేడిని తగ్గించే విధానాలు ఉండాలని సూచిస్తున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం… ఇలాంటి పాసివ్ కూలింగ్ పద్ధతులను అమలు చేస్తే విద్యుత్ వినియోగం 35 శాతం వరకు తగ్గవచ్చు. ఇళ్ల లోపలి ఉష్ణోగ్రతలు సుమారు 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఏసీలపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతుంది. మరో ముఖ్యమైన అంశం… గాజు భవనాలు. ఆధునిక నిర్మాణాలకు చిహ్నంగా భావించే గ్లాస్ టవర్లు భారత వాతావరణానికి అంతగా అనుకూలం కావని నిపుణులు చెబుతున్నారు. గాజు సూర్యరశ్మిని ఎక్కువగా లోపలికి అనుమతించడం వల్ల భవనాలు మరింత వేడెక్కుతాయి. దాంతో వాటిని చల్లబరచడానికి భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి బదులుగా భవనాలపై నేరుగా ఎండ పడకుండా నీడనిచ్చే నిర్మాణాలు, వేడిని తక్కువగా గ్రహించే నిర్మాణ పదార్థాలు, సహజ గాలి వచ్చేలా డిజైన్లు, గ్రీన్ వాల్స్, గ్రీన్ రూఫ్స్ వంటి పద్ధతులు అనుసరించాలని సూచిస్తున్నారు.

మొత్తంగా, ఎండలు పెరగడానికి క్లైమేట్ చేంజ్ ఒక కారణమైతే… నగరాల నిర్మాణ విధానం మరో ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో మనం నిర్మించే నగరాలే… మన భవిష్యత్ ఉష్ణోగ్రతలను నిర్ణయించబోతున్నాయి. కాబట్టి అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడే పట్టణ ప్రణాళికలు అమలు చేయడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. అప్పుడే మన నగరాలు నిజమైన స్మార్ట్ సిటీలుగా, నివసించడానికి అనుకూలమైన చల్లని నగరాలుగా మారగలవు.

Leave a Reply

Your email address will not be published.