Rangam Bhavishyavani 2026: రంగం భవిష్యవాణి మాట తప్పారు.. ప్రాణ నష్టం తప్పదు

బోనాలు వచ్చాయంటే తెలంగాణలో పండుగ సందడి మొదలవుతుంది.. కానీ లష్కర్‌ బోనాల్లో మాత్రం ఓ ఘట్టం కోసం అందరి చూపు ఎదురుచూస్తుంది. అదే రంగం భవిష్యవాణి.. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత చెప్పే మాటలను స్వయంగా అమ్మవారి వాక్కుగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది ఆమె చెప్పే భవిష్యవాణిలో వర్షాలు, పంటలు, ప్రజల పరిస్థితులు, రాబోయే ప్రమాదాల గురించి కీలక వ్యాఖ్యలు ఉంటాయి. మరి ఈసారి స్వర్ణలత ఏం చెప్పారు? అమ్మవారు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? అసలు మాతంగి స్వర్ణలత ఎవరు? ఈ రంగం భవిష్యవాణి వెనుక ఉన్న చరిత్ర ఏంటి?


ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో జరిగే బోనాల్లో లష్కర్‌ బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు బోనాలు, రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. రంగం రోజున పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పే మాతంగి స్వర్ణలత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.


ముందుగా, అసలు మాతంగి స్వర్ణలత ఎవరు? తరతరాలుగా వస్తున్న ఈ భవిష్యవాణి సంప్రదాయంలో ఆమె పాత్ర ఏంటి? ఓసారి చూస్తే.. స్వర్ణలత ఎరుపుల నర్సింహ, ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి అమ్మవారి గుడి వద్ద పంబజోడి వాయించేవారు. తల్లి కూడా భర్తకు తోడుగా జేగంట మోగించేవారు. చిన్నతనంలోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేసి, ఆ తర్వాత ఆమె జీవితాన్ని మహంకాళి అమ్మవారి సేవకు అంకితం చేశారు.


స్వర్ణలత పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. ఆమె కుటుంబంలోని ఆడపిల్లలు తరతరాలుగా అమ్మవారి సేవకు అంకితమవుతూ వచ్చారు. 1996 వరకు ఆమె అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు. ఆమె మరణం తర్వాత స్వర్ణలత ఈ బాధ్యతను స్వీకరించారు. గత 25 ఏళ్లుగా ఆమె రంగం భవిష్యవాణి వినిపిస్తున్నారు. అంతకుముందు కూడా ఆమె పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు.


ప్రస్తుతం స్వర్ణలత తన తమ్ముడితో కలిసి ఉంటూ సాధారణ టైలర్‌గా జీవిస్తున్నారు. అయితే బోనాల సమయంలో మాత్రం ఆమె ప్రత్యేక నియమాలు పాటిస్తారని చెబుతారు. రంగం రోజున పసుపు, కుంకుమ, ముక్కెర, దండలు ధరించి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత పచ్చి మట్టి కుండపై నిలబడి పూజారి అడిగే ప్రశ్నలకు సమాధానాల రూపంలో భవిష్యవాణి వినిపిస్తారు. ఈ సమయంలో తనకు ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని స్వర్ణలత చెబుతుంటారు.


ఇక తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, జీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఆషాఢ మాస లష్కర్‌ బోనాల జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. పసుపు, కుంకుమ, వేపమండలతో అలంకరించిన బోనాలను మహిళలు తలపై ధరించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్‌ డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.


లష్కర్‌ బోనాల జాతరలో రెండో రోజైన ఆగస్టు 3న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత పవిత్రమైన రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి అమ్మవారిని తనలోకి ఆవహించుకుని భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంపై అమ్మవారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్వర్ణలత పేర్కొన్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏ ఆపద వచ్చినా అమ్మవారు కాపాడుతూనే ఉన్నారని, అయినప్పటికీ తన మాటను ఆచరించడం లేదని అన్నారు.


అదేవిధంగా, ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్వర్ణలత హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయని, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రమాదాలు ప్రతి ఏడాది జరుగుతున్నప్పటికీ, ఈసారి మరింత ఎక్కువగా ఉంటాయని భవిష్యవాణిలో వినిపించారు. ముఖ్యంగా ప్రజలు వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారని, ఈ ఏడాది ప్రమాదాలు, ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు. ఈ ఏడాది చాలా బాధగా, ఇబ్బందిగా ఉందని చెబుతూ, ప్రజలు సంతోషం లేకుండా చేస్తున్నారని, అహంకారం ఎక్కువైపోయిందని అన్నారు. తల్లిందండ్రులు గాలికి వదిలేసిన పిల్లలను మాత్రం తాను కాపాడుతానని చెప్పారు.


అంతేకాదు.. తనకు కావాల్సింది ఒక్కటేనని, తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరిందల్లా ఇస్తానని స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని, ఎవరు అడ్డుపుల్ల వేసినా తాను ఊరుకోనని హెచ్చరించారు. ఆరు నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ప్రాణనష్టం జరిపిస్తానని, తనకు అడ్డువచ్చిన వారిని పాదాల కింద వేసి నలిపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటాయని స్వర్ణలత చెప్పడంతో రంగం భవిష్యవాణి ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.