US H-1B Visa Rule Change: ట్రంప్ కొత్త రూల్!.. హెచ్-1బీ రెన్యువల్స్‌పై అదనపు ఫీజు.. భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్



వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే హెచ్-1బీ వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వీసా రెన్యువల్స్‌పైనా అదనపు ఫీజు విధించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఆధారపడే పెద్ద టెక్, ఐటీ కంపెనీలపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఈ కొత్త ఫీజు ఎవరికి వర్తిస్తుంది? ఎంత చెల్లించాల్సి ఉంటుంది? భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఎంత?

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణులకు హెచ్-1బీ, ఎల్-1 వీసాలు కీలకం. ముఖ్యంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌లో చాలామంది ఈ వీసాలపైనే అమెరికాలో తమ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఉద్యోగులను కొనసాగించేందుకు కంపెనీలు మరింత ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ, ఎల్-1 వీసాల రెన్యువల్ లేదా ఎక్స్‌టెన్షన్ పిటిషన్లపైనా అదనపు ఫీజు విధించే ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ పరిధిని విస్తరించేలా నిబంధనలను రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫైనల్ రూల్‌మేకింగ్ దశలో ఉన్నప్పటికీ.. ఇంకా అమల్లోకి రాలేదు.

అసలు ఈ ఫీజు ఎవరికి వర్తిస్తుంది? అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో.. సగానికి పైగా ఉద్యోగులు హెచ్-1బీ లేదా ఎల్-1 స్టేటస్‌లో ఉంటే.. ఆ కంపెనీలకు ఈ అదనపు ఫీజు వర్తించే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా విదేశీ నిపుణులపై ఎక్కువగా ఆధారపడే పెద్ద టెక్నాలజీ, ఐటీ సర్వీసెస్ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.

ప్రస్తుతం అర్హత కలిగిన సంస్థలు కొత్త హెచ్-1బీ ఉద్యోగిని అమెరికాలోకి తీసుకురావడానికి లేదా ఉద్యోగి ఎంప్లాయర్ మారినప్పుడు అదనంగా 4 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్-1 పిటిషన్లకు ఈ అదనపు ఫీజు 4,500 డాలర్లుగా ఉంది. అయితే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగి అమెరికాలోనే కొనసాగుతూ వీసాను ఎక్స్‌టెండ్ చేసుకునే సమయంలో కూడా ఇదే తరహా అదనపు ఫీజు చెల్లించాల్సి రావచ్చు.

ఇక్కడే భారతీయ ఉద్యోగులకు ఈ అంశం కీలకంగా మారుతోంది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. USCIS వెల్లడించిన 2025 ఆర్థిక సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే.. హెచ్-1బీ అనుమతుల్లో ఎక్కువ భాగం కొత్తగా అమెరికాకు వచ్చే ఉద్యోగుల కోసం కాకుండా.. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల కొనసాగింపునకు సంబంధించినవే.

2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4.06 లక్షల హెచ్-1బీ పిటిషన్లు ఆమోదం పొందాయి. వీటిలో సుమారు 2.91 లక్షలు.. అంటే దాదాపు 71 శాతం.. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల కొనసాగింపునకు సంబంధించినవే. అంటే హెచ్-1బీ వీసా ఎక్స్‌టెన్షన్స్‌కు ఈ అదనపు ఫీజు వర్తిస్తే.. కంపెనీలపై దాని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది.

ముఖ్యంగా భారతీయుల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని గణాంకాలు సూచిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ మూడు సంవత్సరాల గడువు దాటి హెచ్-1బీ వీసా ఎక్స్‌టెన్షన్ పొందిన వారిలో భారతీయుల సంఖ్య భారీగా ఉంది. దాదాపు 2.26 లక్షల మంది భారతీయులకు హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్‌ ఆమోదం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది మొత్తం హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ ఆమోదాల్లో దాదాపు 77.6 శాతంగా ఉంది.

అంటే అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న భారతీయులను కొనసాగించేందుకు కంపెనీలు చేసే వీసా ఎక్స్‌టెన్షన్ ప్రక్రియపైనా అదనపు ఫీజు వస్తే.. భారతీయ ప్రొఫెషనల్స్‌పై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ ఫీజును నేరుగా ఉద్యోగులే చెల్లించాలా? లేక కంపెనీలే భరించాలా? అనేది ఉద్యోగ ఒప్పందాలు, కంపెనీ విధానాలు, తుది నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

ఇక ఈ ప్రతిపాదన ప్రభావం పెద్ద టెక్ కంపెనీలపై ఎంత ఉంటుందన్నదీ ఆసక్తికరంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించి అత్యధిక హెచ్-1బీ పిటిషన్ ఆమోదాలు అమెజాన్‌కు వచ్చాయి. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు ఉన్నాయి.

అయితే ఈ గణాంకాలు ప్రత్యేకమైన ఉద్యోగుల సంఖ్యను సూచించవు. ఒకే హెచ్-1బీ ఉద్యోగికి ఏడాదిలో ఉద్యోగ మార్పు, వర్క్ లొకేషన్ మార్పు వంటి కారణాలతో ఒకటి కంటే ఎక్కువ పిటిషన్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. విదేశీ నిపుణులపై ఆధారపడే కంపెనీలకు వీసా ఫీజుల పెంపు ఎంతటి ఆర్థిక భారాన్ని మోపగలదో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, ఎల్-1 వీసా ఎక్స్‌టెన్షన్(Extension) పై అదనపు ఫీజు ప్రతిపాదన రావడం.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది..

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కొత్త ఫీజు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫైనల్ రూల్‌మేకింగ్ స్టేజ్ లో ఉంది. ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించిన తర్వాతే.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎవరెవరికి వర్తిస్తుంది? ఏ పిటిషన్లకు ఎంత ఫీజు చెల్లించాలి? అనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. హెచ్-1బీ, ఎల్-1 వీసా రెన్యువల్స్‌పై అదనపు ఫీజు అమల్లోకి వస్తే.. కంపెనీలపై భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. మరి ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.