Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్‌కు రెండు సర్జరీలు! అసలు ఏమైంది?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గత వారం ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత, సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో ఆయన చికిత్సకు సిద్ధమయ్యారు. వాస్తవానికి రెండు భుజాలకు సర్జరీ చేయాల్సి ఉండగా ఆస్పత్రి డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఓ భుజానికి సర్జరీ చేసి.. కొద్దిరోజుల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయనున్నారు. అసలు పవన్‌కు ఏమైంది? ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్యేంటి? ఎందుకు సర్జరీ అవసరమైంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం పవన్ కళ్యాణ్‌కు ఓ భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆరోగ్య సమస్య కారణంగానే శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అయితే, సర్జరీకి ముందు పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. జనసేన కీలక నేతలతో సమావేశమయ్యారు. పార్టీ కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తాను కొంతకాలం విశ్రాంతిలో ఉండనున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులను వేగవంతం చేయాలని నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

కాగా, పవన్‌కు ఈ ఆరోగ్య సమస్య ఎలా వచ్చింది?
వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు దెబ్బతిన్నాయి. సినీ జీవితంలో చేసిన యాక్షన్ సన్నివేశాలు, ప్రమాదకర స్టంట్లు, ఆ తర్వాత రాజకీయాల్లో నిరంతర పర్యటనలు, ఎన్నికల ప్రచారం, భారీ రోడ్ షోలు, అభిమానులతో నిరంతరంగా చేతులు ఊపడం, భుజాలపై పడిన అధిక శారీరక ఒత్తిడి వల్ల పాత గాయాలు మళ్లీ తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. మొదట్లో తాత్కాలిక చికిత్సలతో ఉపశమనం లభించినా, ఇటీవలి కాలంలో నొప్పి పెరగడంతో వైద్యులు శస్త్రచికిత్సను సూచించారు.

అసలు రొటేటర్ కఫ్ అంటే ఏమిటి?
మన భుజం సులభంగా కదలడానికి, చేతిని పైకి ఎత్తడానికి, తిప్పడానికి నాలుగు ప్రధాన కండరాలు, వాటి స్నాయువులు కలిసి పనిచేస్తాయి. ఈ కండరాల సముదాయాన్నే వైద్య పరిభాషలో రొటేటర్ కఫ్ అంటారు. ఇవే భుజం కీలును స్థిరంగా ఉంచుతూ చేతి కదలికలు సజావుగా జరిగేలా చేస్తాయి.అయితే అధిక శారీరక ఒత్తిడి, ప్రమాదాలు, పదే పదే ఒకే రకమైన కదలికలు చేయడం లేదా వయస్సు పెరగడం వల్ల ఈ కండరాలు, స్నాయువులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో రొటేటర్ కఫ్ గాయం ఏర్పడుతుంది. ఈ గాయం స్వల్ప చీలిక నుంచి పూర్తిగా కండరాలు తెగిపోయే స్థాయి వరకు ఉండొచ్చు. గాయం తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది. ప్రారంభ దశలో మందులు, ఫిజియోథెరపీతో నయం చేయొచ్చు. కానీ కండరాలు తీవ్రంగా దెబ్బతింటే శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది.

ఇక, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే…. రొటేటర్ కఫ్ సమస్య ఉన్నవారిలో సాధారణంగా భుజంలో నిరంతర నొప్పి ఉంటుంది. చేతిని పైకి ఎత్తడం, వెనక్కి తిప్పడం, బరువులు ఎత్తడం కష్టంగా మారుతుంది. రాత్రివేళ నొప్పి మరింత ఎక్కువై నిద్రకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కొందరిలో చేతికి బలం తగ్గిపోవడం, భుజం కదిలించినప్పుడు శబ్దం రావడం కూడా కనిపిస్తుంది.

నెక్స్ట్‌, చికిత్స ఎలా ఉంటుంది?అనే విషయానికొస్తే..
ప్రారంభ దశలో విశ్రాంతి, ఫిజియోథెరపీ, నొప్పి నివారణ మందులు, ఐస్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. అయితే కండరాలు లేదా స్నాయువులు తీవ్రంగా చిట్లిపోయినప్పుడు ఆర్థ్రోస్కోపిక్ లేదా ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స అనంతరం కొన్ని వారాల పాటు భుజానికి సపోర్ట్ ధరించడం, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయడం ద్వారా క్రమంగా సాధారణ కదలికలు తిరిగి వస్తాయి.

ఇప్పుడు, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వైద్యులు సర్జరీ అనంతరం కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సరైన సమయంలో చికిత్సతో పాటు రెస్ట్‌ తీసుకుంటే రొటేటర్ కఫ్ గాయాల నుంచి చాలా వరకూ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.