Telangana Crime | కన్నబిడ్డలతో సహా “6 హత్యలు” తెలంగాణలో ఊచకోత!

ఒక పోక్సో కేసు… బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు… ఆ తర్వాత జరిగిన వరుస హత్యలు… తెలంగాణను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నారులు, ఓ మైనర్ బాలిక కూడా ఉండటం మరింత కలకలం రేపింది. అసలు ఈ ఘటనకు దారితీసిన పరిణామాలు ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు?

రంగారెడ్డి జిల్లా.. షాబాద్ మండలం.. దైవాలగూడ గ్రామంలో జులై 11 తెల్లవారుజామున జరిగిన దారుణ హత్యాకాండ స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. 28 ఏళ్ల రాజ్ కుమార్ తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకు, పక్కింటి 17 ఏళ్ల మైనర్‌ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మలను కత్తితో పీకలు కోసి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఇంతమందిని చంపిన రాజ్‌కుమార్‌ ప్రస్తుతం పారిపోయాడు. అతని కోసం పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి.

మరోవైపు.. అతను మొదటి నుంచి కర్కోటకుడే అని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై ఇదివరకే ఓ కేసు ఉంది. భూ తగాదాలో ఇద్దర్ని చావగొట్టడంతో, షాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మే 16న పక్కింట్లోని 17 ఏళ్ల బాలికను వేధించాడనే ఆరోపణలతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, మే 16న రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా పోలీసులు అతన్ని మే 26న అరెస్టు చేశారు. ఐతే, కొంతకాలం జైలులో ఉన్న అతను శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆపై, రాత్రికి రాత్రి ఈ హత్యాకాండకు తెరతీశాడు.

దర్యాప్తు అధికారులు చెబుతున్న దాని ప్రకారం, బెయిల్‌పై విడుదలైన తర్వాత రాజ్‌కుమార్ తనపై కేసు పెట్టిన కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున ముందుగా తన ఇంట్లో ఉన్న భార్య సరితపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత, నిందితుడు పక్కనే ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ జరిగిన ఘర్షణలో బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మపై దాడి జరిగిందని, వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఐతే, 17 ఏళ్ల బాలికను మాత్రం అక్కడి నుంచి తీసుకెళ్లి గ్రామ శివారులో హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

2018లో రాజ్‌కుమార్ ప్రేమ పేరుతో సరితను ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని చెప్పారు. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సరిత తండ్రి కొంతకాలం క్రితం మరణించాడని వారు తెలిపారు. పెళ్లి తర్వాత కొద్దికాలానికే షాబాద్‌కు చెందిన ఓ మైనర్ బాలికతో రాజ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడిందని, అదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఆరోపించారు. ఆ మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయని, ఒకసారి రాజ్‌కుమార్ ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని చెప్పారు.దీంతో, మే 16న ఆ బాలిక ఫిర్యాదు మేరకు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైందని, తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు తీవ్ర కక్షతో తమ కుమార్తె సరితతో పాటు ఇద్దరు చిన్నారులను ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేశాడని జయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన ఈ ఆరోపణలను పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు.

కాగా, ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, సీఐ కాంతారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే దైవాలగూడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ షాబాద్-కంది రహదారిపై ధర్నా నిర్వహించారు. అలాగే, పోక్సో కేసు నమోదైన తర్వాత బాధిత కుటుంబానికి తగిన భద్రత కల్పించలేదని కొందరు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

చట్ట నిపుణుల అభిప్రాయం ప్రకారం, బాధిత కుటుంబాలకు ముప్పు ఉన్నట్లు భావించిన సందర్భాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు, నిరంతర పర్యవేక్షణ, రిస్క్ అసెస్‌మెంట్ వంటి వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. అలాగే ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.

మొత్తంగా, ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, పోక్సో కేసుల్లో బాధితుల భద్రత, బెయిల్‌పై విడుదలైన నిందితుల పర్యవేక్షణపై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published.