ఏపీ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇప్పటివరకు పగలు ప్రయాణించే వందే భారత్ రైళ్లను చూశాం.. కానీ ఇప్పుడు రాత్రి ప్రయాణానికి అనువుగా వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రాబోతోంది. బెంగళూరు-ముంబై మార్గంలో నడవనున్న ఈ సెమీ హైస్పీడ్ స్లీపర్ రైలు.. ఏపీలోని అనంతపురం, గుంతకల్ మీదుగా ప్రయాణించనుంది.
ఇక బెంగళూరు నుంచి ముంబై వెళ్లే ప్రయాణికులకు ప్రధానంగా కలిసొచ్చేది జర్నీ టైమ్. సాధారణంగా ఈ మార్గంలో ముంబై చేరుకోవడానికి దాదాపు 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. కానీ వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే.. ఇదే జర్నీని సుమారు 15 నుంచి 16 గంటల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయాలనుకునే వాళ్లకు ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం.. బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11 గంటల 55 నిమిషాల సమయంలో ముంబై చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో అనంతపురం, గుంతకల్ వంటి స్టేషన్లలో ఆగుతుంది. దీంతో రాయలసీమ నుంచి ముంబై వైపు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
ఇక ఈ స్లీపర్ ట్రైన్లో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు కూడా ఉండనున్నాయి. మొత్తం 16 కోచ్‌లు ఉండగా.. అందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ కోచ్‌లు ఉంటాయని సమాచారం. మొత్తం సుమారు 823 మంది ప్రయాణించేలా కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రయాణికులకు భోజన సదుపాయం కూడా ఉంటుంది. టికెట్ ధరలోనే బ్రేక్‌ఫాస్ట్, భోజనం వంటి క్యాటరింగ్ సదుపాయాలు కలిపి ఉండేలా ప్రతిపాదించారు. అంటే రాత్రి ట్రైన్ ఎక్కి హాయిగా నిద్రపోయి.. ఉదయం లేచేసరికి ముంబైకి దగ్గర్లో ఉండొచ్చు.
టికెట్ ధర విషయానికి వస్తే.. థర్డ్ ఏసీ టికెట్ సుమారు 3 వేల రూపాయల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే ఇది ఇంకా తుది ధర కాదు. రైల్వే శాఖ అధికారికంగా ఛార్జీలను ప్రకటించాల్సి ఉంది. అలాగే ఈ రైలును ఇరు మార్గాల్లో వారానికి ఆరు రోజులు నడిపే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు వందే భారత్ స్లీపర్ ప్రత్యేకత ఏంటి? అంటే.. సాధారణ రైళ్ల మాదిరిగా దీనికి ప్రత్యేకంగా ముందు భాగంలో ఇంజిన్ ఉండదు. మెట్రో రైళ్ల తరహాలో కోచ్‌ల కిందనే మోటార్లు అమర్చిన సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్ సెట్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీనివల్ల వేగంగా యాక్సిలరేట్ కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
వందే భారత్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, ఆధునిక సీటింగ్, మెరుగైన ఇంటీరియర్ వంటి సదుపాయాలు ఇప్పటికే ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే టెక్నాలజీని రాత్రి ప్రయాణానికి అనుగుణంగా మార్చి స్లీపర్ కోచ్‌లతో తీసుకొస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. బెంగళూరు-ముంబై మధ్య ప్రయాణించే వాళ్లకు, ముఖ్యంగా అనంతపురం, గుంతకల్ మీదుగా వెళ్లే రాయలసీమ ప్రయాణికులకు ఈ వందే భారత్ స్లీపర్ కీలకమైన రవాణా ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. 24 గంటల వరకు పట్టే ప్రయాణాన్ని 16 గంటల లోపే పూర్తి చేసే అవకాశం.. రాత్రంతా ప్రయాణించి ఉదయానికే గమ్యస్థానం చేరుకునే సౌకర్యం.. ఇవన్నీ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అయితే ఈ రైలు ఎప్పటి నుంచి పట్టాలెక్కనుంది? టైమింగ్స్, స్టాపేజీలు, టికెట్ ధరలపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply