దేవుడు ప్రత్యక్షమై.. “నీకు ఏం కావాలో కోరుకో” అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు..? మంచి మార్కులు రావాలని.. మంచి ఉద్యోగం రావాలని.. మంచి భవిష్యత్తు కావాలని.. తమ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకదా… కానీ.. తెలంగాణకు చెందిన ఓ చిన్నారి మాత్రం ఆ దేవుడిని ఒక్కటే కోరుకుంది. ఆ చిన్నారికి డబ్బు అక్కర్లేదు.. బొమ్మలు అక్కర్లేదు.. కొత్త బట్టలు అక్కర్లేదు.. చదువులో మంచి మార్కులు కూడా అడగలేదు. ఆమె కోరుకున్నది ఒక్కటే.. “నాకు మా నాన్న కావాలి..” ఈ నాలుగు పదాల సమాధానం చదివిన టీచర్ కళ్లు ఒక్కసారిగా చమ్మగిల్లాయి. ఆ సమాధానం చూసిన ప్రతి ఒక్కరి మనసు బరువెక్కింది.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో ఇటీవల సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఐదో తరగతి తెలుగు పరీక్షలో.. “యాదాద్రి నరసింహస్వామి ప్రత్యక్షమై.. నీకు ఏం కావాలో కోరుకో అంటే.. ఏం కోరుకుంటావు?” అంటూ ఓ చిన్న ప్రశ్న ఇచ్చారు. విద్యార్థులు తమకు నచ్చిన కోరికలను పరీక్ష పత్రాల్లో రాశారు. కానీ.. ఓ చిన్నారి రాసిన సమాధానం చూసి.. ఆ పేపర్ దిద్దుతున్న టీచర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ చిన్నారి రాసిన మాటలను మళ్లీ మళ్లీ చదివారు. ఎందుకంటే.. ఆ సమాధానంలో ఓ చిన్నారి గుండెల్లో దాగున్న తీరని బాధ కనిపించింది.
నాకు మా నాన్న కావాలి..” అని ఆ చిన్నారి జవాబుగా రాసింది. ఈ ఒక్క వాక్యం వెనుక ఆ చిన్నారి గుండెల్లో ఇంతటి విషాదం ఉందని మొదట ఎవరికీ తెలియదు. ఆ సమాధానం గురించి ఉపాధ్యాయులు ఆరా తీస్తే.. రెండేళ్ల క్రితమే ఆ చిన్నారి తన తండ్రిని కోల్పోయినట్లు తెలిసింది. రెండేళ్లు గడిచిపోయాయి.. కాలం ముందుకు వెళ్లిపోయింది.. కానీ ఆ చిన్నారి మనసు మాత్రం ఇంకా నాన్న జ్ఞాపకాల దగ్గరే ఆగిపోయింది. అందుకే కావచ్చు.. దేవుడు వచ్చి “ఏం కావాలి?” అని అడిగితే.. ఆమెకు ఇంకే కోరికా గుర్తుకు రాలేదు.
డబ్బు గుర్తుకు రాలేదు.. బొమ్మలు గుర్తుకు రాలేదు.. కొత్త బట్టలు గుర్తుకు రాలేదు.. తన భవిష్యత్తు కూడా గుర్తుకు రాలేదు. గుర్తొచ్చింది ఒక్కరే.. తన నాన్న. తనను వదిలి వెళ్లిపోయిన నాన్న మళ్లీ తిరిగి ఇవ్వమని ఆ దేవుడిని కోరుకుంది. ఆ కోరిక సాధ్యమా.. కాదా.. అన్న విషయం ఆ చిన్నారి మనసుకు తెలియకపోవచ్చు. కానీ.. తన నాన్నపై ఉన్న ప్రేమ మాత్రం ఇప్పటికీ ఆమె గుండెల్లో అంతే బలంగా ఉంది.
నిజానికి.. అది కేవలం ఆ పరీక్షలో అడిగిన ప్రశ్నకు రాసిన సమాధానం కాదు. అది ఓ చిన్నారి గుండెల్లో దాచుకున్న నాన్న తాలూకు బాధ. అది తండ్రిపై ఉన్న మరపురాని ప్రేమ. అది నాన్న లేని లోటు. అది తిరిగి రాని మనిషిని మరోసారి చూడాలనే అమాయకమైన ఆశ. అందుకే.. ఆ నాలుగు పదాల జవాబు టీచర్లను కూడా కదిలించింది. తండ్రిని కోల్పోయిన బాధను మరిచిపోలేకపోయిన ఆ చిన్నారిని ఉపాధ్యాయులు దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
కొన్ని బాధలకు మాటలు రావు.. కొన్ని కన్నీళ్లకు శబ్దం ఉండదు.. కొన్ని జ్ఞాపకాలు కాలంతో చెరిగిపోవు. ముఖ్యంగా.. నాన్న అనే బంధం కోల్పోయిన తర్వాత ఆ లోటును ఏదీ భర్తీ చేయలేదేమో. అందుకే దేవుడిని వరం అడగమంటే.. ఆ చిన్నారి కోరుకున్నది ఒక్కటే.. “నాకు మా నాన్న కావాలి..”అని.
ఇది కేవలం ఓ పరీక్ష పేపర్లో రాసిన నాలుగు పదాల జవాబు కాదు.. ఓ చిన్నారి గుండెల్లో దాచుకున్న తీరని కోరిక. రెండేళ్ల క్రితం తనకు దూరమైన నాన్న కోసం.. ఇప్పటికీ ఎదురుచూస్తున్న ఓ బిడ్డ మనసు. ఆ నాలుగు పదాలు చదివిన ప్రతి ఒక్కరికీ ఆ క్షణం తమ నాన్న గుర్తొచ్చేలా చేసిన సమాధానం. నిజంగా.. కొన్ని సమాధానాలకు మార్కులు వేయలేం.. ఎందుకంటే.. అవి నేరుగా మనసును తాకుతాయి.

Leave a Reply