Palnadu Maoist Couple Surrenders: హింసకు గుడ్‌బై.. జనజీవనంలోకి మావోయిస్టు దంపతులు.. అర్బన్‌ డెన్‌ కీపర్లుగా కీలక బాధ్యతలు

మావోయిస్టు ఉద్యమానికి గుడ్‌బై..
పల్నాడులో ఇద్దరు సీనియర్‌ మావోయిస్టుల లొంగుబాటు!
ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన దుర్గాప్రసాద్, లచ్చమ్మ!
డీసీఎం స్థాయి బాధ్యతల్లో పనిచేసిన భార్యాభర్తలు!
అర్బన్‌ డెన్‌ కీపర్లుగా కీలక బాధ్యతలు!
ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టులపై పెరిగిన ఒత్తిడి!
హింసా మార్గాన్ని వీడేందుకు అసలు కారణమేంటి?
ఉద్యమంలో వరుస వైఫల్యాలే లొంగుబాటుకు కారణమా?

పల్నాడు జిల్లాలో ఇద్దరు సీనియర్‌ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి సమక్షంలో కందర్ప దుర్గాప్రసాద్‌ అలియాస్‌ మోహన్‌, ఆయన భార్య గొడ్డెళ్ల లచ్చమ్మ అలియాస్‌ ఉమా పోలీసులకు లొంగిపోయారు. చాలాకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

కందర్ప దుర్గాప్రసాద్‌ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందిన వ్యక్తి కాగా.. ఆయన భార్య లచ్చమ్మది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా అని ఏఎస్పీ తెలిపారు. భార్యాభర్తలైన వీరిద్దరూ మావోయిస్టు పార్టీలో సాధారణ క్యాడర్లుగా కాకుండా కీలక బాధ్యతలు నిర్వహించారు. దుర్గాప్రసాద్‌ డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేయడంతో పాటు అర్బన్‌ డెన్‌ కీపర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. లచ్మ్మ కూడా జిల్లా కమిటీ సభ్యురాలిగా, అర్బన్‌ డెన్‌ కీపర్‌గా పనిచేసినట్లు వెల్లడించారు.

అర్బన్‌ డెన్‌ కీపర్‌ అంటే.. పట్టణ ప్రాంతాల్లో ఉంటూ మావోయిస్టు పార్టీకి అవసరమైన సంస్థాగత కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలు చేపట్టే వ్యక్తి. ఈ దంపతులు కూడా పట్టణ ప్రాంతాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్ర కమిటీ స్థాయి నేతలతో సమన్వయం చేసేవారని పోలీసులు తెలిపారు. పార్టీ కార్యకలాపాలకు అవసరమైన సహకారం అందిస్తూ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వీరిద్దరూ డీసీఎం స్థాయి బాధ్యతల్లో ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

అయితే ఇంతకాలం మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరూ ఒక్కసారిగా ఆ మార్గాన్ని ఎందుకు వదిలేశారు? దీనికి ప్రధాన కారణం పార్టీ వరుస వైఫల్యాలు, కాలం చెల్లిన సిద్ధాంతాలపై విసుగు రావడమేనని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పారని పోలీసులు వివరించారు. హింసతో కూడిన జీవితం కొనసాగించడం కంటే.. సాధారణ జీవితం గడపాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇందులో మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం. హింసా మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలపై ఈ ఇద్దరికీ అవగాహన కలిగింది. ఆ తర్వాతే పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. అంటే.. మావోయిస్టు పార్టీకి.. కార్యకలాపాలకు, పూర్తిగా దూరమై.. ఇకపై సాధారణ పౌరులుగా జీవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా బలగాలు చేపడుతున్న చర్యలు కూడా ఇటీవలి కాలంలో తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్లు, భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో కూడా మావోయిస్టులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించగా.. మరికొందరు ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇప్పుడు పల్నాడులో లొంగిపోయిన ఈ దంపతుల విషయంలో ప్రభుత్వం కూడా పునరావాస చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి తెలిపారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం గడపాలనుకునే మావోయిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.

మొత్తంగా చూస్తే.. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ భార్యాభర్తల జంట ఇప్పుడు ఆ ఉద్యమానికి దూరమై పోలీసుల ఎదుట లొంగిపోయింది. సుదీర్ఘకాలం అండర్‌గ్రౌండ్‌లో పనిచేసిన వీరిద్దరూ.. ఇక హింసకు దూరంగా సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ లొంగుబాటు ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు భద్రతా బలగాల చర్యలు.. మరోవైపు ఉద్యమంపై అసంతృప్తి.. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస అవకాశాలు.. వెరసి మరికొందరు కీలక మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవనంలోకి వచ్చే అవకాశం ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.