Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్

రైల్వే రంగంలో కేంద్రం కీలక నిర్ణయం!
ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..!
విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు మహర్దశ!
నాలుగు లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్!
దక్షిణాదిలో 5 భారీ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు!
17 జిల్లాలు.. 2,121 గ్రామాలకు కొత్త కనెక్టివిటీ!
తిరుమల టు యాదాద్రి.. కనెక్టివిటీ ఎలా మారనుంది?
కొత్త రైల్వే లైన్ల రూట్ మ్యాప్ ఏంటి?

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు కేంద్రం భారీ బూస్ట్ ఇచ్చింది. రూ.20,804 కోట్లతో దేశవ్యాప్తంగా 8 భారీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఉన్న రైల్వే మార్గాలపై రద్దీ పెరుగుతుండటంతో.. అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్లే కీలక మార్గాల్లో మల్టీట్రాకింగ్ పనులు చేపట్టనున్నారు. అంటే.. ప్రస్తుతం ఒకటి లేదా రెండు లైన్లతో రైళ్ల రాకపోకలు సాగుతున్న చోట.. అదనపు లైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ, ఏయే మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు వస్తున్నాయి? తెలుగు రాష్ట్రాలకు దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి?

ముందుగా ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక విషయం ఏంటంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా కీలక రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దేశంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో అదనపు ట్రాక్‌లు నిర్మించి, రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఐదు కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 17 జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు రూ.10,021 కోట్లు. కొత్త లైన్లు పూర్తయితే దాదాపు 2,121 గ్రామాలకు మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.

ఇక ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్రయోజనం కలగనుంది.. హౌరా–చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయనున్నారు. అలాగే ముంబై–చెన్నై కారిడార్‌లో గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ కీలక మార్గాల్లో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు.. ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను మరింత సమర్థంగా నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధాన రైల్వే మార్గాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా అదనపు లైన్లు నిర్మించి.. రద్దీని తగ్గించడం, రైల్వే నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచడం కేంద్రం లక్ష్యం.ముఖ్యంగా ఏపీలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానించే రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

ఇక తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి ఘట్‌కేసర్‌–కాజీపేట నాలుగో రైల్వే లైన్‌. సికింద్రాబాద్‌–కాజీపేట మార్గం తెలంగాణలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే రూట్లలో ఒకటి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే రైళ్లకు ఈ మార్గం చాలా కీలకం. ఇప్పుడు సుమారు 110 కిలోమీటర్ల మేర నాలుగో లైన్‌ నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.2,419 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపై రైళ్ల రద్దీ కారణంగా కొత్త రైళ్లకు మార్గం కల్పించడం, రైళ్లను షెడ్యూల్ చేయడం కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో.. అదనపు లైన్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి ఇది కీలక మార్పుగా మారనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మరో కీలక ప్రాజెక్ట్ అరక్కోణం–రేణిగుంట సెక్షన్‌లో మూడు, నాలుగు రైల్వే లైన్లు. ఈ మార్గం దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌లో చాలా ముఖ్యమైనది. చెన్నై నుంచి తిరుపతి, రేణిగుంట మీదుగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఈ మార్గం కీలక కనెక్షన్. సుమారు 77 కిలోమీటర్ల మేర రెండు అదనపు లైన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,936 కోట్లు ఖర్చు కానుంది. దీని వల్ల ఒకే మార్గంలో ప్రయాణికుల రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సరుకు రైళ్ల మధ్య రద్దీని నిర్వహించడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ అదనపు లైన్లు భవిష్యత్ రైల్వే అవసరాలను తీర్చడంలో ఉపయోగపడనున్నాయి.

ఇక ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత ఏంటంటే.. ప్రయోజనం కేవలం రైళ్ల వేగం పెరగడానికే పరిమితం కాదు. సరుకు రవాణా కూడా వేగవంతం కానుంది. ప్రస్తుతం రద్దీగా ఉన్న రైల్వే మార్గాల్లో ఒక సరుకు రైలు లేదా ప్రయాణికుల రైలు ఎక్కువసేపు ట్రాక్‌పై ఉండటం వల్ల వెనుక వచ్చే రైళ్లను ఆపాల్సిన పరిస్థితులు ఉంటాయి. అదనపు లైన్లు అందుబాటులోకి వస్తే ఈ రద్దీని విభజించవచ్చు. ప్రయాణికుల రైళ్లకు ప్రత్యేకంగా మార్గం కల్పించడం.. సరుకు రైళ్లను మరో లైన్‌లో నడపడం వంటి అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల రైల్వే సామర్థ్యం పెరగడంతో పాటు పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులు, పెద్ద నగరాలకు సరుకుల రవాణా కూడా మరింత సులభమవుతుంది.

ఇక కర్ణాటకలో వైట్‌ఫీల్డ్‌–బంగారుపేట మార్గంలో సుమారు 47 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్లు నిర్మించనున్నారు. బెంగళూరు ప్రాంతం నుంచి తూర్పు దిశగా వెళ్లే రైళ్లకు ఈ మార్గం కీలకం. పారిశ్రామిక ప్రాంతాలు, నగరాలు, వాణిజ్య కేంద్రాల మధ్య రైలు కనెక్టివిటీ పెరగడంతో.. ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది.

అదే విధంగా తమిళనాడులో సేలం–కరూర్‌–దిండిగల్‌ మార్గంలో 159 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులు చేపట్టనున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న సింగిల్ ట్రాక్ సామర్థ్యాన్ని పెంచుతూ అదనపు రెండు ట్రాక్‌లు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే హోసూరు–ఓమలూరు మధ్య 147 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో తమిళనాడు, కర్ణాటక మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.

అయితే ఈ రైల్వే ప్రాజెక్టులను ఎందుకు ఇంత భారీగా చేపడుతున్నారు? దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్. దేశవ్యాప్తంగా హై డెన్సిటీ రైల్వే కారిడార్లు ఇప్పటికే భారీ స్థాయిలో రద్దీని నిర్వహిస్తున్నాయి. దాదాపు 11 వేల కిలోమీటర్ల హై డెన్సిటీ కారిడార్లు దేశంలోని రైల్వే ట్రాఫిక్‌లో సుమారు 40 శాతం వరకు నిర్వహిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.. సరుకు రవాణా పెరుగుతోంది.. కొత్త రైళ్ల అవసరం పెరుగుతోంది. కానీ ఉన్న ట్రాక్‌ల సామర్థ్యానికి ఒక పరిమితి ఉంటుంది. అందుకే కొత్త రైల్వే లైన్ల నిర్మాణం ద్వారా అదే రూట్‌లో మరిన్ని రైళ్లను నడిపే సామర్థ్యాన్ని పెంచడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కేవలం రైల్వే ప్రయాణమే సులభం కావడం కాదు.. పర్యాటకం, ఆధ్యాత్మిక యాత్రలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా బూస్ట్ లభించనుంది. ఈ ప్రాజెక్టులు ‘పీఎం గతి శక్తి’ జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రూపొందించినవిగా కేంద్రం చెబుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, యాదగిరిగుట్ట, భువనగిరి కోట వంటి ప్రముఖ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత సులభం కానుంది. అలాగే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌, తమిళనాడులో హొగేనక్కల్ జలపాతం, కొడైకెనాల్, సత్యమంగళం ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కలగనుంది.

మరో కీలక అంశం 2029–30 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పనులు పూర్తయ్యే కొద్దీ అదనపు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా ప్రస్తుతం రైళ్ల రాకపోకల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి కూడా రైల్వే శాఖకు అదనపు సామర్థ్యం లభిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలను కలిపే రూట్లలో ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడనుంది.

మొత్తంగా చూస్తే.. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు అంటే కేవలం కొన్ని కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు నిర్మించడం మాత్రమే కాదు. రైళ్ల రద్దీ తగ్గించడం.. కొత్త రైళ్లకు మార్గం కల్పించడం.. ప్రయాణ సమయాన్ని తగ్గించడం.. సరుకు రవాణాను వేగవంతం చేయడం.. పరిశ్రమలు, పోర్టులు, నగరాలను మరింత సమర్థవంతంగా అనుసంధానించడం.. ఇలా ఒకేసారి అనేక ప్రయోజనాలు కలిగించనున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే కీలక రైల్వే మార్గాలకు ఇది మరింత సామర్థ్యాన్ని తీసుకురానుంది. ఓవరాల్ గా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రైల్వే ప్రయాణ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఉంది. అంటే.. రాబోయే రోజుల్లో దక్షిణ భారత రైల్వే ట్రాక్‌లపై రైళ్లు పెరగడమే కాదు.. వాటి కెపాసిటీ కూడా పెరగబోతోందన్నమాట.

Leave a Reply

Your email address will not be published.