భారత్‌పై మరోసారి భారీగా సుంకాలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను టార్గెట్‌గా చేసుకున్న ట్రంప్ సర్కార్.. ఏకంగా 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం చేసిన ఓ బిల్లు.. హౌస్‌లో కీలక దశకు చేరుకుంది. ఫైనల్ ఓటింగ్ అనంతరం ఈ టారిఫ్ అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. భారత్, చైనా, కెనడా, మెక్సికో ఇలా పలు దేశాలపై కూడా ఎడాపెడా సుంకాల్ని విధించారు. అప్పటికప్పుడు పెంచడం, తగ్గించడం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పైనా అదనపు సుంకాల అంశం తెరపైకి వచ్చింది.
ఇక ఇప్పుడు మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లు.. అమెరికా ప్రతినిధుల సభలో ముందుకు వెళ్లింది.
లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 పేరిట ఉన్న ఈ బిల్లు.. ఇప్పుడు ప్రతినిధుల సభలో తుది ఓటింగ్‌కు వెళ్లింది. బిల్లు ఆమోదం పొందితే.. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే కొన్ని దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది.
ఇక మరో ముఖ్యమైన విషయం.. అమెరికా ప్రతినిధుల సభలో మంగళవారం నిర్వహించిన విధానపరమైన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 214 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమొక్రాట్లు రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు తుది ఓటింగ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే అమెరికా సెనేట్ ఈ బిల్లును 86-11 ఓట్లతో ఆమోదించింది. అయితే హౌస్ ఆమోదం, ఆ తర్వాత అధ్యక్షుడి సంతకం వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది చట్టంగా మారుతుంది.
అయితే, ఈ బిల్లు ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందితే.. చట్టంగా మారే ప్రక్రియ ముందుకు సాగుతుంది. చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే కొన్ని దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. అయితే ఈ టారిఫ్‌లు ఆటోమేటిక్‌గా అమల్లోకి రావు.. వాటిని విధించే నిర్ణయం అధ్యక్షుడి పరిధిలో ఉంటుంది.
అయితే, ఇప్పుడు ఈ బిల్లులో భారత్ పేరును ప్రస్తావించే సవరణ కూడా ముందుకొచ్చింది. డెమొక్రటిక్ నేత స్టెనీ హోయర్ ప్రతిపాదించిన సవరణలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్, హంగేరి, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్ దేశాలను 100 శాతం వరకు సుంకాలకు అర్హమైన దేశాలుగా పేర్కొనే ప్రతిపాదన ఉంది. అయితే, ఈ సుంకాల నుంచి పలు దేశాలకు మినహాయింపు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ బిల్లు అధ్యక్షుడికి కల్పిస్తోంది.
మరోవైపు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్న రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని దీని సమర్థకులు చెబుతున్నారు. మరోవైపు, అధ్యక్షుడికి ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు రష్యా నాయకత్వం, ఇంధన రంగం, చమురు రవాణాకు వాడే ‘షాడో ఫ్లీట్’ నౌకలపై అదనపు ఆంక్షలు విధించడంతో పాటు ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను కూడా పొడిగించనుంది. గురువారం తర్వాత ప్రతినిధుల సభ సమావేశాలు విరామంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లు భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Leave a Reply