Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలోని రామేశ్వరం కేఫే ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన 30 ఏళ్ల భాస్కర్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజులాగే తన పనుల్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ప్రేమ వేధింపుల వివాదంగానే భావించిన పోలీసులు… విచారణలో మరిన్ని కీలక అంశాలను గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం… 2020లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరంగల్ వర్ధన్నపేటకు చెందిన ఓ యువతితో భాస్కర్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగినప్పటికీ, కులాంతర వివాహం కావడంతో యువతి కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు. అనంతరం 2023లో ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం చేశారు.

అయితే పెళ్లి తర్వాత కూడా భాస్కర్ ఆ యువతి భర్తకు ఫొటోలు పంపుతూ, గత పరిచయాన్ని గుర్తు చేస్తూ వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడాకుల వరకు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన కుమార్తె వైవాహిక జీవితం దెబ్బతినడానికి భాస్కర్ కారణమనే భావనతో యువతి తండ్రి రాజు అతనిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా… భాస్కర్ యువతి చెల్లికి కూడా తరచూ మెసేజ్‌లు పంపడంతో పాటు, సోషల్ మీడియాలో అక్కాచెల్లెళ్ల గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, భాస్కర్‌కు పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలో “దమ్ముంటే హైదరాబాద్‌కు రండి” అంటూ భాస్కర్ సవాల్ విసిరినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో యువతి తండ్రి రాజు, మేనమామ కుమారస్వామి, బావమరిది సహా మరో ఇద్దరు హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, భాస్కర్ ఉంటున్న హాస్టల్ వద్ద మాటువేసి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

హత్య అనంతరం నిందితుల్లో రాజు, కుమారస్వామి నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ డేటా, సోషల్ మీడియా ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొత్తానికి… ప్రేమ వ్యవహారం, కుటుంబ విభేదాలు, సోషల్ మీడియా వివాదాలు, ప్రతీకారం… ఇలా అనేక కోణాలు ఈ కేసులో కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు మాత్రమే. పూర్తి వాస్తవాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published.