ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా సాగనుంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు.
రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావడంతో పాటు తప్పులు సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా అనర్హులైన వారి పేర్లను తొలగించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ.. ఏన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని బీఎల్వోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎవరైనా ఓటరు ఇంట్లో లేకపోయినా, వారి వివరాలు నమోదు కావడానికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
అలాగే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని కూడా ఎన్నికల సంఘం కోరింది. బీఎల్వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించింది. దీనివల్ల ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఓటర్ల జాబితాలో తమ పార్టీ అనుకూల ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, కొత్త అర్హుల పేర్లు నమోదు అయ్యేలా క్రింది స్థాయి నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని తమ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో ధృవీకరించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. సర్ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫాంలు ముద్రించింది. 46,397 మంది బీఎల్వోలు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి ఈసీ ఇప్పటికే శిక్షణనిచ్చింది. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని.. ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,68,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మందికి మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యూమరేషన్ ఫాం, 2002 నాటి జాబితాలో వారి కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇవ్వాలి.
ఇక అదేవిధంగా, ఏపీలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా జూలై 21న ప్రచురణ జరుగనుందని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాపై నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. బీఎల్ఓలు, ఈఆర్ఓలు, కలెక్టర్లకు సర్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకూ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈసీఐనెట్ యాప్‌లో కాల్ యువర్ బీఎల్ఓ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి 48 గంటల్లో ఓటర్లకు బీఎల్ఓ నుంచి స్పందన వస్తుందని వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రం వెలుపల ఉన్నవారికి ఆన్లైన్లో ఫారం సమర్పణ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయవచ్చునని వివరించారు. ecinet.eci.gov.in ద్వారా ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ చేయవచ్చునని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ 76 శాతం పూర్తయిందన్నారు. మ్యాపింగ్‌ను 95 శాతానికి పైగా పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, నంద్యాల జిల్లా బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆర్డిఓ నరేంద్ర నాథ్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగిస్తున్నారని, ఇందుకోసం తహశీల్దార్ కార్యాలయంలో అనధికారికంగా ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారని ఆరోపించారు. ఫారం 6 లేకపోయినా కూడా ఓటర్ లిస్టులో ఎక్కిస్తున్నారని, అలాగే వైసిపికి సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే విచారణ జరిపి కంప్యూటర్ ఆపరేటర్లగా పనిచేస్తున్న ఇద్దరిని తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేపడతానని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓట్ల సర్వే కార్యక్రమం రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా సర్వే సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్తూ అప్లికేషన్ ఇస్తున్నారు. అలాగే ‘సర్’ ప్రోగ్రామ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ప్రతి ఒక్కరి ఓటు డేటాను సిబ్బంది క్షుణ్ణంగా ధ్రువీకరిస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, బూత్ లెవెల్ అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కీలకమైన ‘సర్’ కార్యక్రమాన్ని స్పీడ్‌గా పూర్తి చేసి, నెల రోజుల్లోగా ముగించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply