పది రోజులు గడిచిపోయాయి… కానీ రెండేళ్ల చిన్నారి జాహ్నవి ఆచూకీ మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. వందలాది మంది పోలీసులు, ప్రత్యేక బృందాలు, అత్యాధునిక డ్రోన్లు, సెర్చ్ ఆపరేషన్లు… అడవిని అంగుళం అంగుళం గాలించినా చిన్నారి జాడ దొరకలేదు. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. మరోవైపు, చిన్నారి పైథాన్ బారిన పడిందేమోనన్న కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకలేదన్నారు ఎస్పీ. దీంతో, చిన్నారి జాడను కనిపెట్టేందుకు ఉన్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, అసలు అడవిలోకెళ్లిన పాప ఏమైనట్టు?
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ పది రోజులు గడిచినా ఇంకా చిక్కుముడి వీడలేదు. అత్యాధునిక డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అడవిని అణువణువూ జల్లెడ పడుతున్నా, చిన్నారి జాడ దొరకకపోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మరోవైపు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు చిన్నారి అదృశ్యం వెనుక కొండచిలువ పాత్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడం అందుకు నిదర్శనం కావచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, ఫారెస్ట్ అధికారి పట్టాభి మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాల దాడి జరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
అదేవిధంగా, పోలీసులకు సవాల్‌గా మారిన ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాన్ని అటవీ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ జంతువులు తిరుగుతున్న ఆనవాళ్లు లేవు. మరోవైపు సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్, ఇతర సాంకేతికత ద్వారా దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. మీడియాతో విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లినట్లు లేదు కాబట్టి అడవి జంతువులు లాక్కెళ్లాయని అనుమానిస్తున్నామన్నారు. కానీ ఏ కోణంలోనూ ఇప్పటివరకు ఆధారాలు దొరకలేదని తెలిపారు. పాప అదృశ్యమైన రోజు భారీ వర్షం పడిందని, వరద ప్రవాహానికి కొండ దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయిండొచ్చు అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేవలం 30 నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారని తెలిపారు. అలాగే, మిస్సై చాలారోజులు అయ్యింది కాబట్టి ఆహారం లేక చనిపోయిందా ? అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఒకవేళ అలా జరిగితే అది అత్యంత బాధాకరమని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రస్తుతానికి థర్మల్ డ్రోన్ల సహాయంతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇదిలా ఉంటే..చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయిన టైమ్‌లో, అనుమానాస్పదంగా చనిపోయిన పెంపుడు కుక్క మృతిపై కూడా విచారణ వేగవంతమైంది. ప్రాథమిక విచారణలో డీహైడ్రేషన్ కారణమని తేలినప్పటికీ, దీనిపై పూర్తి స్పష్టత కోసం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, నమూనాలను విశాఖ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న పోస్టుమార్టం నివేదిక త్వరలోనే రానుంది.
మరోవైపు, చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాలు ఈ-థర్మల్ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మనుషులు, జంతువుల కదలికలను గుర్తించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. లైవ్ వీడియో ప్రసారం, GPS ట్రాకింగ్ వంటి సాంకేతిక సదుపాయాలు ఈ డ్రోన్ల ప్రత్యేకత. థర్మల్ కెమెరాలతో అమర్చిన ఈ డ్రోన్లు వేడి ఆధారంగా చిత్రాలను గుర్తించి రికార్డు చేస్తాయి.

Leave a Reply