కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి ఆదివారం నాటికి తొమ్మిది రోజులైనా ఇంకా జాడ దొరకలేదు. ఈ మిస్సింగ్ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. కళ్లముందు అడుకునే పసిపాప ఏమైందో తెలియక కన్నవారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరో పక్క పోలీసులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అనుమానమున్న ప్రతీ కోణంలోనూ దర్యాప్తు చేస్తూ చిన్నారి జాహ్నవి ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. చిన్నారిని ఎవ్వరైనా కిడ్నాప్ చేశారా.. లేక అటవీప్రాంతంలో ఏ అడవి జంతువుల వల్ల హాని జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, చిన్నారి కొండచిలువ బారిన పడి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఆ ప్రాంతంలో మనుషులపై జంతువుల దాడి ఘటనలు ఇప్పటివరకూ లేవని కూడా అటవీశాఖ అధికారి తెలిపారు.
మరోవైపు, ఈ మిస్సిగ్ కేసుకు సంబంధించి కీలక ఆధారంగా ఉన్న పెంపుడు శునకం శనివారం ఆకస్మికంగా మృతిచెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసలు కుక్క ఎలా చనిపోయిందన్న కోణంలో కూడా పోలీసులు దృష్టిసారించారు. ఏమైనా విషప్రయోగం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేసేందుకు పశువైద్యాధికారుల చేత పోస్ట్ మార్టం నిర్వహించారు. తుని మండలం ఎన్.సురవరంలో ఉన్న పశువైద్యశాలలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ మోహన్ వంశీ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించగా శునకం శరీర భాగాలను విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు, నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
చిన్నారి అదృశ్యమైన రోజు పాప వెనుకే వెళ్లిన పెంపుడు శునకం నాలుగు రోజుల తరువాత అంటే మంగళవారం ఒంటరిగా తిరిగి వచ్చింది. అక్కడున్న జనాన్ని చూసిన శునకం అక్కడి నుంచి మళ్లీ తోటల్లోకి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగొచ్చిన కుక్క.. చిన్నారి తల్లి భవానిపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నంచింది. అయితే అర్ధరాత్రి కుక్కను సురక్షితంగా బంధించి జాన్ 12న దాని మెడకు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి దాని కదలికలను అధికారులు ట్రాక్ చేశారు.. ట్రాకర్ అమర్చిన తర్వాత 80 నిమిషాల్లో సుమారు 8 కిలోమీటర్ల మేర తిరిగిన పెంపుడు కుక్క చివరికు ఇంటికి చేరుకుంది. అయితే అది అనూహ్యంగా 13న మరణించింది.
మరోవైపు, “మా పాపను ఎవరో పక్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆచూకీ దొరకకుండా చేసేందుకే మా పెంపుడు కుక్కను కూడా చంపేశారు” అని మిస్సింగ్ చిన్నారి జాహ్నవి తల్లి భవాని తీవ్ర ఆరోపణలు చేశారు. కుక్క తిరిగి వస్తే తన బిడ్డ కూడా క్షేమంగా వస్తుందని తాము ఆశపడ్డామని, కానీ ఆ నమ్మకం కూడా లేకుండా పోయిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. కుక్క మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, దీని వెనుక కిడ్నాపర్ల హస్తం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా, ఇక మాకు మీరే దిక్కు” అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిన్నారి తల్లి భవాని వేడుకున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తన కుమార్తెను ఎలాగైనా ప్రాణాలతో తమకు అప్పగించాలని ఆమె దీనంగా అభ్యర్థించారు. చిన్నారి తండ్రికి స్థానికులతో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గాలింపు వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇక, చిన్నారి జాహ్నవి అదృశ్యం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఆయన, గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో సైతం జల్లెడ పట్టేందుకు పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. ఫారెస్ట్ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 400 మందికి పైగా సిబ్బంది, అధునాతన డ్రోన్లతో గాలిస్తున్నట్లు, 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఎస్పీ డిప్యూటీ సీఎంకు వివరించారు.
మరోవైపు, చిన్నారి జాహ్నవి అదృశ్యమైన కుటుంబాన్ని సినీ నటి కరాటే కళ్యాణి పరామర్శించారు. పెంపుడు కుక్క మృతి చెందడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కకు బలవంతంగా జీపీఎస్ ట్రాకర్ కడుతున్నప్పుడే తాను అనుమానపడ్డానని పేర్కొన్నారు. వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో ఆ పని చేసి ఉంటే బాగుండేదని, అందుకు భిన్నంగా జీపీఎస్ కట్టారని వాపోయారు. కారణాలు ఏమైనా..చిన్నారి జాడను కనుక్కోవడంలో కీలకంగా ఉన్న ఒక్క ఆధారాన్నీ ఇలా పోగొట్టుకోవడం బాధాకరమని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.
అదేవిధంగా, చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు కేవలం సాధారణ మిస్సింగ్ కాదని, దీని వెనుక ఏదో పెద్ద మిస్టరీ దాగి ఉందనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అసలు రెండేళ్ల చిన్నపాప ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా కిలోమీటర్ల దూరం ఎలా నడవగలదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రెండోది, ఘటనా స్థలానికి చుట్టూ మనుషులు దూరలేనంత పకడ్బందీ కంచె ఉండగా,పాప ఎలా బయటకు వెళ్లింది?. ఇక.. మూడో ప్రశ్న.. ‘పెద్దవాళ్లే వెళ్లడానికి సాహసించని ముళ్ల తుప్పలు, కొండలు గుట్టల్లో నుంచి చిన్నారి వెళ్లడం సాధ్యమేనా? అనేది. నాలుగోది, ఒకవేళ అడవిలో జరగరానిది ఏమైనా జరిగి ఉంటే.. ఈ పాటికే ‘దుర్వాసన’ రావాలి కదా? అలాంటిదేమీ లేనప్పుడు.. మరి పాప ఏమైనట్లు?. ఇక చివరి ప్రశ్న.. పెంపుడు కుక్క కూడా కేవలం 400 మీటర్ల పరిధి దాటి ముందుకు వెళ్లకపోవడానికి కారణాలేంటి? ఈ ఐదు ప్రశ్నలను బట్టి.. పాప తనంతట తాను వెళ్లలేదని, ఎవరో పక్కా ప్రణాళిక ప్రకారమే కిడ్నాప్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి.
కుమార్తె జాహ్నవి కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి భవానీ పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. పెంపుడు కుక్క మరణంతో బాలిక తల్లి కుప్పకూలిపోయింది. కాస్త ఆలస్యంగానైనా.. కుక్క ఇచ్చే సమాచారంతో బిడ్డ ఆచూకీ తెలుస్తుందని భావించామని, ఈ కేసులో ఈ ఉన్న ఆధారం పోయిందని ఆమె కన్నీరుమున్నీరైంది. మరోవైపు, ఓ పక్క అధునాతన డ్రోన్లతో అణువణువూ జల్లెడపడుతున్నా, చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మట్టిపెళ్లలు విరిగిపోయిన చోట్ల శోధించినా ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఆ తల్లి రోదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.
తునిలో కలకలం రేపుతున్న చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిన్నారి తండ్రి సుంకర భవాని గణేష్‌కు గతంలో కొందరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, పాత వివాదాల అంశంపై పోలీసులు లోతుగా దృష్టి సారించారు. స్థానికంగా ఈ కుటుంబానికి ఉన్న పాత కక్షలు ఏవైనా ఈ కిడ్నాప్ లేదా అదృశ్యం వెనుక ఉన్నాయా అనే కోణంలో కూపీ లాగుతున్నారు. కాగా, పాప తండ్రి చెబుతున్న కొన్ని విషయాలపై స్థానికులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు తన పాప క్షేమంగా తిరిగి రావాలని, తాము పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని తండ్రి భవాని గణేష్ మీడియా ముఖంగా భావోద్వేగంతో వెల్లడించారు.
ఇక, మిస్టరీగా మారిన జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. బాలిక ఆచూకీ లేదా ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు చేరవేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, అలాగే ఆచూకీ కనిపెట్టిన వారికి లక్ష రూపాయలు) నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. బాలిక మిస్సింగ్ కి సంబంధించి.. విశ్వసనీయ సమాచారం తెలిస్తే.. తుని రూరల్ ఎస్సై నంబరైన 94407 96573, రూరల్ సీఐ 94407 96531, పెద్దాపురం డీఎస్పీ నంబరు 94407 96508కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తుల్లో, గాలింపు బృందాల్లో సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు చిన్నారి పిల్లల్ని ఎత్తుకుపోయే అంతరాష్ట్ర ముఠా చేతికి చిక్కిందా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆ రెండేళ్ల చిన్నారి స్వయంగా కొండపైకి వెళ్తే.. ఇన్ని రోజులుగా నీరు, ఆహారం లేకుండా ఉండలేదని స్థానికులు భావిస్తున్నారు. చిన్నారి జాడకోసం వందలాది మందితో వెతికినా కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరక్కపోవడం గాలింపు బృందాలకు సైతం అంతుచిక్కడం లేదు. ఈ మిస్టరీ వీడకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం చిన్నారి జాడ కోసం NDRF, రాపిడ్ రెస్పాన్స్, హనుమాన్ బృందాలు కొండ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నాయి.
అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఈ ఘటనపై స్పందిస్తూ.. అదృశ్యమైన చిన్నారి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఏదైనా పెద్ద కొండచిలువ బారిన పడి ఉండవచ్చనే బలమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా, అటవీ శాఖ అధికారి పట్టాభి మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు మనుషులపై క్రూర మృగాలు దాడి చేసిన దాఖలాలు కానీ, చేతబడులు జరిగిన ఘటనలు కానీ ఎప్పుడూ నమోదు కాలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అధికారుల మధ్యే ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అసలు జాహ్నవి ఏమైంది? ఎటు వెళ్లింది? అనే ప్రశ్నలపై మిస్టరీ మరింత ముదురుతోంది.

Leave a Reply