Ashtadasha 18 Shakti Peethas List Names And Places Behind Stories

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే  వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలం

లంకాయాం శాంకరీదేవీ

అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి.

2. సతీదేవి వీపు భాగం పడిన ప్రదేశం

కామాక్షీ కాంచికాపురే

సుదర్శన చక్రంతో ఖండింపబడి..ముక్కలైన సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన ప్రదేశాల్లో 18 అష్టాదశ పీఠాలుగా ప్రసిద్ధి. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో కాంచీపుర కామాక్షీ దేవి శక్తిపీఠం రెండోది. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ప్రాంతంలో సతీదేవి వీపు భాగం పడినట్టు చెబుతుంటారు.  ఈ శక్తీ పీఠానికి వెళ్లాలంటే మానవ సంకల్పం ఉంటే చాలదు.. దైవ కృప కూడా ఉండాలంటారు. 

3. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు !

ప్రద్యుమ్నే శృంఖళాదేవీ

కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాతగా పూజిస్తారు. కోల్ కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు.

4. అమ్మవారి కురులు పడ్డ స్థలం ఇదే !

చాముండీ క్రౌంచపట్టణే

హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5. సతీదేవి ‘దంతాలు’ పడ్డ స్థలం !

అలంపురే జోగులాంబ:!

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో  కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వసం అయ్యి, ఆ తర్వాత పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’  ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.

6. సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలం

శ్రీశైలే భ్రమరాంబికా!

దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది.

7. సతీదేవి ‘కన్నులు’ పడిన ప్రాంతం

కొల్హాపురే మహాలక్ష్మీ!

మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్‌లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు.

8. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలం

మాహుర్యే ఏకవీరికా!

మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి.

10. సతీదేవి ‘పీఠభాగం’ పడిన ప్రదేశం !

పీఠిక్యాం పురుహూతికా

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల  పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు.

11.  సతీదేవి ‘నాభి స్థానం’ పడిన చోటు ఇదే!

ఓఢ్యాయాం గిరిజా దేవి!

ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం . నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి ఆలయం ఉన్నది.ఇక్కడ అమ్మవారు భిరిజాదేవిగా ప్రసిద్ధి. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు.

12. సతీదేవి కణతల భాగం పడిన ప్రదేశం

మాణిక్యామ్ దక్షవాటికే 

సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం.

13. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం

హరిక్షేత్రే కామరూపా!

సతీదేవి యోని భాగము పడిన ప్రదేశమే కామాఖ్య శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. నెలకోసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదమూడవదిగా పరిగణించబడుతుంది. ఇది కామాఖ్య తాంత్రిక పీఠంగాను, కామ్యాసిద్ధి పీఠంగాను ప్రపంచ ప్రసిద్ధికెక్కింది.  

14.సతీదేవి కుడిచేతి వేళ్ళు  పడిన స్థలం 

ప్రయాగే మాధవేశ్వరీ!

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ప్రయాగ క్షేత్రం ఉంది. ఇది సతీదేవి కుడిచేతి వేళ్ళు  పడిన స్థలంగా ప్రసిద్ది. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. ఇది యుమన, గంగా నదులు కలిసే ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అని అంటారు. పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ క్షేత్రం.

15. అమ్మవారి నాలుక పడిన ప్రదేశం

జ్వాలాయం వైష్ణవీ దేవి!

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు..ఏడుజ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి.ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు.ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ వైష్ణో దేవి ఆలయం కూడా ఒకటి.

16. సతీదేవి స్తనాలు పడిన స్థలం

గయాయామ్ మాంగళ్య గౌరీ!

బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి ఉంది. ఈ  ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.

17. సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం

వారాణస్యాం విశాలాక్షీ!

సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 17వది. 

18. సతీదేవి కుడి చెంప పడిన స్థలం

కాష్మీరేషు సరస్వతీ

ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్‌లో ఉందని తెలుస్తోంది.  కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని కర్ణాటక రాష్ట్రం శృంగేరిలో  ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

Leave a Reply

Your email address will not be published.