Trump’s Tariff Shock: భారత్ టార్గెట్‌గా ట్రంప్ కొత్త టారిఫ్.. జనరిక్ మందులపై 200% సుంకాలు

అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం.. భారత ఫార్మా రంగంలో ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచానికి తక్కువ ధరలో మందులు అందించే భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్ విధానం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.జనరిక్ మందుల దిగుమతులపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొదట్లో ఎలాంటి టారిఫ్ లేకపోయినా.. ఆ తర్వాత 100 శాతం.. చివరకు 200 శాతం వరకు పెంచుతామని తెలిపారు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? భారత ఫార్మా కంపెనీలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది..?


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ మందులపై కొత్త టారిఫ్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం.. ఈ ఆగస్ట్ నుంచి దాదాపు రెండేళ్ల పాటు జనరిక్ ఔషధాల దిగుమతులపై ఎలాంటి టారిఫ్స్ ఉండవు. అంటే అమెరికాలోకి రాబోయే రెండేళ్లలో వచ్చే జనరిక్ మెడిసిన్‌పై సుంకాలు వర్తించవు. దీంతో, భారత్ సహా ఇతర దేశాల నుంచి అమెరికాకు మందులు ఎగుమతి చేసే కంపెనీలకు తాత్కాలికంగా ఊరట లభించనుంది.


అయితే, ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రస్తుతానికి ఊరట కలిగించినా..భారత ఫార్మా కంపెనీలపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపించనుంది. కొత్త విధానం ప్రకారం..మొదటి రెండేళ్లు జనరిక్ మందులపై జీరో శాతం టారిఫ్ కొనసాగుతుంది. కానీ, మూడో సంవత్సరం నుంచి..ఏకంగా 100 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత నాలుగో ఏడాది.. ఇది మళ్లీ రెట్టింపు అయి 200 శాతం వరకు టారిఫ్ పెంచుతామని ట్రంప్ తెలిపారు. అమెరికాలో మందుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి, కంపెనీలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని ట్రంప్ చెబుతున్నారు. అంటే, అమెరికాలో ఔషధ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ భారీ సుంకాలు అమల్లోకి వస్తాయి.


ఇంతకీ, అసలు జనరిక్ మందులు అంటే ఏంటి? ఒక కొత్త మందును కనిపెట్టిన తర్వాత.. ఆ మందుకు పేటెంట్ హక్కులు ఉంటాయి.పేటెంట్ గడువు ముగిసిన తర్వాత.. అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు తయారు చేసే మందులను జనరిక్ మందులు అంటారు. ఇవి బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువ ధరలో లభిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జనరిక్ మందులపై ఆధారపడుతున్నారు.


ఇక, భారత్‌కు ఇది ఎందుకంత కీలకం? జనరిక్ మందుల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అందుకే భారత్‌ను “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అని పిలుస్తారు. అమెరికా మార్కెట్‌లో భారత మందుల వాటా చాలా ఎక్కువ. అమెరికాలో ఉపయోగించే జనరిక్ మందుల్లో దాదాపు 40 శాతం వరకు భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో..భారత్ అమెరికాకు దాదాపు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది.


మరి, ఈ ప్రభావం భారత కంపెనీలపై ఎలా ఉంటుంది? టారిఫ్‌లు పెరిగితే.. భారత ఫార్మా కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే..
మందుల తయారీ ఖర్చులు పెరగవచ్చు. అమెరికా మార్కెట్‌లో లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికాలోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. భారత్‌కు చెందిన పలు ప్రముఖ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్, జైడస్ లైఫ్‌సైన్సెస్, అరబిందో ఫార్మా వంటి భారత కంపెనీల ఆదాయంలో అమెరికా మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది.


అమెరికా ప్రజలపై ప్రభావం ఉంటుందా? ట్రంప్ లక్ష్యం అమెరికాలో మందుల తయారీని పెంచడమే. కానీ అమెరికాలో ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ. దీంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. అంటే.. బీపీ మందులు,షుగర్ మందులు,క్యాన్సర్ మందులు, ఇతర కీలక ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


అయితే, ప్రజంట్‌ భారత్ ముందున్న మార్గం ఏంటి? ఈ విషయంలో భారత్.. అమెరికాతో చర్చలు జరిపే అవకాశం ఉంది. జనరిక్ మందులకు మినహాయింపులు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. అలాగే భారత కంపెనీలు కూడా..అమెరికాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం..లేదా ఇతర దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టడం వంటి వ్యూహాలను అనుసరించవచ్చు.


మొత్తంగా చూస్తే.. అమెరికా కొత్త టారిఫ్ విధానం.. భారత ఫార్మా రంగానికి.. పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. ప్రపంచానికి చౌకగా మందులు అందిస్తున్న భారత్..ఈ కొత్త వాణిజ్య ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.