అమెరికా తన అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోందా..? చైనా లేదా రష్యాతో యుద్ధం వస్తే.. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా స్పందించేందుకు, అమెరికా కొత్త ప్లాన్‌పై కసరత్తు చేస్తోందా..? ముఖ్యంగా దూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భారీ అణు క్షిపణుల కంటే.. తక్కువ దూరం, తక్కువ శక్తి కలిగిన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌కు.. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త వ్యూహం అమల్లోకి వస్తే.. యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని అణు ఆప్షన్స్ అందుబాటులోకి రావచ్చు. మరి, అమెరికా ఎందుకు ఈ మార్పు గురించి ఆలోచిస్తోంది..? టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి..? దీనివల్ల అణుయుద్ధం ముప్పు పెరుగుతుందా..? అసలు ఈ కొత్త వ్యూహం వెనుక ఉన్న కారణాలేంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా, అమెరికా అణు వ్యూహంలో ఏం మారబోతోంది?
అమెరికా రక్షణ శాఖ, అంటే పెంటగాన్.. దేశ అణు వ్యూహాన్ని భారీగా సమీక్షిస్తోంది. చైనా లేదా రష్యాతో ఒకవేళ యుద్ధం వస్తే.. అమెరికా ఎలా స్పందించాలి అనే దానిపై, కొత్త విధానాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా అణు వ్యూహంలో సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగల స్ట్రాటజిక్ న్యూక్లియర్ మిసైల్స్‌కి మొదటి ప్రాధాన్యత ఉంది. కానీ కొత్త ప్రతిపాదనలో ఈ భారీ సుదూర అణ్వాయుధాలపై మాత్రమే ఆధారపడకుండా.. తక్కువ దూరంలో ఉపయోగించగల టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను మరింత కీలకంగా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సమీక్షకు పెంటగాన్ పాలసీ చీఫ్ ఎల్బ్రిడ్జ్ కోల్బీ (Elbridge Colby) నేతృత్వం వహించనున్నారు. అమెరికా అణ్వాయుధ బలగాలను పర్యవేక్షించే US Strategic Commandను సందర్శించే సమయంలో.. నెబ్రాస్కాలో జరిగే ఒక ప్రైవేట్ మిలిటరీ ఈవెంట్లో ఈ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం ఒక ప్రతిపాదన మాత్రమే, ఇప్పటికైతే సమీక్ష దశలోనే ఉంది.
అసలు ట్రంప్‌కు మరిన్ని అణు ఆప్షన్స్ ఎందుకు?
ఇక్కడే, ఒక కీలకమైన అంశం ఉంది. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేస్తే.. ఆ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడి ముందు కేవలం రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండకూడదన్నది.. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది. అంటే ఒకవైపు సాధారణ ఆయుధాలతో స్పందించడం.. మరోవైపు భారీ స్థాయిలో అణ్వాయుధాలను ప్రయోగించడం అనే all OR Nothing పరిస్థితి కాకుండా.. మధ్యలో మరిన్ని ఆప్షన్స్ ఉండాలని అమెరికా రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
అమెరికా డిఫెన్స్ అధికారుల ప్రకారం.. విశ్వసనీయమైన అణు సామర్థ్యాలు ఉంటేనే ప్రత్యర్థి దేశాలను దాడి చేయకుండా నిరోధించగలమని భావిస్తున్నారు. అంటే అణ్వాయుధాలను ఉపయోగించడం తమ మొదటి ఎంపిక అని కాదు.. కానీ అవసరమైతే అధ్యక్షుడి వద్ద వాస్తవికంగా ఉపయోగించగల ఎంపికలు ఉండటం ద్వారా డిటరెన్స్ (deterrence), అంటే ప్రత్యర్థిపై దాడి చేయకుండా భయపెట్టి అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుందని వారి వాదన.
ఇక, ఇప్పుడు అసలు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ అంటే చాలా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల, అత్యంత భారీ విధ్వంసానికి ఉపయోగించే అణ్వాయుధాలు. వీటి లక్ష్యం ప్రత్యర్థి దేశంలోని కీలక ఆర్మీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు లేదా పెద్ద ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం.
అయితే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సాధారణంగా తక్కువ దూరం, తక్కువ శక్తి కలిగిన అణ్వాయుధాలుగా పరిగణిస్తారు. వీటిని ప్రధానంగా యుద్ధభూమిలోని సైనిక లక్ష్యాలపై లేదా ప్రాంతీయ స్థాయిలో ఉపయోగించేలా రూపొందిస్తారు. అంటే ఒక దేశం మొత్తం నాశనం చేయడం కంటే.. నిర్దిష్ట సైనిక లక్ష్యంపై పరిమిత స్థాయిలో అణు దాడి చేసే ఆలోచన ఇందులో ఉంటుంది.
అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఎందుకంటే శక్తి తక్కువగా ఉన్నప్పటికీ.. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అణ్వాయుధమే. దాని వినియోగం వల్ల భారీ ప్రాణనష్టం, రేడియేషన్ ప్రభావంతో పాటు.. ప్రత్యర్థి దేశం కూడా అణ్వాయుధాలతో ప్రతిస్పందించే ప్రమాదం ఉంటుంది.
Next.. అణ్వాయుధాల వినియోగానికి ఉన్న పరిమితి తగ్గుతుందా?
ఈ కొత్త ప్రతిపాదనపై నిపుణుల్లో ప్రధానంగా ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. టాక్టికల్ అణ్వాయుధాలను యుద్ధభూమిలో ఉపయోగించగల సాధారణ ఆప్షన్‌గా మిలిటరీ ప్లానింగ్‌లో చేర్చితే.. భవిష్యత్తులో అణ్వాయుధాలను ఉపయోగించేందుకు ఉన్న మానసిక, రాజకీయ అడ్డంకులు తగ్గిపోవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంటే.. ఒకవేళ ప్రత్యర్థి దేశంతో సంప్రదాయ యుద్ధం జరుగుతున్న సమయంలో.. పెద్ద అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా భారీ యుద్ధం మొదలవుతుంది.. కానీ చిన్న టాక్టికల్ అణ్వాయుధంతో పరిమితంగా స్పందించవచ్చు అనే ఆలోచన పెరిగితే.. అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి మరింత త్వరగా రావచ్చని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. అణ్వాయుధాల వినియోగం అంత తీవ్రమైన నిర్ణయంగా కనిపించకుండా పోతే.. వాటిని ఉపయోగించే ప్రమాదం పెరిగే అవకాశం ఉందన్నదే నిపుణుల భయం.
మరోవైపు కొందరు నిపుణులు ఇంకో ప్రమాదాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. టాక్టికల్ అణ్వాయుధాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల.. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు నిజంగా భారీ స్థాయి అణు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తే.. సుదూర స్ట్రాటజిక్ న్యూక్లియర్ మిసైల్స్‌పై ఆధారపడే సామర్థ్యాలపై తగినంత దృష్టి తగ్గిపోవచ్చని వారు వాదిస్తున్నారు.
ఇక, మెయిన్ గా చైనా, రష్యా పేర్లు ఎందుకు ప్రధానంగా వినిపిస్తున్నాయంటే.. ఈ రెండు దేశాలూ అణ్వాయుధ శక్తులు కలిగిన ప్రధాన ప్రత్యర్థులు. రష్యాతో అమెరికా, పాశ్చాత్య దేశాల మధ్య భద్రతా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. మరోవైపు చైనా-అమెరికా మధ్య ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక పోటీ పెరుగుతోంది.
ప్రత్యేకంగా అమెరికా మిత్రదేశాలపై రష్యా లేదా చైనా దాడి చేస్తే.. అమెరికా ఎలా స్పందించాలి అన్నదే ఈ కొత్త వ్యూహంలో కీలక ప్రశ్న. అందుకే ప్రాంతీయ యుద్ధాల్లో ఉపయోగించగల టాక్టికల్ అణ్వాయుధాలను అమెరికా తన డిటరెన్స్ స్ట్రాటజీలో (deterrence strategy) మరింత కీలకంగా మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ ప్రపంచాన్ని ఆలోచింపజేసే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, 1945,ఆగస్టు 6న అంటే.. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించింది. ఆ దాడుల తర్వాత జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.
అయితే, అప్పటి నుంచి ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, ఘర్షణలు జరిగినప్పటికీ.. ఏ దేశమూ యుద్ధంలో అణ్వాయుధాన్ని ఉపయోగించలేదు. అణ్వాయుధాల వినియోగం వల్ల ఏర్పడే అపారమైన విధ్వంసం, రేడియేషన్, అలాగే ప్రత్యర్థి దేశం ప్రతిదాడి చేసే ప్రమాదం ఉండటమే దీనికి ప్రధాన కారణాలు. అందుకే ఇప్పుడు అమెరికా తన అణు వ్యూహంలో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
మొత్తంగా చూస్తే.. అమెరికా ప్రస్తుతం చైనా లేదా రష్యాపై అణుదాడి చేయబోతోందని దీని అర్థం కాదు. ఇది ఒక వ్యూహాత్మక సమీక్ష మాత్రమే. అయితే భవిష్యత్తులో ఒకవేళ యుద్ధ పరిస్థితి వస్తే.. అమెరికా అధ్యక్షుడి వద్ద మరిన్ని అణు ఆప్షన్స్ ఉండాలన్నది ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరి అమెరికా చివరకు ఎలాంటి అణు వ్యూహాన్ని అమలు చేస్తుంది..? టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌కు నిజంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా..? లేక ప్రస్తుత స్ట్రాటజిక్ న్యూక్లియర్ నిరోధక వ్యవస్థనే కొనసాగిస్తుందా..? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోంది.. అమెరికా అణు వ్యూహంలో జరిగే ఏ మార్పు అయినా.. కేవలం అమెరికాకే కాదు, చైనా, రష్యాతో పాటు మొత్తం ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Reply