Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి

ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన వంతెనలు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు.. ఎటుచూసినా శిథిలాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన ఈ జల ప్రళయం ఇప్పటికే 900కు పైగా ప్రాణాలను బలిగొంది.. వేలాది మందిని గల్లంతు చేసింది. కానీ.. ఈ భయానక విధ్వంసం మధ్య కొన్ని ఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శిథిలాల కింద మూడు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఒక కప్పు టీ కోసం పది నిమిషాలు ఆగడంతో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు స్నేహితులు.. ఇక చుట్టూ ఉన్న ఇళ్లు కూలిపోయినా వరద ఉధృతిని తట్టుకుని నిలబడిన ఆ పచ్చని ఇల్లు..! అసలు వీళ్లంతా ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? ఆ ఒక్క ఇల్లు అంతటి భారీ వరదను తట్టుకుని ఎలా నిలబడింది. ఈ విపత్తులో ఇంకా ఎంత మంది గల్లంతయ్యారు? రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నేపాల్‌ను కుదిపేస్తున్న ఈ వరద విలయం వెనుక అసలు ఏం జరిగింది?

ముందుగా, నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్ విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందో.. తాజాగా బయటకొస్తున్న గణాంకాలు చెబుతున్నాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య ఇప్పటికే 900 దాటింది. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాజా లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 903 మృతదేహాలను వెలికితీశారు. నదీ తీరాల్లో వరద నీటితో కొట్టుకొచ్చిన మృతదేహాలు కనిపిస్తుండటం.. ఈ విపత్తు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో కళ్లకు కడుతోంది.

మృతుల సంఖ్య పెరుగుతుండటంతో.. బయటపడుతున్న మృతదేహాలను గుర్తించడం, వాటిని భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా దక్షిణ చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 272 మృతదేహాలు లభ్యమయ్యాయి. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు.. గుర్తింపు ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కాళీ గండకి, త్రిశూలి నదుల సంగమ ప్రాంతమైన దేవఘాట్‌లో కొన్ని మృతదేహాలకు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే.. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు వీలుగా.. ఖననం చేయడానికి ముందు మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించినట్లు చిత్వాన్ జిల్లా అధికారులు తెలిపారు. మరో 21 గుర్తుతెలియని మృతదేహాలను వివిధ ఆసుపత్రుల్లో భద్రపరిచారు. తమవారి ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు.. ఆసుపత్రులకు వచ్చి గుర్తించాలని అధికారులు కోరుతున్నారు.

మరోవైపు, ఈ వరద విపత్తులో సుమారు 4,247 మంది ఆచూకీ గల్లంతైందని ఎన్‌డీఆర్-ఆర్ఎంఏ వెల్లడించింది. వీరిలో 592 మంది విదేశీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ మరో కీలకమైన సమాచారం ఏంటంటే.. గల్లంతైన వారిలో సాధారణ ప్రజలే కాకుండా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. భోటేకోశి, త్రిశూలి నదీ తీరాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదు.

ఇక, ఇప్పటివరకు 10,451 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిలో 252 మంది విదేశీయులు కూడా ఉన్నారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగి.. 3,344 మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉండటంతో.. భారత, చైనా సాంకేతిక బృందాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది.

ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్‌లో నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలకు చెందిన 20,819 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరోవైపు ఈ విపత్తులో 267 మంది గాయపడ్డారు. వారిలో 156 మంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంటే.. ఒకవైపు శిథిలాల మధ్య మృతదేహాల కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంటే.. మరోవైపు ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించి, చికిత్స అందించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా నిరంతరం కొనసాగుతోంది.

మరోవైపు, ఇంతటి విపత్తు సమయంలో.. ఒక చిన్న నిర్ణయం ఐదుగురి జీవితాలను ఎలా మార్చేసిందో చెప్పే ఘటన కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు స్నేహితుల కథ. నారాయణ్ సేన్, దినేష్ ఓఝా, ప్రేమ్ సింగ్, యతేంద్ర ప్రకాశ్, దినేష్ సింగ్ ఠాకూర్.. ఆగస్టు 21న కారులో నేపాల్‌కు బయలుదేరారు. యాత్రలో భాగంగా ఆగస్టు 26న ఉదయం ధాదింగ్ జిల్లాలోని మలేఖు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కేవలం ఒక కప్పు టీ తాగాలని అనుకున్నారు. కారును ఆపారు. కొన్ని నిమిషాలు అక్కడే ఉన్నారు. వారికి అప్పటివరకు తెలియని విషయం ఏంటంటే.. ఆ పది నిమిషాల విరామమే వారి జీవితాలను కాపాడబోతోందని!

వాళ్లు టీ తాగుతున్న సమయంలోనే భోటే కోశి, త్రిశూలి నదులు ఉప్పొంగాయి. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ముందున్న వంతెనను భారీ నీటి ప్రవాహం కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించి ఉంటే.. వాళ్ల కారు కూడా ఆ ప్రవాహంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కానీ వారు టీ కోసం ఆగడంతో.. కేవలం పది నిమిషాల తేడాతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

తమ కళ్ల ముందే కార్లు, మృతదేహాలు, భారీ వస్తువులు నీటిలో కొట్టుకుపోవడం చూసిన ఆ ఐదుగురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు అద్దె కారులోనే ఉండాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులతో హెల్ప్‌లైన్ ద్వారా మాత్రమే సంబంధాలు కొనసాగించారు. చివరికి స్థానిక అధికారుల సహాయంతో ఆగస్టు 28న అక్కడి నుంచి బయలుదేరి.. శనివారం నాటికి సొంతూరికి సురక్షితంగా చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చారు.. కానీ వాళ్లు చూసిన దృశ్యాలు మాత్రం జీవితాంతం మర్చిపోలేమని చెబుతున్నారు.

ఈ విధ్వంసం మధ్యలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉన్నారా అన్న ఆశతో రెస్క్యూ సిబ్బంది మట్టిదిబ్బలను తొలగిస్తున్నారు. అదే సమయంలో స్థానిక ప్రజలు కూడా సహాయక బృందాలతో కలిసి శిథిలాలను తొలగిస్తూ తమవారిని వెతుకుతున్నారు. అలాంటి సమయంలోనే.. శిథిలాల కింద నుంచి ఓ ఆరేళ్ల బాలిక ఏడుపు వినిపించింది. సాయుధ పోలీసు బలగాలు వెంటనే స్పందించి.. మట్టిని తొలగించి ఆ చిన్నారిని సజీవంగా బయటకు తీశాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను కాఠ్మాండూకు తరలించారు. ఈ రెస్క్యూ సంఘటన.. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉండొచ్చనే ఆశను మరింత బలపరిచింది.

ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడం ఈ విపత్తు తీవ్రతను తెలియజేస్తోంది. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సుమారు 4000 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మానస సరోవర్ యాత్ర కోసం వచ్చిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. భారత విదేశాంగ శాఖ కూడా పలువురు భారతీయుల సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని వెల్లడించింది. కొందరు భారతీయులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ.. మరికొందరు చైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. వర్షం, పొగమంచు, వరదల కారణంగా రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఇక, ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి.. చుట్టూ ఎక్కడ చూసినా వరద నీరే.. భారీ బండరాళ్లు, మట్టి, చెట్లు వేగంగా కొట్టుకొస్తున్నాయి. పక్కనే ఉన్న ఇళ్లు ఒక్కొక్కటిగా కొట్టుకుపోతున్నాయి. కానీ.. ఆ వరద ప్రవాహం మధ్యలో ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. ఆ ఇంటి బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం కూడా సురక్షితంగా బయటపడింది. ఇందులో నిజంగా అదృష్టమే పనిచేసిందా? లేక ఆ ఇంటి నిర్మాణంలోనే ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటూ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి.. “ఇందులో అదృష్టం ఎంత వరకు పనిచేసిందో తెలియదు కానీ.. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం అయితే.. నేపాల్‌లోని హిమాలయ.. లోయ ప్రాంతాల్లో చాలా ఇళ్లు సాధారణంగా స్టోన్ మేసన్రీతో నిర్మిస్తారు. అంటే రాళ్లు, మట్టి లేదా మోర్టార్‌తో గోడలు నిర్మించి, వాటిపైనే ఇంటి బరువును మోయించే విధానం. ఈ తరహా నిర్మాణాలు సాధారణ పరిస్థితుల్లో పై నుంచి వచ్చే బరువును తట్టుకోగలవు. కానీ వరద నీరు, మట్టి, బండరాళ్లు కలిసి పక్కవైపు నుంచి భారీ ఒత్తిడితో ఢీకొంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

ఈ ఇంటి విషయంలో కూడా ఇదే జరిగింది. వైరల్ అవుతున్న వివరణ ప్రకారం.. ఈ ఇల్లు సాధారణ స్టోన్ మేసన్రీ నిర్మాణం కాదు. దీనికి రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ ఫ్రేమ్ ఉంది. అంటే ఇంటి కాలమ్స్, బీమ్స్, ఫౌండేషన్ అన్నింటినీ స్టీల్ రీబార్స్‌తో ఒకే బలమైన నిర్మాణంగా అనుసంధానించారు. వరద నీరు, మట్టి, బండరాళ్లతో కూడిన ప్రవాహం ఇంటిని పక్కవైపు నుంచి ఢీకొన్నప్పుడు.. ఆ ఒత్తిడిని కేవలం గోడలు భరించాల్సిన అవసరం లేకుండా మొత్తం కాంక్రీట్ ఫ్రేమ్ ఆ బలాన్ని పంచుకుంది. చివరకు ఆ శక్తిని ఫౌండేషన్ ద్వారా నేలలోకి బదిలీ చేసింది. అందుకే గోడలపై మాత్రమే ఆధారపడిన ఇళ్లతో పోలిస్తే ఈ ఇల్లు ఎక్కువ స్థిరత్వాన్ని చూపించింది.

అయితే.. కేవలం RCC ఫ్రేమ్ ఉండటం వల్లే ఇల్లు బతికిపోయిందని చెప్పలేం. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. ఆ ఇల్లు వరద ప్రవాహానికి సరిగ్గా మధ్యలో లేదు. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి అన్నీ కలిసి వచ్చే డెబ్రిస్ ఫ్లో సాధారణంగా ఒక ప్రధాన లోతైన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి ఈ ఇల్లు కొద్దిగా పక్కకు, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నీటి ప్రవాహం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా.. దాని రెండు వైపులా విడిపోయి వెళ్లే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన మట్టి కూడా ఇంటి చుట్టూ పేరుకుపోయి.. తర్వాత వచ్చే ప్రవాహానికి సహజమైన అడ్డుకట్టలా పనిచేసినట్లు నిపుణుల వివరణ చెబుతోంది

మొత్తంగా, ఇక్కడ రెండు విషయాలు చాలా కీలకంగా మారాయి. ఒకటి.. ప్రకృతి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. మరొకటి.. ఇలాంటి విపత్తుల్లో నిర్మాణ నాణ్యత, భౌగోళిక పరిస్థితులు, సరైన సమయంలో తీసుకునే చిన్న నిర్ణయం కూడా ప్రాణాంతకమైన పరిస్థితిని తప్పించగలదు. నేపాల్‌లో వరదలు మిగిల్చిన విధ్వంసం ఇంకా పూర్తిగా బయటపడాల్సి ఉంది. శిథిలాల కింద తమవాళ్లు బతికే ఉన్నారనే ఆశతో వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రెస్క్యూ బృందాలు మాత్రం..ఆరేళ్ల చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాక.. మరో ప్రాణాన్ని కాపాడగలమనే గట్టి ఆశతో శిథిలాల మధ్య తమ గాలింపును మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.