దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ పావన గోదావరి తీరం పుష్కర శోభతో వెలిగిపోనుంది. బృహస్పతి సింహరాశిలోకి అడుగుపెట్టే ఈ పవిత్ర ముహూర్తాన సకల దేవతలు మరోమారు గోదావరీ జలాల్లో కొలువుదీరనున్నారు. సకల పాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కర ఘడియల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ దివ్యమైన ఘడియల్లో స్నానమాచరించేందుకు తరలి వచ్చే కోట్లాది భక్తజనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే, అత్యాధునిక సాంకేతికతల సాయంతో భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసేందుకు అధికారులు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 300 రోజుల్లో వేద మంత్రాల ఉచ్ఛారణలు, తెలుగు వైభవాన్ని చాటే సాంస్కృతిక ప్రదర్శనలు, తల్లి గోదావరికి ఇచ్చే నిత్య హారతులతో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది కిలోమీటర్ల తీర ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగితేలబోతోంది.
12 సంవత్సరాలకు ఓసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో పవిత్ర నదీ స్నానాలు, పితృ తర్పణాలు, ప్రత్యేక పూజలు ఆచరించడం ద్వారా విశేష పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం. పన్నెండెళ్లకోసారి వచ్చే పుష్కర వైభవంతో తెలుగు రాష్ట్రాల పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిపోనుంది. మహారాష్ట్రలో గోదావరి జన్మస్థానం నుంచి ఏపీలో అది సముద్రంలో కలిసే చోటు వరకు ఈ పన్నెండు రోజులు.. కుంభమేళాను తలపించనున్నాయి.
పుష్కరాల వెనక ఒక పౌరాణిక గాథ ఉంది. తుందిలుడు అనే వాడు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తుందిలుడు శివునిలోనే శాశ్వత స్థానం కావాలని అర్థించాడు. అంతట శివుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో స్థానాన్నిచ్చాడు. అలా తుందిలుడు పుణ్యతీర్ధాలకు అధిపతి అయ్యాడు. సకల జలరాశిని పోషించే శక్తి అతనికి వచ్చింది. అందుకే తుందిలుడికి పుష్కరుడనే పేరు వచ్చింది. సృష్టి సమయంలో బ్రహ్మకి జలం చాలా అవసరం. అందుకని.. శివుడి వద్ద ఉండే.. పుష్కరుడిని బ్రహ్మ తీసుకుపోతాడు. తర్వాత.. ఓసారి బృహస్పతి కూడా పుష్కరుడిని తనతో పంపాలని బ్రహ్మని కోరతాడు. అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరుడు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం బృహస్పతి 12 రాశులలో ప్రవేశించినప్పడు…. ప్రవేశించిన మొదటి రోజు నుంచి పన్నెండు రోజులు పుష్కరుడు బృహస్పతితోనే పూర్తిగా ఉండాలని, మిగిలిన రోజులు మధ్యాహ్నం పూట ఉండాలని నిర్ణయం జరిగింది. ఆ సమయంలో అఖిల దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో కలిసి వస్తారు. అందుకే పుష్కరాలు వచ్చిన నదిలో స్నానం చేస్తే అంత పుణ్యం.
ఈ క్రమంలో బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఈ క్రమంలో ఆయన సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణ గంగా నదిగా పిలువబడే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. అయితే.. పుష్కరాల మొదటి 12 రోజులను ‘ఆది పుష్కరాలు’ అని, చివరి 12 రోజులను ‘అంత్య పుష్కరాలు’ అంటారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. ఈ పవిత్ర కాలంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, పితృదేవతలకు పిండప్రదానాలు చేయడం వల్ల ముక్తి లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
గోదావరి పుష్కర వైభవం గురించి పలువురు చరిత్రకారులు తమ రచనల్లో ప్రస్తావించారు. 1884 తారణనామ సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాలకు నేటి ఒరిస్సా, నిజాం రాష్ట్రం నుండి కూడా భారీగా భక్తులు రాజమహేంద్రవరం వచ్చినట్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తన `స్వీయచరిత్ర’ లో రాసుకున్నారు. 1896 పుష్కరాల కోసం నాటి బ్రిటిష్ ప్రభుత్వం లింగాల వద్ద తాటి ఆకుతో పందిళ్లు, పాకలు వేయించి వసతులు ఏర్పాటుచేసినట్లు రికార్డులున్నాయి. దర్మవరం జమీందారు ఆ ఏడాది యాత్రికులు సౌకర్యంకోసం నీళ్ల పైపులను వేయించినట్లు ఆ రికార్డుల్లో ప్రస్తావన ఉంది.
ఇటు ఏపీలో 10 కోట్ల మంది భక్తులు.. 440 ఘాట్లు.. రూ.4,026 కోట్ల పనులు.. AIతో రద్దీ నియంత్రణ..! వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ఇంతవరకు లేనంత భారీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. భక్తుల భద్రత నుంచి రవాణా, పారిశుద్ధ్యం, వైద్యం, వసతి వరకు ప్రతి అంశాన్ని హైటెక్ పరిజ్ఞానంతో పర్యవేక్షించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనల కలయికగా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నదీ పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో అధికారులు ముందడుగు వేస్తున్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కర వేడుకలకు రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పుష్కర ప్రారంభానికి ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉన్నందున, అన్ని పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించారు.
గతంలో 2015లో జరిగిన మహా పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి ఈ సంఖ్య 8 నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పుష్కరాల సమయంలో రోజుకు సగటున కోటి మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు, కాకినాడ జిల్లాలో 88 ఘాట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 82 ఘాట్లు, ఏలూరు జిల్లాలో 44 ఘాట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 ఘాట్లు, పోలవరం జిల్లాలో 11 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో పాతవి 259 కాగా, అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం దాదాపు 60 అదనపు రైలు సర్వీసులను నడిపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించనున్నారు. పిఠాపురం శక్తిపీఠం, పంచారామాల్లోని 4 క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ ఆలయాలను ఈ సర్క్యూట్లో చేర్చారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ‘హోమ్ స్టే’ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు.
రాజమహేంద్రవరంలో ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానాలు పంపటం, ఏపీ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకలను ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కూచిపూడి మొదలు ఏపీలోని కళారూపాల ప్రదర్శనలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు సంయుక్త ప్రణాళికను రెడీ చేస్తున్నాయి. పర్యాటక శాఖ ద్వారా శాస్కి స్కీమ్‌లో భాగంగా చినకాశీరేవులోని మూడు ఘాట్ల వద్ద రూ.24 లక్షల వ్యయంతో దివ్యమైన ‘గోదావరి హారతి’ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈసారి పుష్కర భద్రత, రద్దీ నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏఐ ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సిసిటివి ఎంట్రీ-ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, క్యూఆర్ కోడ్ ఆధారిత వాహన గుర్తింపు వ్యవస్థ, డీసెంట్రలైజ్డ్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
పుష్కర ఘాట్లలో 1,110 వైద్య శిబిరాలతోపాటు 30 ఫీల్డ్ ఆసుపత్రులను, మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం 30,000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించనున్నారు. అదే విధంగా అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. పర్యవేక్షణ కోసం పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నారు. భక్తుల భద్రత కోసం గోదావరి నదిలో 2,697 రెస్క్యూ బోట్లను సిద్ధం చేయడంతో పాటు 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని 260 గ్రామ పంచాయతీలలో 50 పంచాయతీలను ‘మోడల్ పుష్కర పంచాయతీలు’గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ‘మునికూడలి’ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. కొవ్వూరు–పోలవరం మీదుగా పట్టిసీమ రోడ్డు, సీతానగరం నుంచి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వరకు బిటి రోడ్డు, అవెన్యూ ప్లాంటేషన్, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. రాజమహేంద్రవరం–పోలవరం మధ్య జాతీయ రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 487 గ్రీన్ ఎనర్జీ బస్సులను నడపడంతో పాటు 11 బస్టాండ్లను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నారు. గోదావరి నది జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు అందులో కలుస్తున్నందున, ఈ వేడుకలను ‘అఖండ గోదావరి’ పేరుతో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఇటు..రాబోయే 2027లో ఘనంగా జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మహా పుష్కరాల నిర్వహణ, అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. తెలంగాణలో సుమారు 560 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలిగిన గోదావరి నది ఎనిమిది జిల్లాల గుండా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, ఆలయాల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2027లో జరగనున్న ఈ మహా క్రతువుకు దేవాదాయ శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు తెలంగాణలో సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు.రాబోయే పుష్కరాల కోసం నది ప్రవహించే జిల్లాల్లో దాదాపు 96 ఘాట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి, నిర్మల్ జిల్లా బాసర, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, ములుగు జిల్లా మంగపేట, పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోటిలింగాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతాలు పుష్కరాల ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. తెలంగాణలో 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు దాదాపు 15 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Leave a Reply