Trump’s Big Statement on Strait of Hormuz: ఇరాన్‌కు అమెరికా ఝలక్! “హర్ముజ్ మా భూభాగమే!” ట్రంప్ సంచలన ప్రకటన

“ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి హర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిని.. ‘‘అమెరికా భూభాగం’’గా ట్రంప్ అభివర్ణించారు. అసలు హర్ముజ్ జలసంధిపై ట్రంప్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ జలసంధి ప్రపంచానికి ఎందుకు అంత కీలకం? అమెరికా కొత్తగా విధించే ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ స్టోరీలో డీటెయిల్‌గా తెలుసుకుందాం.”

హర్ముజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో అనుసంధానించే అత్యంత వ్యూహాత్మక జలమార్గం. ఒకవైపు ఇరాన్.. మరోవైపు ఒమన్, యూఏఈ తీరాలు ఉంటాయి. ఈ మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు భారీగా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణా అవుతుంది. అందుకే హర్ముజ్‌ను ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఆయిల్ చోక్‌పాయింట్‌గా పరిగణిస్తారు.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు వరకు ఈ జలసంధి మీదుగా రవాణా అవుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు హర్ముజ్ అత్యంత కీలకం. అందుకే.. ఈ మార్గంలో రవాణాకు అంతరాయం ఏర్పడితే.. దాని ప్రభావం ఒక్క గల్ఫ్ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో పాటు.. పెట్రోల్, డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు, చివరికి ద్రవ్యోల్బణంపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్‌లో షిప్పింగ్‌ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ విధించిన బ్లాకేడ్, భద్రతాపరమైన ముప్పు నేపథ్యంలో.. ఈ కీలక జలమార్గం గుండా నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. దీంతో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లలో కూడా అనిశ్చితి పెరిగింది. ఇంధన సరఫరాకు అంతరాయం ఇలాగే కొనసాగితే, చమురు ధరలు పెరగడంతో పాటు.. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న దేశాలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధిని ‘‘అమెరికా భూభాగం’’గా తాను చూస్తున్నానని అన్నారు. అంతేకాదు.. హర్ముజ్‌పై అమెరికాకు ‘‘పూర్తి నియంత్రణ’’ ఉందని కూడా ప్రకటించారు. మరోవైపు.. ఇరాన్ కూడా ఒప్పందం కోసం ఆసక్తి చూపుతోందని ట్రంప్ చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం అమెరికాకు అసలు డీల్ అవసరమా? లేదా? అన్నదానిపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే.. హర్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన జలమార్గం. అలాంటి ప్రాంతాన్ని ఏ దేశమైనా తన సొంత భూభాగంగా ప్రకటించడం.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసే అంశమే. మరి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రకటనకే పరిమితమా? లేక హర్ముజ్‌పై అమెరికా తన వ్యూహాత్మక పట్టును మరింత పెంచుకునే ప్రయత్నమా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.

మరోవైపు.. ఇరాన్‌పై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌తో వాణిజ్యం చేసే కీలక దేశాలు, సంస్థలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతుల్లో చైనాకు కీలక పాత్ర ఉంది. 2025లో ఇరాన్ ఎగుమతి చేసిన చమురులో 80 శాతానికి పైగా చైనాకే వెళ్లినట్టు కేప్లర్ డేటా చెబుతోంది. దీంతో అమెరికా కొత్త ఆంక్షలు చైనాపైనా ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.అదేవిధంగా, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కొత్త ఆంక్షలను ప్రకటించనున్నారు. వీటిని అమెరికా “అత్యంత కఠినమైన ఆంక్షలు”గా అభివర్ణిస్తోంది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినంగా మారితే.. దాని ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్ దేశాల మధ్యే ఉండకపోవచ్చు. ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గడం, హర్ముజ్‌లో షిప్పింగ్‌కు అంతరాయం కొనసాగడం జరిగితే.. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడి మరింత పెరగవచ్చు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చమురు ధరలు పెరిగితే.. దాని ప్రభావం చివరికి పెట్రోల్, డీజిల్ ధరల నుంచి రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తత ఇప్పుడు కేవలం అమెరికా-ఇరాన్ వివాదంగా మిగలడం లేదు. ఇది ప్రపంచ ఇంధన భద్రత, చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణంతో ముడిపడిన అంశంగా మారుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా కొత్త ఆంక్షలు, ఇరాన్ ప్రతిస్పందన.. రాబోయే రోజుల్లో పరిస్థితులను మరింత కీలకంగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, అమెరికా ఆంక్షలు కఠినతరం చేస్తే.. చైనా-ఇరాన్ వాణిజ్యంపై, ప్రపంచ చమురు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందన్నదే ఇప్పుడు కీలకం. అందుకే, హర్ముజ్‌లో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.