అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడిపై సొంత తల్లి, తమ్ముడిని హత్య చేసిన కేసు నమోదైంది. మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా.. కుటుంబ సభ్యులను చంపాలన్న ఆలోచనలపై అతడు ఇంటర్నెట్‌తో పాటు ChatGPTలో కూడా సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగింది? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు? హత్యల తర్వాత అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కనిపించాయి?
మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో నివసించే 17 ఏళ్ల అర్జున్ అరవింద్.. యాక్టన్-బాక్స్-బరో రీజినల్ హైస్కూల్ లో చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం అతడి ఇంట్లో దారుణ ఘటన జరిగింది. అర్జున్ తల్లి 45 ఏళ్ల సుధా వెంకటేశన్, 14 ఏళ్ల తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలపై స్పష్టమైన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. హత్యలకు ఖచ్చితమైన కారణం, ఉపయోగించిన ఆయుధం వంటి వివరాలను వైద్య పరీక్షల తర్వాత వెల్లడించాల్సి ఉంది.
ఈ ఘటన వెలుగులోకి రావడం కూడా అనూహ్యంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఓ ట్యూటర్ ఇంటికి వచ్చారు. అపాయింట్‌మెంట్ ఉన్నప్పటికీ, ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్జున్ తండ్రి పోలీసులను సంప్రదించి.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకోవాలని కోరారు. పోలీసులు ఇంటికి చేరుకుని చూడగా.. తల్లి సుధా బేస్‌మెంట్‌లో, తమ్ముడు సిద్ధార్థ్ మొదటి అంతస్తులో మృతిచెందిన స్థితిలో కనిపించారు.
అప్పటికే అర్జున్ ఇంట్లో లేడు. అతడి తల్లి కారు కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అతడి కోసం గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున.. యాక్టన్‌కు సమీపంలోని వేయ్‌లాండ్‌లో ఓ పార్కింగ్ ప్రాంతంలో పోలీసులు కారును గుర్తించారు. ఆ కారులోనే అర్జున్ కూడా ఉండటంతో.. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో బయటపడిన మరో విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల అర్జున్ ప్రవర్తనలో దారుణమైన మార్పులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా.. తన కుటుంబ సభ్యులను చంపడం గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. ఇలాంటి హత్యలకు సంబంధించిన ఊహాత్మక ఆలోచనలు, ఫాంటసీలపై ChatGPTలో కూడా ప్రశ్నలు అడిగినట్టు మిడిల్‌సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది.
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, అతడు కేవలం హత్యల గురించే కాకుండా.. వాటిని ఆధారంగా చేసుకుని గాథిక్ నవెల్ తరహా కథలు రూపొందించడానికి కూడా AIని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ప్రశ్నలు అడగడం, పాత్రలను సృష్టించడం వంటి వాటిపై కూడా అతడు ChatGPTని ఉపయోగించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సెర్చ్‌లు, అతడి ఆలోచనలు.. జరిగిన హత్యలకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనలో మరో కీలక అంశం.. అర్జున్ తండ్రి ఇచ్చిన సమాచారం. ఆయన మంగళవారం ఉదయం తన భార్యను చివరిసారిగా చూశారు. అర్జున్ తమ్ముడు సిద్ధార్థ్ మధ్యాహ్నం సమయంలో చివరిసారిగా కనిపించినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఇద్దరూ మృతిచెందారు. అయితే.. హత్యలు ఏ సమయంలో జరిగాయి? అసలు ఏం జరిగింది? హత్యల వెనక అర్జున్ ఉద్దేశం ఏంటి? అనే విషయాలపై పోలీసులు ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు.
అర్జున్‌పై ప్రస్తుతం రెండు హత్య కేసులతో పాటు.. కుటుంబ సభ్యులపై దాడి, అసాల్ట్ అండ్ బ్యాటరీ, అనుమతి లేకుండా వాహనం వినియోగించడం, మోటార్ వాహనం దొంగతనం వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏళ్ల వయసు కావడంతో అతడిని తొలుత జువెనైల్ కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మర్డర్ కేసుపై జువెనైల్ కోర్టుకు పరిధి లేకపోవడంతో.. ఆ కేసు, సంబంధిత ఆరోపణలపై అతడిని మరో కోర్టులో హాజరుపరచనున్నారు.
ఒకే కుటుంబంలో తల్లి, 14 ఏళ్ల కొడుకు హత్యకు గురికావడం.. ఆ కేసులో 17 ఏళ్ల మరో కుమారుడే నిందితుడిగా అరెస్టవడం అమెరికాలో సంచలనంగా మారింది. అంతకంటే ముఖ్యంగా.. కుటుంబ సభ్యులను హత్య చేయాలన్న ఆలోచనలపై ముందుగానే ఆన్‌లైన్‌లో సెర్చ్‌లు జరిగాయన్న పోలీసుల ఆరోపణలు ఈ కేసును మరింత చర్చనీయాంశంగా మార్చాయి. అయితే.. ఈ సెర్చ్‌లకు హత్యలకు నేరుగా సంబంధం ఉందా? లేదా అవి కేవలం కథల కోసం చేసినవేనా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం అర్జున్‌పై నమోదైన ఆరోపణలు కోర్టులో నిరూపించాల్సి ఉంది. హత్యలకు అసలు కారణం ఏంటి? ఘటనకు ముందు కుటుంబంలో ఏం జరిగింది? అర్జున్ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply