భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. వాఘా-అట్టారి సరిహద్దు మూసుకుపోయినా.. 150 మంది పాకిస్థానీ వధువులు భారత్‌కు చేరుకున్నారు. వీళ్లంతా భారత్‌లోని యువకులతో నిశ్చితార్థం చేసుకున్నవారే. సరిహద్దు మూసివేయడంతో వీసాలు రాక.. వీరి పెళ్లిళ్లు నెలల తరబడి వాయిదా పడ్డాయి. మరి సరిహద్దు మూసి ఉంటే ఈ వధువులు భారత్‌కు ఎలా వచ్చారు? ఎవరి ప్రయత్నంతో వీరికి వీసాలు లభించాయి? ఇంకా పాకిస్థాన్‌లో ఎంతమంది వధువులు భారత్‌కు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరిహద్దులు వేరైనా.. నిబంధనల గోడలు అడ్డుపడినా.. ఈ వధువుల పెళ్లి బంధం మాత్రం ఆగలేదు. గత ఏడాది చోటుచేసుకున్న భద్రతాపరమైన పరిణామాల నేపథ్యంలో నిలిచిపోయిన సరిహద్దు వివాహాలు.. ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా వీసాలు మంజూరు చేయడంతో.. దాదాపు 150 మంది పాకిస్థానీ వధువులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో అడుగుపెట్టారు. దీంతో ఇరు దేశాల్లోని బంధుమిత్రుల ఇళ్లల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది.

సరిహద్దు మార్గాలు మూతపడటంతో.. భారత్‌ యువకులను పెళ్లి చేసుకోవాల్సిన పాకిస్థానీ వధువుల కుటుంబాలు పరిష్కారం కోసం పాకిస్థాన్‌లోని ఘోట్కీలో ఉన్న ప్రముఖ శాదానీ దర్బార్ పీఠాధిపతి సంత్ యుధిష్ఠిర్‌లాల్ శాదానీని ఆశ్రయించారు. ఆయన చొరవతో భారత్‌లోని నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, జోధ్‌పూర్‌, పూణే వంటి నగరాల్లో పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తున్న 150 మంది వధువుల జాబితాను సిద్ధం చేసి.. భారత హోంశాఖకు సమర్పించారు.

వధువులు, వారి కుటుంబ సభ్యులకు భారత్‌ రావడానికి వీసాలు మంజూరు చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిని హోంశాఖ పరిశీలించింది. అయితే.. అట్టారి-వాఘా సరిహద్దు మార్గం మూసి ఉండటంతో.. రోడ్డు మార్గంలో కాకుండా విమానంలోనే భారత్‌కు రావాలని షరతు విధించింది. దీంతో ఈ వధువులు, వారి కుటుంబ సభ్యులు మూడో దేశాల మీదుగా భారత్‌కు చేరుకోవడం ప్రారంభించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి.. దుబాయ్‌, ఒమన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల మీదుగా ట్రాన్సిట్‌ మార్గాల్లో ప్రయాణించి.. ఈ వధువులు భారత్‌కు చేరుకున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 150 మంది వధువులు, వారి కుటుంబ సభ్యులు భారత్‌కు వచ్చినట్లు సింధీ కమ్యూనిటీ ప్రతినిధులు తెలిపారు. వీరిలో నాగ్‌పూర్‌కు చెందిన 15 మంది వధువులు కూడా ఉన్నారు.

నెలల తరబడి ఎదురుచూసిన తర్వాత తమ కాబోయే భార్యలు సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంతో.. వరుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నాగ్‌పూర్‌లోనే 15 వివాహాలు జరగనున్నాయి. మిగిలిన వధువులు రాయ్‌పూర్‌, జోధ్‌పూర్‌, పూణే సహా వివిధ నగరాలకు చేరుకుని.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

అయితే.. ఈ కథ ఇంకా పూర్తికాలేదు. పాకిస్థాన్‌లో ఇంకా దాదాపు 300 మంది మహిళలు.. భారత్‌లోని తమ కాబోయే వరులను పెళ్లాడేందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్నారని భారత్‌లోని సింధీ కమ్యూనిటీ ప్రతినిధులు చెబుతున్నారు. వీరికి కూడా త్వరలో వీసాలు మంజూరు చేసి.. భారత్‌కు వచ్చే అవకాశం కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఒకవైపు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. మరోవైపు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న కుటుంబాలు. సరిహద్దులు మూసుకుపోయాయి.. ప్రయాణ మార్గాలు మారిపోయాయి.. కానీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఈ వధువుల ఆశ మాత్రం ఆగలేదు. ఒకప్పుడు అట్టారి-వాఘా మార్గంలో సాగిన పెళ్లి ప్రయాణం.. ఇప్పుడు మూడో దేశాల మీదుగా సాగుతోంది. మొత్తంగా దేశాల మధ్య సరిహద్దులు ఉండొచ్చు.. కానీ బంధాలకు, ప్రేమకు సరిహద్దులు ఉండవని ఈ 150 మంది వధువుల కథ మరోసారి చాటిచెబుతోంది.

Leave a Reply

Your email address will not be published.