US-Iran War: అమెరికా భారీ వ్యూహం!ఇరాన్‌పై మదర్‌ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం

ఇరాన్‌.. అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. మరోవైపు ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అమ్ములపొదిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన సంప్రదాయ బాంబుల్లో ఒకటైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఈ బాంబు ఎంత శక్తిమంతమైనది? దీని దాడి ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇరాన్‌ భూగర్భంలో నిర్మించిన అణు కేంద్రాలను ఇది ధ్వంసం చేయగలదా?

మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌.. సంక్షిప్తంగా MOAB. ఇది దాదాపు 9.8 టన్నుల బరువున్న ఈ బాంబును అమెరికా వైమానిక దళం అభివృద్ధి చేసింది. అణ్వాయుధాలను పక్కనపెడితే.. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన సంప్రదాయ బాంబుల్లో ఇదొకటి. భారీ విస్ఫోటనం ద్వారా విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం.

మరి ఈ బాంబు ఎలా పనిచేస్తుంది? సాధారణ బాంబులు నేలను తాకిన తరువాత పేలిపోతాయి. కానీ MOAB గాల్లోనే పేలేలా రూపొందించారు. దాని నుంచి వెలువడే భారీ విస్ఫోటన తరంగాలు చుట్టుపక్కల భవనాలు, వాహనాలు, సైనిక స్థావరాలు, నేలపై ఉన్న రక్షణ నిర్మాణాలకు తీవ్ర నష్టం కలిగించగలవు. పేలుడు ప్రభావంతో పాటు తీవ్రమైన ఒత్తిడి తరంగాలు కూడా ప్రాణాంతకంగా మారుతాయి. అందుకే విస్తృత ప్రాంతంలో శత్రు సైనిక స్థావరాలను దెబ్బతీసేందుకు ఈ బాంబును రూపొందించారు.

దీనిని అమెరికా తొలిసారిగా 2017 ఏప్రిల్ 13న అఫ్గానిస్థాన్‌లో ఉపయోగించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన సొరంగాలు, గుహల సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అప్పట్లో ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇరాన్‌పై MOABను ప్రయోగిస్తే.. అక్కడి అణు కేంద్రాలను ధ్వంసం చేయగలదా? నిపుణులు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్‌లోని ఫోర్దో, నతాంజ్‌ వంటి కీలక అణు కేంద్రాల్లో కొన్ని నిర్మాణాలు భూగర్భంలో లోతుగా, బలమైన రాతి పొరలు, కాంక్రీటు రక్షణ మధ్య ఉన్నాయి. MOAB ప్రధానంగా గాల్లో పేలుడు ద్వారా విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించేందుకు రూపొందించబడింది. నేల లోపలికి లోతుగా చొచ్చుకెళ్లి బలమైన నిర్మాణాలను ఛేదించడం దీని ప్రధాన లక్ష్యం కాదు. అందువల్ల ఈ బాంబుతోనే ఇరాన్‌ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడం సాధ్యమవుతుందని చెప్పలేం.

మరి భూగర్భ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలంటే అమెరికా వద్ద మరో ఆయుధం ఉంది. అదే మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్.. MOP. MOABతో పోలిస్తే ఇది మరింత బరువైనది. దాదాపు 13.6 టన్నుల బరువున్న ఈ బాంబును బలమైన నిర్మాణాల్లోకి చొచ్చుకెళ్లి, ఆ తరువాత పేలేలా రూపొందించారు. దీనిని B-2 స్టెల్త్ బాంబర్‌ ద్వారా ప్రయోగించవచ్చు. అయితే అత్యంత లోతులో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం పరిస్థితులు, నిర్మాణాల స్వభావం, రక్షణ పొరలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి MOP ప్రయోగించినా ప్రతి భూగర్భ కేంద్రం పూర్తిగా ధ్వంసమవుతుందని చెప్పలేం.

మరో కీలక అంశం ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు. MOABను ప్రయోగించడానికి ప్రత్యేక రవాణా విమానం అవసరం. అటువంటి విమానం శత్రుదేశ గగనతలంలోకి వెళ్లడం ప్రమాదకరం. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుంటూ ఈ తరహా దాడి చేయడం అమెరికా సైన్యానికి సవాలుగా మారవచ్చు. అంటే బాంబు శక్తిమంతమైనదే అయినప్పటికీ.. దాన్ని లక్ష్యం వరకు చేర్చడం, అనుకున్న ఫలితాన్ని సాధించడం కూడా అంతే కీలకం.

మరోవైపు ఇరాన్‌పై భారీ దాడులు జరిగితే యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇంధన కేంద్రాలు, చమురు నిల్వలు, విద్యుత్ మౌలిక వసతులు దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లపై ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా యుద్ధాన్ని ముగించాలన్న ఒత్తిడి, దేశీయ రాజకీయ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.

అయితే MOAB ప్రయోగం గురించి వస్తున్న కథనాలను అధికారికంగా ఖరారైన సైనిక నిర్ణయంగా చూడకూడదు. ఈ బాంబును ప్రయోగిస్తారా? ప్రయోగించినా అమెరికా లక్ష్యాలు నెరవేరుతాయా? ఇరాన్‌ ప్రతిదాడులకు దిగితే పశ్చిమాసియాలో పరిస్థితులు ఎలా మారతాయి? ఇవన్నీ రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. ఒక విషయం మాత్రం స్పష్టం.. ఇరాన్‌పై మరిన్ని దాడులు జరిగితే, అది ఇరు దేశాల మధ్య యుద్ధానికే కాకుండా ప్రపంచ ఇంధన, భద్రతా పరిస్థితులకు కూడా కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.