భారతీయులే టార్గెట్‌.. బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర!.. ఫైరింగ్‌ టైమ్‌లో తుపాకీ జామ్‌

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కలకలం రేపుతోంది. భారతీయులను లక్ష్యంగా చేసుకుని సామూహిక హత్యాకాండకు ప్లాన్‌ చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఆరోరాలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే.. అసలు ఏ ఆలయంలో దాడి చేయాలనుకున్నాడనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం భక్తులతో కిటకిటలాడే ఆలయంలో కాల్పులు జరిగి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు. కానీ.. చివరి నిమిషంలో తుపాకీ జామ్‌ కావడం, అతడి సహోద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? నిందితుడు ఏం చేయాలనుకున్నాడు? పోలీసులు అతడి ఇంట్లో ఏమేం గుర్తించారు?

అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రం.. చికాగోకు సమీపంలోని ఆరోరా నగరం. ఇక్కడే శ్రీ వేంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద హిందూ ఆలయాల్లో ఇది ఒకటి. ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అలాంటి ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అలెగ్జాండ్రోస్‌ పపొరాకిస్‌ అనే 19 ఏళ్ల యువకుడు.

పలాటైన్‌ ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసించే పపొరాకిస్‌.. ఓ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఆలయానికి వెళ్లిన అతడు.. పెద్ద సంఖ్యలో భారతీయులను చంపాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే అతడి దగ్గరున్న తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించిన సమయంలో ఆయుధం జామ్‌ అయింది. దీంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయి ఇంటికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటికి చేరుకున్న తర్వాత తుపాకీని ఎలా సరిచేయాలనే విషయంపై పపొరాకిస్‌ ఇంటర్నెట్‌లో వెతికినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. తన సహోద్యోగికి ఫోన్‌ చేసి తుపాకీ జామ్‌ అయిందని, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయానని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు ఆదివారం ఓ ప్రత్యేకమైన రోజు కాబోతోందని కూడా అతడు చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

అతడి మాటలు, ప్రవర్తనపై అనుమానం వచ్చిన సహోద్యోగి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడు తిరిగి ఆలయానికి వెళ్లకముందే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఆ సహోద్యోగి సమయానికి స్పందించకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి ఉండేదని అధికారులు భావిస్తున్నారు.

నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు కనిపించాయి. చిన్న బ్యారెల్‌తో మార్పులు చేసిన ఏఆర్‌ తరహా రైఫిల్‌, సుమారు 300 రౌండ్ల బుల్లెట్లు, బాడీ ఆర్మర్‌, గ్యాసోలిన్‌ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు స్వస్తిక గుర్తులు కూడా గుర్తించారు.

అతడి ఇంట్లో లభించినట్లు చెబుతున్న ఒక మేనిఫెస్టోలో తనను తాను ‘అరోరా షూటర్‌’గా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రచనల్లో జాతి ఆధిపత్య భావజాలం, హింస, సామూహిక హత్యలపై ఆసక్తి వ్యక్తమైనట్లు వెల్లడించారు. భారతీయులు సహా యూదులు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, శ్వేతజాతీయులు కాని ఇతర వర్గాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి పపొరాకిస్‌పై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఇవి ప్రస్తుతం అతడిపై ఉన్న ఆరోపణలు మాత్రమే. కేసులో దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది.

ఈ ఘటనపై బాలాజీ ఆలయ యాజమాన్యం స్పందించింది. భక్తులు, ఉద్యోగులు, వాలంటీర్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. ఆరోరా పోలీసులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. తక్షణమే అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాయుధ భద్రతా సిబ్బందిని పెంచినట్లు తెలిపింది.

మొత్తంగా.. ఒకవైపు తుపాకీ మొరాయించడం, మరోవైపు సహోద్యోగి అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమెరికాలోని బాలాజీ ఆలయంపై జరగాల్సినట్లు అనుమానిస్తున్న భారీ దాడి కుట్ర వెలుగులోకి వచ్చింది. భారతీయులపై విద్వేషం, జాతి ఆధిపత్య భావజాలం ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయగలవో ఈ ఘటన మరోసారి చాటిచెబుతోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published.