ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ భూమ్మీద నూకలుంటే.. ఎంతటి మృత్యువు ఎదురొచ్చినా ప్రాణాలు దక్కుతాయంటారు కదా.. అచ్చు అలాగే జరిగింది ఈ 26 మంది విషయంలోనూ!
అసలు ఆంధ్రా యాత్రికులు ఎలా తప్పించుకున్నారు?
తిరుపతి నుంచి మొత్తం 26 మంది యాత్రికులు కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లారు. వీసా క్లియరెన్స్‌లో ఆలస్యం కావడంతో కాఠ్మాండులో రెండు రోజుల పాటు హోటల్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 25న ఉదయం ఆరు గంటలకు చైనా బోర్డర్ వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గమధ్యంలో బస్సును ఓ చోట ఆపి టీ తాగారు. సాధారణంగా చూస్తే.. అది ఓ చిన్న విరామం మాత్రమే. కానీ.. ఆ రోజు అదే చిన్న టీ బ్రేక్.. వాళ్ల ప్రాణాలను కాపాడిన టర్నింగ్ పాయింట్ గా మారింది.
టీ తాగి బస్సులో మళ్లీ బయలుదేరిన సమయంలో.. ముందున్న ప్రాంతంలో వరద ప్రమాదం ఉందని స్థానికులు వారిని అప్రమత్తం చేశారు. వెంటనే బస్సును వెనక్కి తిప్పాలని సూచించారు. డ్రైవర్ కూడా ఆలస్యం చేయకుండా బస్సును వెనక్కి మళ్లించాడు. అంతే.. వాళ్లు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.కానీ ఆ తర్వాత జరిగిన దృశ్యం చూస్తే గుండె ఆగినంత పనైంది. వాళ్లు వెళ్లాల్సిన మార్గంలోని బ్రిడ్జినే భారీ వరద ప్రవాహం కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఆ యాత్రికులు అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నారు. టీ కోసం కొన్ని నిమిషాలు ఆగకపోయి ఉంటే.. స్థానికులు హెచ్చరించకపోయి ఉంటే.. డ్రైవర్ వెంటనే నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. ఈ 26 మంది పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడం కూడా కష్టం.
సురక్షితంగా బయటపడిన ఓ యాత్రికుడు ఇదే విషయాన్ని చెబుతూ.. ‘‘మా బస్సు ఆ బ్రిడ్జి దగ్గరకు చేరుకునేలోపే టీ కోసం ఆగడం మమ్మల్ని కాపాడింది. మేం వరదకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నాం’’ అని చెప్పారు. ప్రాణాలతో బయటపడిన ఈ యాత్రికులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుడి దయతో తాము సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నామని చెప్పారు.
ఇక ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే.. భారీ మెరుపు వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. నదులు ఉప్పొంగడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు, పర్యాటకులు, యాత్రికులు చిక్కుకుపోయి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల విషయానికి వస్తే.. అక్కడ ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం, నేపాల్ అధికారులు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులను దశలవారీగా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. కాఠ్మాండుకు 21 మంది భారతీయులు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే త్రిశూలి వన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న 63 మంది భారతీయులను కూడా రక్షించారు.మరోవైపు చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు కూడా భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌లోకి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంటే మొత్తం చూస్తే.. భారతీయులను బయటకు తీసుకురావడంలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది.
ఇక్కడే మరో ఆందోళన కలిగించే విషయం కూడా ఉంది. సుమారు 320 మంది భారతీయులు, మరో 100 మంది భారతీయ మూలాలున్న వ్యక్తులు ఇంకా కుటుంబ సభ్యులకు, అధికారులకు అందుబాటులో లేరని విదేశాంగ శాఖ తెలిపింది. వీరి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అంటే.. కొంతమంది భారతీయులు సురక్షితంగా బయటపడుతున్నప్పటికీ.. మరికొంతమంది ఎక్కడ ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణంగా మారింది.
మరోవైపు, ఇది కేవలం సాధారణ వర్షాల కారణంగా వచ్చిన వరద కాదనే అంచనాలు కూడా తెరపైకి వచ్చాయి. హిమనదం లేదా మంచుతో కూడిన ప్రాంతం కూలిపోవడం, దాని ప్రభావంతో భారీగా నీరు, మంచు, మట్టి, రాళ్లు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకురావడం ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చని US Geological Survey సహా అధికారులు, నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద వచ్చే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని నిమిషాల ముందస్తు హెచ్చరిక కూడా వందల మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
ఇక ఈ విపత్తు సృష్టించిన విషాదం ఎంత పెద్దదో మరణాల సంఖ్యే చెబుతోంది. నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 579 మంది వరకు మరణించగా, 977 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఇదే సమయంలో చైనా అధికారిక మీడియా వెల్లడించిన మరణాలను కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 584కు చేరినట్లు సమాచారం. రెండు దేశాల్లో కలిపి దాదాపు 2,500 మంది వరకు ఆచూకీ తెలియడం లేదన్న సమాచారం కూడా ఆందోళన కలిగిస్తోంది.
నేపాల్‌లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సానికి భారీ ట్రక్కులు, వందల సంఖ్యలో ఇళ్లు ఆటబొమ్మల్లా కొట్టుకుపోయాయి. అయితే ఓ భవనం మాత్రం ఆ ఉద్ధృతిని తట్టుకొని నిలబడింది. ప్రవాహ వేగానికి చుట్టూ ఉన్న ఇళ్లు ధ్వంసమై, కొట్టుకుపోయినా ఆ భవనం చెక్కుచెదరలేదు. అందులో ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధ్వంసాన్ని చూస్తుండిపోయారు. వరద తగ్గిన తర్వాత ఆ కుటుంబం సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక, ఇంతటి భారీ విపత్తు నేపథ్యంలో కూడా నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 14 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం రంగంలోకి దించారు. ఇప్పటివరకు దాదాపు 3,742 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం, గల్లంతైన వారి కోసం గాలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.. ఇలా అనేక స్థాయిల్లో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. మరో వరద విపత్తు పొంచి ఉందన్న సమాచారం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. భోటెకోషి నది ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాదు.. టిబెట్ వైపు ఉన్న ఓ డ్యామ్ తెగిపోవడంతో నేపాల్ అధికారులు మరోసారి అలర్ట్ జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్న భద్రతా సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
మరోవైపు, హిమాలయాల్లో మంచు కరిగి కొత్త ముప్పు వచ్చిపడుతోంది. నేపాల్‌లో ఇటీవల సంభవించిన భయంకరమైన వరదలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. దానికంటే అత్యంత భయంకరమైన ప్రమాదం ఇప్పుడు భారతదేశం పైకి దూసుకొస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 88 ‘స్నో బాంబులు’ అంటే ప్రమాదకరమైన గ్లేషియర్ సరస్సులు టైమ్ బాంబుల్లా టిక్ టిక్ మంటూ పేలడానికి సిద్ధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఇవి గనుక పేలితే మన దేశంలోని ఆరు రాష్ట్రాలు నేపాల్ కంటే దారుణమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐఐటీ రోపర్, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ సంయుక్తంగా విడుదల చేసిన పరిశోధనా రిపోర్టు ప్రకారం.. భారతదేశానికి రాబోయే రోజుల్లో ఊహించని ముప్పు పొంచి ఉంది. 1990నాటికి హిమాలయ ప్రాంతంలో కేవలం 107 గ్లేషియర్ సరస్సులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 670 దాటిపోయింది. వీటిలో 88 సరస్సులు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. చిన్నపాటి భూకంపం వచ్చినా లేదా క్లౌడ్ బరస్ట్ సంభవించినా ఇవి బద్దలై నేపాల్ తరహా ప్రళయాన్ని సృష్టిస్తాయి. వీటిలో మొదటిది బద్దలైతే జమ్మూ కాశ్మీర్, రెండోది పేలితే హిమాచల్ ప్రదేశ్, మూడోది పగిలితే ఉత్తరాఖండ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రిపోర్టులో వెల్లడించారు.
మొత్తంగా, నేపాల్‌లో జరిగిన ఈ విషాదం.. ప్రకృతి విపత్తులు ఎంత వేగంగా రూపం మార్చుకుంటాయో మరోసారి గుర్తుచేస్తోంది. కొన్ని నిమిషాల ముందు పరిస్థితి సాధారణంగా కనిపించినా.. ఒక్కసారిగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
ఒక్క టీ బ్రేక్.. స్థానికుల ఒక్క హెచ్చరిక.. బస్ డ్రైవర్ తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ మూడు కలిసి 26 మంది ప్రాణాలను అయితే కాపాడాయి. అదే సమయంలో నేపాల్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకా వేలాది మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.

Leave a Reply