Nepal Flash Floods Update: నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్ విధ్వంసం!.. పొంచి ఉన్న మరో విపత్తు!

సరిహద్దు.. మొన్నటివరకూ ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక యాత్రలకు పేరు పొందిన ప్రాంతం. కానీ ఇప్పుడు అదే ప్రాంతం ఊహించని విపత్తుతో చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫ్లాష్‌ ఫ్లడ్ కారణంగా, కొండ చరియలు విరిగిపడి.. భారీగా మట్టి, రాళ్లు, నీరు దిగువకు దూసుకురావడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి.. వంతెనలు కూలిపోయాయి.. భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ యాత్రికులు, పర్యాటకుల పరిస్థితి ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వస్తున్న గణాంకాలను కలిపి చూస్తే.. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 1,500 మంది వరకు ఆచూకీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరో ప్రమాదం పొంచి ఉందా? అధికారులు ఏమంటున్నారు?

ముందుగా, ఈ విషాదం ఎంత అకస్మాత్తుగా జరిగిందో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. కైలాస్‌ మానససరోవర్‌ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన సుమారు 80 మంది యాత్రికుల బృందం గైరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రానికి చేరుకుంది. అక్కడే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బృంద నాయకుడు ప్రవీణ్‌ ఉదయం 9 గంటల 5 నిమిషాలకు ఈశా ఫౌండేషన్‌కు సమాచారం పంపినట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. కానీ ఆ సమాచారం అందిన కేవలం తొమ్మిది నిమిషాల్లోనే.. అంటే 9 గంటల 14 నిమిషాలకు భారీ వరద ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఆ 80 మంది బృందం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

ఈ విషయం తెలియగానే సద్గురు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను వారం రోజుల క్రితమే అదే భవనంలో ఉన్నానని.. ఇప్పుడు అది పూర్తిగా వరదలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రవీణ్‌ రెండు దశాబ్దాలకు పైగా ఈశా ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు బృందంలోని మిగతా సభ్యుల నుంచి కూడా చాలా గంటలుగా సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రవీణ్‌ కు
సంబంధించిన నేపాల్‌ ఫోన్‌ నంబర్‌ కూడా యాక్టివ్‌గా లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. యాత్రికులు ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలోనే వరద ముంచెత్తి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధిత ప్రాంతానికి వెళ్లి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని సద్గురు ప్రయత్నించినప్పటికీ.. అక్కడికి వెళ్లే రహదారులు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడంతో నేరుగా చేరుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో భారత్‌, చైనా, అమెరికా దౌత్య మార్గాల ద్వారా అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాత్రికులను గుర్తించేందుకు, అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక నేపాల్‌లో మొత్తం పరిస్థితి చూస్తే.. ఎనిమిది జిల్లాల్లోనే భారీ విధ్వంసం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మొదటి అంచనాలు వచ్చినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగింది. తాజా అప్‌డేట్ల ప్రకారం మృతుల సంఖ్య 469కు చేరినట్లు సమాచారం. మరోవైపు వందల నుంచి వేల మంది వరకు ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. రసువాగఢి, గైరోంగ్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో యాత్రికులు, పర్యాటకులు చిక్కుకున్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో సాధారణ వాహనాలు అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్మీ బలగాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలే ఇప్పుడు ప్రధాన ఆధారం.

నేపాల్‌ ఆర్మీ వేలాది మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 15 హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు, తరలింపు చర్యలు కొనసాగిస్తోంది. త్రిశూల్‌ ప్రాంతంలోని టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కూడా రక్షించే ఆపరేషన్‌ చేపట్టారు. వందలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల ప్రైవేట్‌ హెలికాప్టర్లను కూడా సహాయక చర్యలకు ఉపయోగిస్తున్నారు. కానీ ప్రధాన సమస్య ఏంటంటే.. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ వంతెన ఉందో తెలియని స్థాయిలో విధ్వంసం జరగడం. బురద, శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకుని ఉన్నారో కూడా స్పష్టంగా తెలియడం లేదు.

ఈ విపత్తు ప్రభావం భారతీయులపైనా భారీగా పడింది. నేపాల్‌లో ఉన్న భారతీయుల్లో సుమారు 300 మంది వరకు ఆచూకీ తెలియడం లేదనే సమాచారం వచ్చింది. అయితే వివిధ దశల్లో లభిస్తున్న గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మారుతూ ఉంది. కొందరిని రక్షిస్తున్నారు.. మరికొందరితో కమ్యూనికేషన్‌ పునరుద్ధరిస్తున్నారు.. మరికొందరి కోసం గాలిస్తున్నారు. అందుకే మిస్సింగ్‌ సంఖ్యలను తుది గణాంకాలుగా భావించలేం. కానీ వందలాది భారతీయ కుటుంబాలు.. గల్లంతైన వారి కుటుంబ సభ్యుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి వెళ్లిన వారి విషయంలో కూడా ఆందోళన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 41 మంది నేపాల్‌లో చిక్కుకున్నట్లు సమాచారం అందగా.. వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. వీరిలో ముగ్గురు ఈశా ఫౌండేషన్‌కు చెందిన కైలాస్‌ మానససరోవర్‌ యాత్రికులు ఉన్నట్లు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తూ, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.

ఇదే సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌ యాకమూరు రమేష్‌బాబు గల్లంతైన ఘటన కూడా కుటుంబాన్ని కలచివేస్తోంది. ఖతార్‌ నుంచి ముంబై మీదుగా చైనా వెళ్లేందుకు ఆయన ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకున్నారు. ఈ నెల 26న చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్‌ అందుబాటులోకి రాకపోవడంతో ట్రావెల్‌ ఏజెన్సీ ఆయనను మిస్సింగ్‌ జాబితాలో చేర్చింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు కూడా ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

అదేవిధంగా, చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన బాలసుబ్రమణ్యం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మంగళవారం చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. ట్రావెల్‌ ఏజెన్సీ నుంచి సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సీఎం కార్యాలయాన్ని సంప్రదించి.. బాలసుబ్రమణ్యంను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ నుంచి కూడా 23 మంది నేపాల్‌లో చిక్కుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిలో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించగా.. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌, ఢిల్లీలో హెల్ప్‌లైన్‌, కోఆర్డినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు. అంటే దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రజల కోసం నేపాల్‌, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ పనిచేస్తున్నాయి.

ఇక ఈ విపత్తు కారణంగా కైలాస్‌ మానససరోవర్‌ యాత్రపైనా ప్రభావం పడింది. ప్రకృతి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చైనా సంబంధిత సంస్థ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే పర్మిట్లు ఉన్నప్పటికీ.. భారత్‌ నుంచి వచ్చే తదుపరి యాత్రికుల బృందాలకు సరిహద్దు ప్రవేశాన్ని నిలిపివేశారు. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న యాత్రికులను సురక్షితంగా వెనక్కి పంపే చర్యలు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు యాత్రను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇంతటి విపత్తు మధ్య మరో ప్రకృతి ప్రకంపన నేపాల్‌, టిబెట్‌ సరిహద్దు ప్రజలను భయపెట్టింది. గురువారం రాత్రి టిబెట్‌ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఖాట్మండుకు వందల కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పర్వత ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి కంపించడంతో ఇప్పటికే వరదల భయంతో ఉన్న ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన అదనపు ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

ఇక నేపాల్‌లో పరిస్థితి ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారిందంటే.. వరద నీరు ఒక్కసారి దిగువ ప్రాంతాలకు చేరుకోవడం..కొండచరియలు, మట్టి ప్రవాహాలు, ధ్వంసమైన రహదారులు.. వీటన్నింటి వల్ల రెస్క్యూ ఆపరేషన్‌ మరింత కష్టంగా మారింది. దీనికి తోడు కొండచరియల వెనుక భారీగా నీరు చేరి కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ సరస్సులు ఏర్పడినట్లు సమాచారం. అవి తెగిపోతే మరోసారి భారీ నీటి ప్రవాహం దిగువకు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒక విపత్తు నుంచి పూర్తిగా బయటపడకముందే, మరో మెరుపు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి ఏర్పడింది.

ఇక భారతదేశానికి కూడా ఈ పరిణామాలు కొంత ఆందోళనకరమే. ఎందుకంటే నేపాల్‌ పర్వత ప్రాంతాల నుంచి పుట్టే నదులు భారత్‌లోకి ప్రవహిస్తాయి. భారీగా నీరు దిగువకు వస్తే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో వరద ముప్పు పెరగవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజీలు, నదీ ప్రవాహాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకవైపు నేపాల్‌లో సహాయక చర్యలు.. మరోవైపు భారత్‌లో ముందస్తు జాగ్రత్తలు.. రెండూ ఒకేసారి కొనసాగుతున్నాయి.

మొత్తానికి.. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో జరిగిన ఈ మహా విపత్తు.. ప్రకృతి ఎంత అకస్మాత్తుగా తన రూపాన్ని మార్చుకోగలదో మరోసారి గుర్తుచేసింది. కొన్ని నిమిషాల్లోనే ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆర్మీ బలగాలు, హెలికాప్టర్లు, రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి ప్రాణాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేపాల్‌ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.