అమెరికాలో చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై భారతీయులకు మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వీసా నిబంధనలు.. ముఖ్యంగా H-1B వీసాపై భారీ ఫీజు పెంపు.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏకంగా లక్ష డాలర్లకు పైగా ఉండే ఈ ఫీజును శాశ్వతం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి? భారతీయులపై ఎంత ప్రభావం పడనుంది? అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు ఎదురయ్యే కొత్త ఇబ్బందులేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయ నిపుణులకు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ సిబ్బందికి అందించే హెచ్-1బి వీసా రుసుమును ఏకంగా ఒక లక్ష డాలర్లకు పైగా పెంచి.. ఈ భారీ రుసుమును శాశ్వతంగా అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఇది కేవలం వీసా ఫీజు పెంపు మాత్రమే కాదు. అమెరికాలో విదేశీ నిపుణులను నియమించుకునే మొత్తం విధానాన్నే మార్చేయాలని ట్రంప్ యంత్రాంగం చూస్తోంది.
ముఖ్యంగా హెచ్-1బి వీసాలపై ఆధారపడే “టెక్, ఐటీ కంపెనీలకు, విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారనుంది”. దీనివల్ల విదేశీ ఉద్యోగులను తీసుకోవడానికి కంపెనీలు వెనుకాడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న దాదాపు 4 లక్షల H-1B పిటిషన్లలో 71 శాతం మంది భారతీయులే ఉండటంతో, దీని ప్రభావం మన దేశంపైనే అత్యధికంగా ఉండనుంది. ప్రస్తుతం అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన తాజా ముసాయిదా నిబంధనలు అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఈ రుసుము పెంపుపై ఇప్పటికే అమెరికా న్యాయస్థానాల్లో తీవ్ర విచారణ జరుగుతోంది. గతంలో ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల తాత్కాలిక రుసుమును, కాంగ్రెస్ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్నుగా అభివర్ణిస్తూ బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినప్పటికీ, ఈ న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న తరుణంలోనే డీహెచ్‌ఎస్ ఈ కొత్త శాశ్వత నిబంధనను తెరపైకి తెచ్చింది. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన ఈ నిబంధన ప్రక్రియ పూర్తయితే.. హెచ్-1బి వీసా రుసుము ఒక్కసారిగా 1,03,265 డాలర్లకు చేరి స్థిరపడనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణంగా అమెరికాలో టెక్నాలజీ, విద్య, పరిశోధన రంగాలు విదేశీ నిపుణులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రతీ ఏటా 65 వేల సాధారణ వీసాలతో పాటు, ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి కోసం మరో 20వేల వీసాలను అమెరికన్ కంపెనీల యజమానులకు కేటాయిస్తారు. గతంలో ఈ వీసాల కోసం సాధారణ రుసుములు రెండు వేల నుండి ఐదు వేల డాలర్ల మధ్య మాత్రమే ఉండేవి. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఖర్చు భారీగా పెరగనుంది. కోర్టులో దాఖలైన ఆధారాల ప్రకారం.. ఫిబ్రవరి నాటికే దాదాపు 70 మంది అమెరికన్ యజమానులు సుమారు 85 వీసా దరఖాస్తుల కోసం ఈ భారీ రుసుమును చెల్లించినట్లు తెలుస్తోంది.
మరోవైపు అమెరికాలో చదువుకునే F-1 విద్యార్థులపై కూడా కొత్త భారాలు పడుతున్నాయి. యూనివర్సిటీ నుంచి ఉద్యోగంలోకి మారే సమయంలో ఉపయోగపడే OPT ప్రోగ్రామ్‌పై భారీ ఫీజులు విధించాలని చూస్తున్నారు. అలాగే, అమెరికాలో ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇంతకాలం ఇస్తున్న 60-రోజుల గ్రేస్ పీరియడ్‌ను కూడా తొలగించే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఉద్యోగం పోతే వెంటనే దేశం విడిచి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మార్పుల కారణంగా అమెరికా యూనివర్సిటీలు అప్రమత్తమయ్యాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే, వచ్చే నెల 15వ తేదీకి ముందే విద్యార్థులంతా అమెరికాకు తిరిగి చేరుకోవాలని స్పష్టమైన సూచనలు ఇస్తున్నాయి.
ఈ ప్రతిపాదనలు చట్టరూపం దాల్చడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఈలోపు కోర్టుల్లో కేసులు నడిచే అవకాశం ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారట. న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలినా అమలు చేసేందుకు ‘ప్లాన్-B’ కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఎలాంటి రిస్కు తీసుకోకుండా విద్యార్థులు త్వరగా అమెరికా చేరుకోవాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. అయితే.. అధికారిక నిబంధనలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాతే.. వాటి అసలు ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది.
మొత్తంగా చూస్తే.. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పులు అమెరికాలో చదువు, ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా H-1B వీసాపై ఆధారపడే భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే.. అయితే.. తుది నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. అధికారిక నిర్ణయం వచ్చే వరకు విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం చాలా కీలకం.

Leave a Reply