పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. మిగతా రెండు దేశాలపై కూడా దాడి జరిగినట్లుగానే పరిగణించనున్నారు. అసలు ఈ డిఫెన్స్ డీల్ వెనుక వ్యూహం ఏంటి..? సౌదీకి పాకిస్థాన్, టర్కీ అవసరం ఎందుకు వచ్చింది..? భారత్ ఈ పరిణామాన్ని ఎలా చూస్తోంది..? ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో రక్షణ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి..? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ ఒప్పందంలో అసలు ఏముంది? చుద్దాం. సాధారణంగా ఒక దేశంపై దాడి జరిగితే.. ఆ దేశమే తన రక్షణ కోసం చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ డిఫెన్స్ కూటమి ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. అది మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. అంటే.. ఒక దేశంపై దాడి జరిగితే మిగతా రెండు దేశాలు కూడా ఆ దేశానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. దీంతో మూడు దేశాల మధ్య కలెక్టివ్ డిటరెన్స్ మరింత బలపడుతుందని భావిస్తున్నారు.
ఇక, ఈ ఒప్పందానికి ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ అని పేరు పెట్టారు. మక్కా అల్ ముకర్రమా సమ్మిట్ సందర్భంగా.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం.. ఏదైనా దాడి జరిగితే కలిసికట్టుగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ డీల్ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ డీల్ కేవలం సైనిక సహకారానికే పరిమితం కాదు. రక్షణ రంగంలో అన్ని అంశాల్లో సహకారాన్ని పెంచుకోవాలని మూడు దేశాలు నిర్ణయించాయి. ఉమ్మడి భద్రత, రక్షణ సామర్థ్యం, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఇస్లామిక్ సోదరభావం, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ డీల్ కుదిరినట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే.. ఈ ఒప్పందం ఇప్పుడే ఎందుకు? అనే ప్రశ్న కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఘర్షణ ప్రభావం ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంపై పడుతోంది. మరోవైపు రెడ్ సీ, బాబ్ అల్ మండెబ్ జలసంధి, హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. గతంలో సౌదీకి చెందిన చమురు, మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు జరిగాయి. ఇరాన్‌తో పాటు.. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, ఇరాక్‌లోని కొన్ని మిలీషియా గ్రూపుల నుంచి కూడా ముప్పు ఉందనే ఆందోళనలు సౌదీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఒక్క దేశంపై ఆధారపడకుండా పలు దేశాలతో రక్షణ సహకారాన్ని పెంచుకోవాలని రియాద్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.
ఇందులో భాగంగానే.. సౌదీ అరేబియా నేతృత్వంలో మల్టీనేషనల్ మారిటైమ్ డిఫెన్స్ కోయలిషన్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. రెడ్ సీ, బాబ్ అల్ మండెబ్, గల్ఫ్ ఆఫ్ అడెన్ వంటి కీలక సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలు, ఇంధన సరఫరా మార్గాలకు భద్రత కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కూటమికి 14 దేశాలు మద్దతు ప్రకటించగా.. రియాద్‌లో జరిగిన సమావేశానికి 43 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సముద్ర మార్గాల భద్రత, ఇంటెలిజెన్స్ షేరింగ్, సంయుక్త రక్షణ సహకారాన్ని పెంచడం ద్వారా ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసా కల్పించడమే ఈ కూటమి ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇక ఈ డీల్‌పై భారత్ ఎలా స్పందించింది? అనే విషయం కూడా కీలకమే. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అయితే.. ఒప్పందానికి సంబంధించిన వివరాలపై భారత్ ప్రస్తుతానికి ఎలాంటి విస్తృత వ్యాఖ్యలు చేయలేదు.
మరోవైపు.. ఈ ఒప్పందంపై ఇరాన్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయీ.. సౌదీ అరేబియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టర్కీ, పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందం సౌదీకి భద్రతను తీసుకురాదని ఆయన విమర్శించారు. అమెరికాపై గతంలో ఆధారపడినప్పటికీ సౌదీకి భద్రత లభించలేదని.. ఇప్పుడు కూడా ఇతర దేశాల నుంచి భద్రత కోసం ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఈ ఒప్పందం సౌదీ అరేబియాకు మాత్రమే కాదు.. పాకిస్థాన్, టర్కీకి కూడా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగినదే. పాకిస్థాన్‌కు సౌదీతో ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టర్కీతోనూ పాకిస్థాన్‌కు రక్షణ రంగంలో సహకారం ఉంది. ఇప్పుడు ఈ రెండు సంబంధాలు ఒకే రక్షణ ఒప్పందంలోకి రావడంతో.. మూడు దేశాల మధ్య సైనిక సహకారం మరింత వ్యవస్థీకృతం అయ్యే అవకాశం ఉంది.
అయితే.. ఈ ఒప్పందం అంటే మూడు దేశాలు వెంటనే కలిసి యుద్ధంలోకి దిగాల్సిందేనా? అనేది మరో ప్రశ్న. ప్రస్తుతానికి ఒప్పందంలో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపైనా దాడిగా పరిగణిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. అలాంటి పరిస్థితుల్లో ఏ దేశం ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలి? పరస్పర సైనిక సహకారం ఏ స్థాయిలో ఉంటుంది? వంటి పూర్తి వివరాలు భవిష్యత్‌లో అమలు చేసే విధానాలపై ఆధారపడి ఉంటాయి.
మొత్తంగా చూస్తే.. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కీలక పరిణామంగా మారింది. మూడు దేశాల ఈ కొత్త రక్షణ భాగస్వామ్యం.. పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను ఎంతవరకు మార్చబోతుంది? భారత్-పాకిస్థాన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇక ముందు టర్కీ, సౌదీ, పాకిస్థాన్ కలిసి ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

Leave a Reply