ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఇంతకీ, ఆ మార్గదర్శకాలేంటి? ఈ కారుణ్య మరణం ఏయే దేశాల్లో చట్టబద్ధం? భారత సుప్రీంకోర్టు దీనిపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులేంటి? అసలు పాసివ్ యూథనేషియా అంటే ఏమిటి? ఇది ఎవరికి వర్తిస్తుంది?
ముందుగా, ఏపీ అమల్లోకి తెచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..
రోగి అనారోగ్యం చికిత్సకు లొంగని దశలో మాత్రమే కారుణ్య మరణ ప్రక్రియ వర్తిస్తుంది. అదేవిధంగా, రోగి స్పృహలో ఉన్నప్పుడు.. భవిష్యత్తులో తనకు నయం కాని పరిస్థితి ఎదురైతే చికిత్స తీసుకోవాలా.. వద్దా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకు గార్డియన్‌ను నియమించి నోటరీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరణ పొందాలి. చికిత్స చేసే వైద్యుడు సహా ముగ్గురు డాక్టర్ల బృందం రోగి పరిస్థితిని సమీక్షించాలి. అలాగే,ప్రైమరీ బోర్డు నిర్ణయాన్ని డీఎంహెచ్‌వోతో కూడిన మరో నిపుణుల బృందం ధ్రువీకరించాలి. ఈ రెండు బృందాల నిర్ణయాలు, గార్డియన్ సమ్మతిని.. ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు తెలపాలి. ఆ తర్వాతే రోగికి లైఫ్ సపోర్ట్‌ను తొలగించాలి. రోగి ముందస్తు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటే.. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు వివరించి మెడికల్ బోర్డు ద్వారా ప్రక్రియను అనుసరించొచ్చు.
అయితే, అసలు పాసివ్ యూథనేషియా అంటే ఏమిటి?
చాలా మంది యూథనేషియా అంటే ప్రాణాలు తీసే ప్రక్రియగా భావిస్తారు. కానీ పాసివ్ యూథనేషియా అంటే రోగికి ప్రాణం పోసే కృత్రిమ వైద్య సహాయాలను నిలిపివేయడం. అంటే… వ్యాధి నయం కాని పరిస్థితిలో ఉన్న రోగికి వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ వంటి చికిత్సలను నిలిపివేసి, సహజ మరణానికి అవకాశం ఇవ్వడం.అలా అని.. ఇది రోగికి ప్రాణాంతక మందులు ఇచ్చి చంపడం కాదు. అలా చేయడాన్ని యాక్టివ్ యూథనేషియా (Active Euthanasia) అంటారు. భారత్‌లో యాక్టివ్ యూథనేషియా అనుమతించబడదు.
ఇక, ఈ ప్రక్రియ ఎలాంటి రోగులకు వర్తిస్తుంది?
పాసివ్ యూథనేషియా సాధారణంగా నయం కాని తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు, కోలుకునే అవకాశం లేని పరిస్థితిలో ఉన్న వారు, దీర్ఘకాలంగా కోమాలో ఉన్న వారు, వైద్య చికిత్స కొనసాగించినా జీవన నాణ్యత మెరుగుపడపోవడం వంటి కేసుల్లో దీన్ని పరిశీలిస్తారు. అయితే, కేవలం రోగి లేదా కుటుంబ సభ్యుల కోరికతోనే ఈ నిర్ణయం తీసుకోరు. వైద్యపరమైన పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు.
మరి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రక్రియ ఎలా ఉంటుంది? అనేది చూస్తే,
ఏపీ ప్రభుత్వం రూపొందించిన విధానాల ప్రకారం, ఇలాంటి కేసుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక వైద్య ప్రక్రియను అనుసరించనున్నారు. ఈ బాధ్యతను వైద్య విద్యా సంచాలకులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ముందుగా రోగి పరిస్థితిని వైద్యులు అంచనా వేస్తారు. వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా? చికిత్స కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉందా? రోగి బాధను తగ్గించగలమా? వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత నిపుణులైన వైద్యుల బృందం అభిప్రాయం తీసుకుంటారు. ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఏంటంటే..రోగి స్వయంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటే, మొదటి ప్రాధాన్యత దానికే ఉంటుంది. ఒకవేళ రోగి స్పృహలో లేకపోతే… కుటుంబ సభ్యుల అభిప్రాయం, ముందుగా రోగి ఇచ్చిన ఆదేశాలు, వైద్య పరిస్థితులను పరిశీలిస్తారు.
మరి, ఇది “మెర్సీ కిల్లింగ్”తో సమానమా? అంటే…
సాధారణంగా పాసివ్ యూథనేషియాను “మెర్సీ కిల్లింగ్” అనే పిలుస్తుంటారు. కానీ వైద్య, న్యాయపరంగా రెండింటికీ తేడా ఉంది. మొదటిది. యాక్టివ్ యూథనేషియా.. అంటే ప్రాణాంతకమైన ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి నేరుగా ప్రాణం తీసేందుకు వైద్య సహాయం చేయడం.చాలా దేశాల్లో ఇది లీగల్ కాదు. రెండోది. పాసివ్ యూథనేషియా.. కృత్రిమంగా కొనసాగిస్తున్న జీవనాధార చికిత్సలను నిలిపివేసి మరణించడానికి అవకాశం కల్పించడం. భారత న్యాయ వ్యవస్థలో అనుమతించబడింది రెండో విధానం పాసివ్ యూథనేషియా మాత్రమే.
దీనికి సంబంధించి.. 2018లో భారత అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తికి గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా లివింగ్ విల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే.. భవిష్యత్తులో తనకు నయం కాని వ్యాధి వస్తే లేదా తాను కోమాలోకి వెళ్తే, కృత్రిమంగా తనను బతికించవద్దని ముందుగానే లిఖితపూర్వక విజ్ఞప్తి చేయవచ్చు. అందులో భాగంగా సుప్రీంకోర్టు గతంలో పాసివ్ యూథనేషియాకు కొన్ని కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి గౌరవంగా జీవించే హక్కులో భాగంగానే, కొన్ని పరిస్థితుల్లో చికిత్సను నిలిపివేయడాన్ని అనుమతించింది. అయితే ప్రతి కేసును విడివిడిగా పరిశీలించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇకపోతే, కారుణ్య మరణంపై ఒక్కో దేశానిది ఒక్కో విధానం. నెదర్లాండ్స్, బెల్జియంలలో కఠిన నిబంధనల మధ్య యాక్టివ్ యూథనేషియాకు అనుమతి ఉంది. అయితే, రోగి పూర్తి స్పృహతో ఉండాలి, కోలుకోలేనంత నొప్పిని అనుభవిస్తూ ఉండాలి. ఇక స్విట్జర్లాండ్ లో అసిస్టెడ్ స్యూసైడ్ ఫేమస్. రోగి స్వయంగా తనే ప్రాణాంతక మందును తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీని కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు స్విట్జర్లాండ్ వెళ్తుంటారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీనికి పరిమితంగా అనుమతి ఉంది.
మొత్తంగా, పాసివ్ యూథనేషియా అనేది ప్రాణాలను తీసే నిర్ణయం కాదు… నయం కాని పరిస్థితిలో ఉన్న రోగికి అనవసరమైన బాధను తగ్గించే వైద్యపరమైన విధానం. అయితే ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో కఠినమైన వైద్య, చట్టపరమైన నియమాలతో మాత్రమే అమలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా రూపొందిన మార్గదర్శకాలతో ఈ ప్రక్రియ మరింత స్పష్టమైన విధానంలోకి రానుంది.

Leave a Reply