ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌.. అమెరికాకు ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక!

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ భారీ కుట్ర?
అమెరికాకు ఇజ్రాయెల్‌ రహస్య హెచ్చరిక!
తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ట్రంప్‌!
ట్రంప్‌ కదిలికలను గమనిస్తోన్న విదేశీ ముఠాలు..
ఇరాన్‌ టార్గెట్‌గా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!
మరింత ముదురుతున్న ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు!
పరస్పర దాడులతో దద్దరిల్లుతోన్న గల్ఫ్‌ దేశాలు!
నిజంగానే ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందా?
ఇంటెలిజెన్స్‌ ఏం చెబుతోంది?


రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. ఇదే సమయంలో ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బుషెహర్ అణు కేంద్రం పరిసరాల్లోనూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రపన్నిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇక, ఇటీవల కాలంలో ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు కారణం ట్రంప్‌ను భౌతికంగా అంతమొందించేందుకు ఇరాన్ భారీగా నిధులు కేటాయించిందన్న నిఘా వర్గాల సమాచారమే. ట్రంప్ హత్యకు ఇరాన్ పకడ్బందీ స్కెచ్ వేసిందన్న గూఢచారి వర్గాల హెచ్చరికలతో అమెరికా రక్షణ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

ముఖ్యంగా, గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మృతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ నిఘా సమాచారం నేపథ్యంలో ట్రంప్ అధికారిక విమానమైన ఎయిర్ ఫోర్స్ వన్ భద్రతను కనీవినీ ఎరుగని అత్యున్నత స్థాయికి పెంచారు. శత్రుదేశాల నుంచి వచ్చే ఎలాంటి క్షిపణి దాడులనైనా తిప్పికొట్టేలా ఈ అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అమర్చారు.

కేవలం విమానంలోనే కాకుండా, ట్రంప్ పర్యటించే ప్రతి ప్రాంతంలోనూ రక్షణ వలయాన్ని 300 శాతానికి పైగా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ కాన్వాయ్‌లో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆకాశంలో నిరంతరం నిఘా ఉంచే డ్రోన్లు, ప్రైవేట్ స్నైపర్ల మోహరింపును గతంతో పోలిస్తే రెట్టింపు చేశారు. ట్రంప్ బహిరంగ సభలలో ప్రసంగించే వేదికల చుట్టూ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్‌లను రక్షణగా ఏర్పాటు చేస్తున్నారు. శత్రువులకు ఏ ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదపి యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.

ఇరాన్ పన్నుతున్న ఈ కుట్రలపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు 100 కు పైగా పేజీలతో కూడిన రహస్య డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ఇరాన్ నిధులు పొందుతున్న కొన్ని విదేశీ ముఠాలు అమెరికా గడ్డపైనే ట్రంప్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ ముప్పు సంకేతాలపై ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఇరాన్ గనుక అలాంటి సాహసానికి ఒడిగడితే ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ఇలాంటి గ్లోబల్ థ్రెట్‌ను ఎదుర్కోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం దాదాపు 24 గంటలూ హై అలర్ట్‌లో ఉంటూ సరిహద్దులను, గగనతలాన్ని డేగకన్నుతో పర్యవేక్షిస్తోంది.

ఇక, ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ, దీని గురించి ఇజ్రాయెల్‌ అలర్ట్‌ (Israel Alert to Trump) చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. ఇరాన్‌లో ఖమేనీ అంతిమయాత్ర జరిగిన సమయంలో నెతన్యాహు సర్కారు.. ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు బయటకొచ్చాయి.

మరోవైపు, హర్మూజ్‌లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు చేపట్టింది. దీంతో టెహ్రాన్‌ కూడా విరుచుకుపడటంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే, ఈ దాడులను మరింత తీవ్రతరం చేయాలా? లేక ఇరాన్‌తో కాల్పుల విరమణను కొనసాగించాలా? అనే దానిపై ప్రస్తుతం ట్రంప్‌ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ నుంచి నిఘా అలర్ట్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ హెచ్చరికలు ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, తనపై హత్య కుట్రల గురించి ట్రంప్‌ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తుర్కియేలో నాటో సదస్సు సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు కోరుకుంటున్నారని ఇరాన్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ముఖ్యంగా నేను అందరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నాను’’ అని ట్రంప్‌ స్వయంగా వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల వేళ తుర్కియే నుంచి బయల్దేరిన ట్రంప్‌ మళ్లీ పాత విమానాన్నే వినియోగించడం కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇటీవల అమెరికా అధ్యక్షుడి కోసం ఖతార్‌ ఓ అధునాతన విమానాన్ని కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి ట్రంప్‌ దాన్నే వినియోగించారు. నాటో సదస్సుకు కూడా అందులోనే వెళ్లారు. కానీ, అక్కడి నుంచి తిరిగెళ్లే సమయంలో మాత్రం పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా, ట్రంప్‌ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో, ఇరాన్‌ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్య వెనుక.. అమెరికా హస్తం ఉందని టెహ్రాన్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ మధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఇది ఇరానే చేయించిందని నాడు ఆరోపణలొచ్చాయి. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణించడంతో ట్రంప్‌పై ఇరాన్‌ ప్రజలు మరింత రగిలిపోతున్నారు. ఇటీవల ఖమేనీ అంతిమయాత్ర సమయంలోనూ ఖమేనీ మద్దతుదారులు ‘ట్రంప్‌ను చంపేస్తాం’ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

అదేవిధంగా, ఇరుదేశాల పరస్పర దాడులతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. జూన్‌ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా, శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే, ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్‌ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్‌కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్‌ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్‌లో ఇరాన్‌ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో తాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.