సాధారణంగా చెట్లు అంటే ప్రాణవాయువుకు నిలయం… నీడనిచ్చే ప్రకృతి వరం. కానీ ఈ అందమైన ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం నిలువెల్లా విషాన్ని దాచుకుని ఉంటుంది. ఆ చెట్టు నుంచి కారే పాలలాంటి విషపూరిత ద్రవం, యాపిల్‌లా కనిపించే ప్రమాదకరమైన పండ్లు, తాకినా హాని చేసే ఆకులు… ఇవన్నీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా నిలబెట్టాయి. పొరపాటున వానలో ఆ చెట్టు కింద నిల్చున్నా, ఆకులను తాకినా, పండ్లు తిన్నా ప్రాణాపాయం తప్పదంటున్నారు నిపుణులు. అందుకే ఈ చెట్టుకు “ట్రీ ఆఫ్ డెత్” అనే భయానక పేరు వచ్చింది. ఇంతకీ, అసలు ఆ చెట్టు ఏది? ఎక్కడ పెరుగుతుంది? ఎందుకంత ప్రమాదకరం? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం.
వాన పడితే చాలు.. సహజంగా చాలా మంది సమీపంలో ఉన్న చెట్టు కిందకు పరుగులు తీస్తుంటారు. కానీ ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. వర్షం పడుతున్న సమయంలో ఆ చెట్టు కింద నిలబడితే తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి కూడా దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్టు పేరు మంచినీల్ (Manchineel Tree). దీని శాస్త్రీయ నామం హిప్పోమేనీ మాన్సినెల్లా (Hippomane mancinella). ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ మంచినీల్ చెట్టు ప్రధానంగా కరేబియన్ దీవులు, ఫ్లోరిడా, బహామాస్, మెక్సికో గల్ఫ్ తీర ప్రాంతాలు, మధ్య అమెరికా, ఉత్తర-దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ చెట్టు ప్రమాదం కేవలం వర్షం పడేటప్పుడు మాత్రమే కాదు. చిన్న ఆపిల్స్‌లా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే దీని పండ్లు తింటే చావు అంచుల వరకూ వెళ్లాల్సిరావొచ్చు. అందుకే వీటిని “లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్” (Little Apple of Death) అని పిలుస్తారు. పొరపాటున ఈ పండ్లను తింటే నోరు, నాలుక, గొంతులో భరించలేని మంట మొదలవుతుంది. మింగడం కూడా కష్టంగా మారుతుంది. అనంతరం వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ చెట్టును ముట్టుకున్నా, దీని దగ్గరకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదం.
ఇక, ఈ చెట్టు నుంచి వెలువడే తెల్లటి పాలలాంటి ద్రవాన్ని సాప్ (Sap) అంటారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా, వర్షం పడినప్పుడు ఈ సాప్ వాన నీటిలో కలసి చెట్టు ఆకుల నుంచి కిందకు జారుతుంది. అలాంటి నీటి చుక్కలు శరీరంపై పడితే చర్మంపై తీవ్రమైన మంట, ఎర్రబడటం, బొబ్బలు, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వానలో ఈ చెట్టు కింద నిలబడొద్దని అధికారులు హెచ్చరిస్తుంటారు. అలాగే, ఈ చెట్టు ఆకులు, కొమ్మలు విరిగినప్పుడు వచ్చే సాప్ నేరుగా చర్మానికి తగిలినా ప్రమాదమే. అది కళ్లలో పడితే తీవ్రమైన మంటతో పాటు చూపు కోల్పోయే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, ఈ చెట్టు కలపను కాల్చినా ప్రమాదమే. కాలుతున్నప్పుడు వెలువడే పొగ కళ్లకు, శ్వాసకోశానికి హానికరం. ఆ పొగ వల్ల కళ్లలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు, కొన్ని సందర్భాల్లో ఈ పొగ వల్ల తాత్కాలిక అంధత్వం కూడా సంభవించవచ్చు..
అయితే, ఇంత ప్రమాదకరమైన చెట్టును పూర్తిగా ఎందుకు తొలగించరనే సందేహం మీకు రావచ్చు. దీనికి కారణం పర్యావరణ ప్రయోజనం. సముద్ర తీరాల్లో ఇసుక కోతను అడ్డుకోవడంలో, తీర ప్రాంతాలను రక్షించడంలో ఈ చెట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, కొన్ని జంతువులు, ముఖ్యంగా ఇగువానాలు, దీని పండ్లను తిన్నా ఎలాంటి హాని కలగదు. ఈ కారణాల వల్ల ఈ చెట్లను పూర్తిగా నరికివేయకుండా, ప్రజలు ఈ చెట్ల దగ్గరకు వెళ్లకుండా చెట్లపై ఎరుపు రంగు గుర్తులు వేయడం లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ ప్రకృతిలోని ప్రతి చెట్టు మనిషికి మేలు చేస్తుందనే అభిప్రాయం ఉన్నా, మంచినీల్ చెట్టును మాత్రం దూరం నుంచి చూడాల్సిన అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాతుల్లో చేరాయి. అక్కడ వీటిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక, అదృష్టం కొద్దీ ఈ చెట్ల దగ్గర ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదు. అలా జరగకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. అదేవిధంగా, పూర్వం గిరిజనులు… ఈ చెట్ల పాలను బాణాల చివర అటించి… వన్యమృగాలను వేటాడేవారు. ఆ బాణం టచ్ అవ్వగానే వన్యప్రాణులకు ఆ పాలు తగిలి విలవిలలాడేవి. అలా… ఆటవికులు ఆహారం సంపాదించుకునేవారు. మొత్తంగా, జంతువులు, పక్షులకు కూడా ఈ చెట్లు ప్రమాదకరమే.

Leave a Reply