World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

మనుషుల జీవితాల్లో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే కనిపించిన రోబోలు.. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వంటగది నుంచి పరిశ్రమల వరకు.. అంతరిక్షం నుంచి యుద్ధరంగం వరకు తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోబోలు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి.అవును.. రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ఇద్దరూ హ్యూమనాయిడ్ రోబోలు కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. అయితే, రోబోలు నిజంగా ప్రేమలో పడతాయా? మనుషుల్లాగే భావోద్వేగాలను వ్యక్తం చేయగలవా..? అనేవి ఈ కింది స్టోరీలో తెలుసుకుందాం.

రష్యాలో జరిగిన ఈ అరుదైన వివాహ వేడుకలో రోబో వరుడు రాబర్ట్, రోబో వధువు మటిల్డా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సూట్ ధరించిన రాబర్ట్.. తెల్లటి పెళ్లి గౌనులో మటిల్డా ప్రత్యేక దుస్తుల్లో మెరిశారు. అచ్చం మనుషుల పెళ్లిలానే అతిథులతో నిండిన హాలులోకి వీరు ప్రవేశించగా చప్పట్లతో సందడి నెలకొంది. నిర్వాహకుల ప్రకారం.. రష్యా చరిత్రలో ఇదే తొలి రోబోటిక్ వెడ్డింగ్ సెర్మనీగా నిలిచింది.

ఈ ప్రత్యేక వివాహ వేడుక మాస్కోలోని ప్రముఖ పుష్కిన్ లైబ్రరీలో జరిగింది. పూర్తిగా సాంప్రదాయ వివాహ వేడుకల తరహాలోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబర్ట్, మటిల్డా ఒకరి ముందు ఒకరు ముందుగా ప్రోగ్రామ్ చేసిన వివాహ ప్రమాణాలు చేశారు. అనంతరం పెళ్లి కంకణాల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మరో రోబో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్మాటిక్ అనే రోబోటిక్ కుక్క వివాహ కంకణాలను తీసుకుని వేదికపైకి వచ్చింది. ఆ తర్వాత రోబో జంట ఒకరికొకరు కంకణాలు తొడుక్కున్నాయి. దీంతో, హోస్ట్ వారిని ‘రోబో భార్యాభర్తలు’గా ప్రకటించారు. అయితే, ఈ రోబోల పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబోలు కూడా మనుషుల మాదిరిగా పెళ్లి చేసుకునే స్థాయికి టెక్నాలజీ చేరుకుందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోబోటిక్ పెళ్లికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రష్యాలో ప్రతి ఏడాది జూలై 8న కుటుంబం, ప్రేమకు సంబంధించిన ప్రత్యేక పండుగను జరుపుకుంటారు. అదే సందర్భంగా అత్యంత ప్రాచీన రష్యన్ సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో ఈ రోబో వివాహాన్ని నిర్వహించారు. సంప్రదాయాలు, ఆధునిక కృత్రిమ మేధస్సు టెక్నాలజీ కలిసిన అరుదైన కార్యక్రమంగా ఇది నిలిచింది.

ఈ పెళ్లి వీడియో వైరల్ అయిన తర్వాత రోబోల సామర్థ్యాలపై పెద్ద చర్చ మొదలైంది. రోబోలు నిజంగా ప్రేమలో పడతాయా? మనుషుల్లాగే భావోద్వేగాలను వ్యక్తం చేయగలవా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. అయితే రోబోలను రూపొందించిన డెవలపర్లు, నిర్వాహకులు మాత్రం ఇది పూర్తిగా ముందుగా ప్రోగ్రామ్ చేసిన ఒక టెక్నాలజీ ప్రదర్శన మాత్రమేనని స్పష్టం చేశారు.

అయితే, ఇప్పటి రోబోలు కేవలం ఒకే పని చేసే యంత్రాలు కాదు.. మనుషులతో మాట్లాడగలిగే స్థాయికి చేరుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ముఖాలను గుర్తించడం, భావాలను అర్థం చేసుకోవడం, సంభాషణలు కొనసాగించడం వంటి సామర్థ్యాలను సాధిస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు మనిషి శరీర ఆకృతిని అనుకరించడమే కాకుండా.. మనుషుల మధ్య ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకుంటున్నాయి.

ఇక, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోలపై భారీగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇళ్లలో సహాయకులుగా, వృద్ధులకు తోడుగా, ఆసుపత్రుల్లో సేవలందించే సహాయకులుగా రోబోలను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మనిషి రోజువారీ జీవితంలో రోబోలు మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రాబర్ట్, మటిల్డాల పెళ్లి వెనుక ఉద్దేశం నిజమైన బంధాన్ని సృష్టించడం కాదు. ఇది రోబోటిక్స్ సామర్థ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వినూత్న ప్రదర్శన మాత్రమే. రోబోలు సామాజిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొనగలవు.. మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయో చూపించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొత్తంగా, ప్రస్తుతం ఆధునిక హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల మాటలను గుర్తించడం, స్వరాలను విశ్లేషించడం, వివిధ పనులను అలవోకగా చేసేస్తున్నాయి. దీంతో, భవిష్యత్తులో రోబోలు మన జీవితాల్లో ఎంత వరకు భాగమవుతాయి..? మనుషులతో కలిసి ఎలా పనిచేస్తాయి..? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక, రష్యాలో జరిగిన ఈ రోబోటిక్ పెళ్లి.. కేవలం ఒక వినూత్న కార్యక్రమం మాత్రమే కాదు.. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేయబోతున్నాయో చూపించే ఓ ఉదాహరణ.

AI పెళ్లి వేడుక!
ప్రపంచంలోనే తొలి రోబోల పెళ్లి..
వరుడు రాబర్ట్.. వధువు మటిల్డా
ఉంగరాలు తెచ్చిన డాగ్మాటిక్ అనే రోబో కుక్క
రష్యా చరిత్రలోనే ఫస్ట్ రోబోటిక్ వెడ్డింగ్
పెళ్లి గౌనులో వధువు.. సూటు ధరించిన వరుడు
రెండు రోబోలు పెళ్లి చేసుకున్న వీడియో వైరల్
ప్రత్యేక పెళ్లి దుస్తుల్లో మెరిసిన రోబోలు
AI టెక్నాలజీతో కృత్రిమ జంట!
సంచలనంగా రాబర్ట్-మటిల్డా పెళ్లి
రోబోలు నిజంగా ప్రేమలో పడతాయా?
#RobotWedding #AI #HumanoidRobot #Russia #ArtificialIntelligence #Robotics #Technology #FutureTech #AIInnovation

Leave a Reply

Your email address will not be published.