కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది. నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గర లేవు, సర్వలోకాలు నాపై ఆధారపడి ఉంటాయి, నువ్వు నా రెండు కళ్లూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది. అందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు. అలాంటి సందర్భంలోనూ ప్రశాంతంగా స్పందించిన భర్తను చూసి..తన సందేహాలు తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అని భావించింది పార్వతీదేవి. ఆలస్యం ఎందుకని పలు ప్రశ్నలు సంధించింది..
అందులో పార్వతీ అడిన మొదటి ప్రశ్న..స్వామీ మీ కంఠంపై నల్లటి మచ్చ ఎందుకుంది?
దానికి శివుడు.. దేవతలు, దానవులు కలిసి పాలసముద్రం మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి గొంతులోనే ఉంచాను. అందుకే అక్కడ నల్లమచ్చ ఉందని సమాధానమిచ్చాడు.
ఇక పార్వతి అడిగిన రెండో ప్రశ్న.. పినాకమనే విల్లునే ఎందుకు ధరిస్తారు?
దానికి సమాధానంగా శివుడు: కణ్వుడనే మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది. అద్భుతంగా పెరిగిన ఆ వెదురు నుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు. అందులో ఒకటి పినాకము అది నా దగ్గర ఉంది, రెండోది శారంగం అది విష్ణువు దగ్గరుంది, ఇక మూడోది బ్రహ్మదగ్గరుంది. అందుకే నన్ను పినాకపాణి అని పిలుస్తారని చెప్పారు.
పార్వతి అడిగిన మరో ప్రశ్న.. మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనంగా చేసుకున్నారెందుకు స్వామి? దానికి శివుడు: ఓసారి తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భంగం కలిగింది. వాటిని కోపంగా చూడడంతో అవి పడిన బాధను చూసిన శ్రీ మహావిష్ణువు..నన్ను శాంతింపచేసి ఓ ఎద్దుని కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఎద్దు వాహనమైనందన్నాడు.
పార్వతి మరో ప్రశ్న.. కైలాశంలో ఉండకుండా శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని?
శివుడు: భయంకరమైన భూతాలు ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మ నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడమని’ అడిగితే భూతాల నివాసమైన శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉన్నంతవరకూ లోకాలు సురక్షితంగా ఉంటాయి. జనం తిరగని స్థలం, అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా అని సమాధానం ఇచ్చాడు.
పార్వతి అడిగిన మరో ప్రశ్న.. భస్మ లేపనం, పాములు ధరించడం, శూలం, ఈ భీకరమైన రూపం ఎందుకు స్వామి?
దానికి శివుడు: లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి చలి, రెండవది ఉష్ణం. సౌమ్యం విష్ణువు, అగ్ని నేను అందుకే భస్మం సహా ఈ భీకర రూపం అన్నాడు.
పార్వతిదేవి అడిగిన మరో ప్రశ్న: తలపై నెలవంక ఎందుకని?
శివుడు: దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కగా..శరణు వేడాడు. పొరపాటు చేశానని అర్థమై చంద్రుడిని తలపై పెట్టుకున్నాను అని సమాధానం చెప్పాడు.
ఇలా పార్వతీ దేవి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు పరమేశ్వరుడు. దీని అర్థం ఈ ప్రశ్నలకు సమాధానం.. అమ్మవారికి తెలియదు అని కాదు.. సకల జీవులకు తన భర్త గొప్పతనం తెలియజేయాలన్నదే పార్వతి ప్రశ్నల వెనుకున్న ఆంతర్యం.

Leave a Reply