Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?..  పుణెలో సంచలనం

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటనగా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా మారింది. ఈ కేసులో మృతుడు కేతన్ అగర్వాల్ కాగా, ఆయన కాబోయే భార్య సియా గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. ట్రెక్కింగ్ పేరుతో ఇద్దరూ అక్కడికి వెళ్లిన సమయంలో, సియా సన్నిహితుడు చేతన్ చౌదరి కూడా అక్కడే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం కేతన్ అగర్వాల్‌ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి తోసివేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఘటన అనంతరం ఇది ప్రమాదమని నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో బయటపడింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ లొకేషన్ వివరాలు, కాల్ రికార్డులు తదితర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగా సియా గోయల్‌తో పాటు చేతన్ చౌదరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తులో సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కేతన్‌తో వివాహానికి అంగీకరించిన సియా, ఈ వివాహం పట్ల ఆసక్తి చూపలేదని కూడా దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే నిందితులపై వచ్చిన ఆరోపణలు ఇంకా కోర్టులో రుజువు కావాల్సి ఉంది. పోలీసులు కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు

 

Leave a Reply

Your email address will not be published.