Ketan Agarwal Murder Case:  కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..? సియానా..? చేతనా..? ఆధారాల్లేవంటున్న పోలీసులు

కేతన్ హత్య కేసులో గందరగోళం..
కేతన్‌ను లోయలోకి నెట్టింది సియానా..? చేతనా..?
ఆధారాల్లేవంటున్న పోలీసులు..
లై డిటెక్టర్ పరీక్షకు కోర్టును ఆశ్రయించిన పోలీసులు..
దర్యాప్తులో కీలకంగా మారిన గెయిట్‌ అనాలసిస్‌..
కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..?
నిజం బయటకొస్తుందా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు… రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రేమ, పెళ్లి, కుట్ర, డబ్బు… ఇలా అనేక కోణాలు బయటపడుతున్న ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి అసలు ఎవరు లోయలోకి నెట్టారు..? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదని స్వయంగా పోలీసులు కోర్టుకు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిందితురాలు సియా గోయల్‌కు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు… ఇప్పటికే బయటపడిన డిజిటల్ ఆధారాలు, సీన్ రీక్రియేషన్, గెయిట్ అనాలిసిస్, ఆర్థిక లావాదేవీలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

జూన్ 18… పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన ఘటన మొదట ప్రమాదంగా కనిపించింది. పర్యటనకు వెళ్లిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్… 400 అడుగుల లోతైన లోయలో పడి మరణించాడు. కానీ పోస్టుమార్టం, సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, నిందితుల కదలికలపై లోతైన విచారణ చేపట్టిన పోలీసులు… ఇది ప్రమాదం కాదని, ముందే పక్కా ప్రణాళికతో అమలు చేసిన హత్యగా అనుమానిస్తున్నారు.

దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ… కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం, చేతన్‌తో కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకోవడం, ఆ బంధానికి కేతన్ అడ్డుగా మారాడనే కారణంతోనే ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకని మిస్టరీగానే ఉంది. కేతన్‌ను చివరి క్షణంలో లోయలోకి తోసింది ఎవరు..? తొలుత చేతన్ తోశాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సియానే తోసిందని మరో వాదన వినిపించింది. మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వీటిలో ఏదీ ఇప్పటివరకు ఖచ్చితంగా నిరూపించే ప్రత్యక్ష ఆధారం లభించలేదని పోలీసులు కోర్టుకు స్పష్టం చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సియా, చేతన్‌లు ఈ అంశంపై పూర్తి సహకారం అందించడం లేదని, విచారణలో మౌనం పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే నిజానిజాలు వెలికితీయడానికి పాలిగ్రాఫ్ లేదా లై-డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్ష ద్వారా లభించే సమాచారం దర్యాప్తును సరైన దిశలో తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఈ పరీక్షపై న్యాయపరమైన చర్చ కూడా కొనసాగుతోంది. సియా తరఫు న్యాయవాది… కోర్టు అనుమతి ఒక్కటే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరి అని వాదిస్తున్నారు. అంతేకాదు… పాలిగ్రాఫ్ పరీక్ష ఫలితాలు కోర్టులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తుకు కొత్త ఆధారాలు, కొత్త లీడ్స్ అందించే సాధనంగా మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇక ఈ కేసులో డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తు కూడా కీలకంగా మారింది. కేతన్ మరణించిన తర్వాత అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఫోన్‌లోని సమాచారం ఏమైనా తొలగించారా…? కాల్ హిస్టరీ, మెసేజ్‌లు లేదా ఇతర డిజిటల్ ఆధారాలను మార్చేందుకు ప్రయత్నించారా…? అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లి పలుమార్లు సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. జూన్ 28న సియాతో, జూలై 1న చేతన్‌తో విడివిడిగా ఘటనను పునర్నిర్మించారు. నిందితుల వాంగ్మూలాలు, అక్కడి పరిస్థితులు, సంఘటన జరిగిన తీరు అన్నింటినీ మరోసారి పరిశీలించారు.

ఇదిలా ఉండగా… ఘటన జరిగిన రోజు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఓ వ్యక్తి కదలికలు కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. తీవ్ర ఎండలోనూ హుడీ ధరించి తిరుగుతున్న వ్యక్తి చేతనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో… గెయిట్ అనాలిసిస్‌కు శ్రీకారం చుట్టారు. గెయిట్ అనాలిసిస్ అంటే… ఒక వ్యక్తి నడిచే విధానం, అడుగుల వేగం, చేతుల కదలికలు, శరీర భంగిమ, బరువు మోసే తీరు వంటి లక్షణాలను విశ్లేషించి పోల్చే ఫోరెన్సిక్ విధానం. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి నడకను… చేతన్ సీన్ రీక్రియేషన్ సమయంలో రికార్డు చేసిన వీడియోతో పోల్చి చూస్తున్నారు. ఇది డీఎన్‌ఏ లేదా వేలిముద్రల తరహా ప్రత్యక్ష ఆధారం కాకపోయినా… ఇతర సాక్ష్యాలతో కలిపి దర్యాప్తుకు బలాన్నిచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసులో మరో కీలక అంశం ఆర్థిక లావాదేవీలు.. పెళ్లి ఏర్పాట్ల కోసం అంటూ సియా… కేతన్ నుంచి సుమారు కోటి రూపాయలు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే ఆ డబ్బును పెళ్లి ఖర్చులకు వినియోగించకుండా… ప్రియుడు చేతన్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థికంగా స్థిరపడేందుకు కొంత సమయం అవసరమని చేతన్ చెప్పడంతో… భవిష్యత్తు కోసం ఆ మొత్తాన్ని అతనికి అందించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. జూన్ 18న హత్య జరగడానికి నాలుగు రోజుల ముందే… ఇదే తరహాలో కేతన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో… మరోసారి పక్కా ప్రణాళికతో లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ప్లాన్‌ను అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు… మరో కోట వద్ద హత్య ఎలా చేయాలనే దానిపై రిహార్సల్స్ కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని… ప్రభుత్వం దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. హత్య, నేరపూరిత కుట్ర కేసుల కింద విచారణ కొనసాగుతోంది. ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించడం కూడా ఈ కేసుపై అధికార యంత్రాంగం ఎంత సీరియస్‌గా ఉందో చూపిస్తోంది. ఇప్పటికే కాల్ డేటా విశ్లేషణలో… సియా, చేతన్ మధ్య ఆరు నెలల్లో రెండు వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సీన్ రీక్రియేషన్, గెయిట్ అనాలిసిస్… ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

అయితే ఈ కేసులో అసలు మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. కేతన్‌ను చివరి క్షణంలో లోయలోకి నెట్టింది ఎవరు..? పాలిగ్రాఫ్ పరీక్షకు కోర్టు అనుమతి లభిస్తుందా..?లేదా..? అన్నది చూడాలి. మరోవైపు, ఎలాంటి ఆధారాల్లేనందున ఈ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ కేసులో కోర్టు తదుపరి నిర్ణయం… దర్యాప్తు దిశను పూర్తిగా మార్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.