Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పథకానికి ఎవరు అర్హులు..? డబ్బులు ఎప్పుడు పడతాయి..? అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి..? అనే అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలలో ‘తల్లికి వందనం’ ఒకటి. ప్రతి విద్యార్థి చదువు ఆగిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్… జూలై 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వెల్లడించారు.

ఈ పథకం కింద ప్రతి అర్హులైన విద్యార్థికి ప్రభుత్వం సంవత్సరానికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రూ.2 వేల రూపాయలను పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తుండగా… మిగిలిన రూ.13 వేల రూపాయలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. దీంతో కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గడంతో పాటు పిల్లల చదువుకు ఆర్థిక అండ లభిస్తోంది.

ఈ పథకంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే… ఒకే కుటుంబంలో ఒకరికి పైగా పిల్లలు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్నట్లయితే… ప్రతి విద్యార్థికీ విడివిడిగా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ, ముగ్గురు ఉంటే ముగ్గురికీ ప్రభుత్వం రూ.13 వేల చొప్పున నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తుంది.

ఈ ఏడాది కూడా పాఠశాలల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం… ప్రస్తుతం వాటి పరిశీలన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అర్హతలను నిర్ధారించిన తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి… అనంతరం నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

అయితే… తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో నుంచే తమ అర్హతను, అప్లికేషన్ స్థితిని సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించింది.

అందుకోసం ముందుగా ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం Scheme Eligibility లేదా Application Status అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసి… ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత తల్లి లేదా కుటుంబ పెద్ద ఆధార్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు పొందే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత… అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అక్కడ Validation Status వద్ద Satisfied అని చూపిస్తే… ఆ కుటుంబం ఈ పథకానికి అర్హత సాధించినట్లే. ఒకవేళ ఇతర వివరాలు కనిపిస్తే… సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం పోటీ నెలకొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ… భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు కూడా ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపించే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కూడా ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. వారికి అభినందనలు తెలియజేయడంతో పాటు… వారి తల్లిదండ్రులను సన్మానించారు. కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటి స్థలాల పట్టాలు కూడా అందజేశారు.

ఇదే కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధిపై కూడా మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు, మెగా జాబ్ క్యాలెండర్, అమరావతి, పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేశామని తెలిపారు. జూలై 15 నుంచి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటా ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదిలా ఉంటే… తల్లికి వందనం పథకం అమలుతో ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం స్కూల్ ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, రవాణా వంటి విద్యా అవసరాల కోసం ఉపయోగపడుతోంది. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో మానేయకుండా చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని విద్యా నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి… జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య రెండో విడత నిధులు విడుదల కానుండటంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది. అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుని… బ్యాంకు ఖాతా, ఆధార్, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్‌తో పాటు నిధుల విడుదల కూడా జరగనుండటంతో… ఈ మూడు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ నిధుల విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు విద్యా ఖర్చుల్లో ఆర్థికంగా ఊరట లభించనుంది.

Leave a Reply

Your email address will not be published.