కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులకు ఒమిక్రాన్‌ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు?

కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతాయి. మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్న వేళ… వైరస్ మళ్లీ కొత్త రూపంలో విజృంభిస్తోంది. కాలానుగుణంగా తన జన్యువుల్లో మార్పులు చేసుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కొవిడ్ కేసులకు ఒమిక్రాన్ RF.5 ఉప వేరియంట్ కారణమని పరీక్షల్లో తేలడంతో మరోసారి కరోనా హాట్‌ టాపిక్ గా మారింది.

జూన్ 26 నుంచి జూలై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా…ఆ నమూనాల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. RF.5 అనేది ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఒక సబ్ వేరియంట్. ప్రస్తుతం ఈ వేరియంట్ కేసులు సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య విద్య సంచాలకులు కూడా RF.5 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇది గతంలో తీవ్ర నష్టాన్ని కలిగించిన డెల్టా వేరియంట్‌లా ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు. అంటే ఈ వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ… తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందనే ఆధారాలు ఇప్పటివరకు లేవని చెబుతున్నారు.

RF.5 వేరియంట్ లక్షణాలు కూడా ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే స్వీయ చికిత్సకు ప్రయత్నించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన కొన్ని కేసులు కూడా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాయి. నెల్లూరు జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా ఒక యువకుడికి కరోనా సోకడంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 16కు చేరుకుంది. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా… మరికొందరు హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరీక్షలకు అవసరమైన కిట్లు, మందులు, ఐసోలేషన్ వార్డులు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రతీ కేసును జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా విశ్లేషిస్తూ కొత్త వేరియంట్లపై నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఆరోగ్య శాఖ… జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

మొత్తానికి… ఏపీలో గుర్తించిన ఒమిక్రాన్‌ RF.5 వేరియంట్‌పై ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇతర ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ల మాదిరిగానే స్వల్ప లక్షణాలతోనే కనిపిస్తోందని, కానీ, నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా పూర్తిగా అంతరించిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకుని… వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించడం, లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తతే కరోనా నుంచి రక్షణకు గొప్ప ఆయుధమని మరోసారి గుర్తుచేస్తున్నారు. బీఅలర్ట్‌.. బీ సేఫ్‌..!

Leave a Reply

Your email address will not be published.