Radha Gayathri Death Latest

హనీమూన్‌ డెత్‌ మిస్టరీ

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఇది సహజ మరణంగా ప్రచారం జరిగినప్పటికీ, బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఈ ఉదంతాన్ని హత్య కేసుగా మార్చారు. భార్య మరణంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న భర్త సౌమ్య శ్రీచరణ్‌పై ముస్సోరీ పోలీసులు తాజాగా BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధాగాయత్రికి, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు శ్రీచరణ్‌తో గతేడాది నవంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల దంపతులిద్దరూ ముస్సోరీ పర్యటనకు వెళ్లారు. జూన్ 15న ఉదయం రాధాగాయత్రి మరణించినట్లు సమాచారం అందగా, ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం రావడంతో స్పృహ తప్పిందని శ్రీచరణ్ వాదించాడు.

శ్రీచరణ్‌పై తీవ్ర అనుమానాలు

ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న దుప్పట్లు, మద్యం సీసాలు లభ్యమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, తమ హోమ్‌స్టేలో మద్యం అనుమతించమని యాజమాన్యం స్పష్టం చేయడంతో శ్రీచరణ్ చెప్పిన మాటలపై అనుమానాలు బలపడ్డాయి. మృతురాలి తండ్రి సుధాకర్ తన ఫిర్యాదులో అనేక కీలక అంశాలను లేవనెత్తారు:

  • నిఘా: రాధాగాయత్రి బ్యాగులో జీపీఎస్‌ ట్రాకర్‌, బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టడం వంటి శ్రీచరణ్ సైకోలాంటి ప్రవర్తన.
  • అబద్ధపు వాదన: భార్యకు అధిక రక్తపోటు ఉందని శ్రీచరణ్ అబద్ధం చెప్పాడని, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తండ్రి తెలిపారు.
  • సందేహాస్పద చర్యలు: భార్య మరణించిన స్థితిలో కూడా వీడియో కాల్‌ను స్క్రీన్ రికార్డ్ చేయడం, కుటుంబ సభ్యులకు అర్థరాత్రి వేళ సెల్ఫీలు పంపడం వంటి చర్యలు అతడిని అనుమానితుడిగా నిలబెట్టాయి.

పోలీసుల నమోదు.. నిందితుడు పరార్!

బాధిత తండ్రి సుధాకర్ డీజీపీని కలిసి 11 ముఖ్యమైన అంశాలతో ఫిర్యాదు చేయడంతో, ముస్సోరీ పోలీసులు నిందితుడు శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. అయితే, తనపై కేసు నమోదైందని తెలియగానే శ్రీచరణ్, విశాఖలోని సింహాచలంలో తాను బసచేసిన హోటల్ నుంచి బిల్లు కూడా కట్టకుండా అర్ధరాత్రి పరారైనట్టు సమాచారం.

కుటుంబానికి అండగా రాజకీయ నాయకులు

ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాధితురాలి తల్లిని కలిసి పరామర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనితతో కూడా ఆయన చర్చించారు.

ప్రస్తుతం రాధాగాయత్రి మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టులు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. చట్టపరమైన పోరాటం చేస్తామని, తమ కుమార్తె మృతికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.