Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

ఆరు రోజులైంది..చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి.. నాన్నా.. నాన్నా అంటూ ఇంటి నుంచి బయటకెళ్లిన రెండేళ్ల చిన్నారి తిరిగి వెనక్కి రాలేదు.. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. జాహ్నవి జాడ కోసం పోలీసులతో పాటు వందలాది మంది కొండలు,గుట్టల్లో జల్లెడపడుతున్నారు. అయినా, ఎక్కడా పాప జాడ కానరాలేదు.

దీంతో, ఈ మిస్సింగ్‌ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. నాన్న కోసం.. తన పెంపుడు కుక్కతో పాటు గ్రామ సమీపంలోని కొండల వైపు వెళ్లిన చిన్నారి.. గత ఆరు రోజులుగా కనిపించకపోవడంతో, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ వెతికినా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో ఈ ఘటన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాకినాడ జిల్లాలోని దొండపాక సీహెచ్ అగ్రహారం కొండల ప్రాంతంలో కనిపించకుండా పోయిన చిన్నారి జాహ్నవి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, జాహ్నవి ఎక్కడికి వెళ్లినా ఆ పెంపుడు కుక్క ఆమె వెంటనే ఉండేదని, చిన్నారి అదృశ్యమైన రోజు కూడా కుక్క పాప వెంటే పరుగెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి చిన్నారితో పాటు కుక్క కూడా కనిపించకపోవడంతో ఈ రెండు అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.

అయితే, కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క, మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా తోటల గుండా పరుగులు తీస్తూ ఇంటి పరిసరాలకు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ అదృశ్యమై, మరలా తిరిగి గురువారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఈ శునకం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మున్సిపల్ ట్రాకర్స్ ద్వారా ఆ పెంపుడు కుక్కును చీకట్లో బంధించారు. ఆ కుక్క చిన్నారి ఇంటి వైపే చూస్తూ అరుస్తూ ఉండిపోయింది. ఇప్పుడు రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ఈ పెంపుడు కుక్కే అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు.

ఇక, చిన్నారి తల్లిదండ్రులైన సుంకర భవాని -గణేష్‌ ఆ ప్రాంతంలోని, పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చుట్టూ కొండలు.. తోటల మధ్య ఉన్న ఇంట్లో వీరు నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం, జూన్‌ 6న ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరకు పరుగులు పెట్టింది. కట్ చేస్తే.. పాప తన దగ్గరకు రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.

రెండేళ్ల బిడ్డ అదృశ్యం.. ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంటి చుట్టూ తోటలు.. మధ్యలో ఏపుగా పెరిగిన గడ్డి.. ఈ ప్రాంతంలో జాహ్నవి ఎంత దూరం వెళ్లి ఉంటుంది? మరోవైపు ఓపెన్ బారుబావులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటన్నింటిని మూసివేశారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా చిన్నారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు.

మరోవైపు,గ్రామానికి చెందిన చెందిన ఓ వ్యక్తికి కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని తెలుస్తోంది. ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికెళ్లి జల్లెడ పట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదు. మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్‌కి చెందిన 200మందికి పైగా పోలీసులు.. రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా.. ఎలాంటి క్లూ దొరకలేదు.

అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్లకి లక్ష నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అసలు జాహ్నవి ఇంకా కొండల్లోనే ఉందా? ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం బంధించి ఉంచిన శునకం మెడలో ట్రాకింగ్ కెమెరా ఏర్పాటు చేసి వదిలిపెట్టాలని కొందరు కోరుతున్నాయి. ఈ పెంపుడు కుక్క మళ్లీ చిన్నారి ఉండే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుందని, పాప ఆచూకీ తెలుసుకునేందుకు ఇదొక మంచి మార్గమని గ్రామస్తులు భావిస్తున్నారు.

దాదాపు 6 రోజులు పగలు రాత్రి అని తేడా లేకుండా చిన్నారి కోసం గాలిస్తున్న యంత్రాంగానికి దర్యాప్తులో పెట్‌ డాగ్ ఆచూకీ కీలకంగా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాహ్నవిని ఎవరైనా అపహరించి ఉంటే.. శునకం వెంటనే ఇంటికి రావాలి. కానీ ఆలస్యంగా ఎందుకొచ్చింది? కొండ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, చిన్నారి జాడ కోసం జాహ్నవి కుటుంబ సభ్యులతో పాటు లక్షలాది ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారం రోజులు కావొస్తున్నా చిన్నారి జాడ తెలియకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published.