NEET Re-Exam

దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలను కలవర పరిచిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాలను, విద్యా వ్యవస్థను కుదిపేసింది. ఒకవైపు 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా..మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా భారీ స్థాయిలో చర్యలు చేపడుతోంది. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షణ.. రక్షణ శాఖ ఎంట్రీ.. ఎయిర్ ఫోర్స్ సహకారం.. ఇలా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక జాతీయ స్థాయి పరీక్ష నిర్వహణకు భద్రతా దళాలను రంగంలోకి దింపే పరిస్థితి వచ్చింది. అసలు నీట్ రీటెస్ట్ కోసం కేంద్రం ఎందుకు ఇంత సీరియస్‌గా వ్యవహరిస్తోంది? ఈసారి కొత్తగా ఏం మారబోతోంది? విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటి?

దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు అత్యంత కీలకంగా భావించే NEET-UG 2026 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. మే 3న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరిగింది. అయితే పరీక్ష పూర్తయ్యాక పేపర్ లీక్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

ఈ నేపథ్యంలో మే 12న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన NEET-UG పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం జూన్ 21న రీటెస్ట్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అయితే, ఈ రీటెస్ట్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రధాని నీట్ రీటెస్ట్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి.. ప్రింటింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, పరీక్షా కేంద్రాలకు చేరవేత, పరీక్ష నిర్వహణ, చివరిగా ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను PMO పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, పీఎంఓ అధికారులు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో భద్రతా చర్యలపై కీలక చర్చలు జరిగాయి.

ఇక ఈ పరీక్ష నిర్వహణలో అత్యంత కీలకంగా మారింది ఎయిర్ ఫోర్స్ పాత్ర. ఈసారి ప్రశ్నాపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళం సహకారం తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటివరకు పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా ప్రశ్నాపత్రాలు తరలించేవారు. ఇందులో అనేక దశలు ఉండటంతో పేపర్‌ లీక్ ప్రమాదం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈసారి నేరుగా భద్రతా దళాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే పరీక్షా పత్రాలు సమయానికి చేరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా వినియోగించే అవకాశముంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం రక్షణ శాఖ సేవలను వినియోగించాలనే ఆలోచన రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. “కేవలం భద్రత విషయంలోనే కాదు, విద్యార్థుల సౌకర్యం కోసం కూడా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి పరీక్ష సమయాన్ని అదనంగా 15 నిమిషాలు పెంచారు. ఈసారి పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మే 3న పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఆటోమేటిక్‌గా రీటెస్ట్‌కు అర్హులు. అడ్మిట్ కార్డులు జూన్ 14న విడుదల కానున్నాయి. మరోవైపు పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన గడువును కూడా NTA పొడిగించింది. అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక పోర్టల్‌లో జూన్ 22 వరకు సమర్పించవచ్చు. నేరుగా ఖాతాల్లోకి రీఫండ్ జమ చేయనున్నారు.

ఇప్పటికే వరుస పేపర్ లీక్‌లతో దేశంలో పోటీ పరీక్షల విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉండటంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మొత్తానికి నీట్ రీటెస్ట్ ఈసారి కేవలం విద్యార్థులకు నిర్వహించే ఒక పరీక్ష మాత్రమే కాదు.. దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతకు కూడా పరీక్షగా మారింది. విద్యార్థుల భవిష్యత్తుకు ఇకపై ఎలాంటి నష్టం కలగకుండా కేంద్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని కార్యాలయం నుంచి రక్షణ శాఖ వరకు మొత్తం వ్యవస్థ రంగంలోకి దిగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈసారి ఎంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించబోతున్నారు? విద్యార్థుల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలరా? లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published.