AE Nookaraju Family Suicide Case: ఏఈ కుటుంబం ఆత్మహత్యకు. ముందురోజు అసలేం జరిగింది?

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలేం జరిగింది..? ఆ కుటుంబం మొత్తం గోదావరిలో దూకేలా చేసిన పరిస్థితులేంటి..? సౌజన్య మరణ వాంగ్మూలంలో ఉన్న షాకింగ్ నిజాలేంటి? మరోవైపు ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్ష్.. తన తండ్రి మృతికి సాదిక్ ఖానే కారణమని, ప్రోటీన్ షేక్‌లో కెమికల్స్ కలిపి చంపేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఈ కేసులో ఏం జరిగింది..?

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఒక్కో విషయం బయటకు వస్తోంది. అయితే, ఏఈ కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రోజు అసలు ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఏఈ నూకరాజు – సాదిక్ ఖాన్ మధ్య గొడవలు ఆత్మహత్య వరకూ దారితీయడానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. సౌజన్యను సాధిక్ ఖాన్ లోబరచుకోవడమే కాకుండా ఆమెకు తెలియకుండానే ఆగస్టు 14వ తేదీన రహస్య వివాహానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సౌజన్య, సాధిక్‌ను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. పెళ్లికి అడ్డు చెబితే సౌజన్య ప్రైవేట్ వీడియోలతో పాటు ఆమె భర్త మృతికి సంబంధించిన విషయాలు కూడా బయటపెడతానంటూ సాధిక్ బెదిరింపులకు దిగడమే కాకుండా, కొట్టడానికి కూడా సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో తేలింది.

సాధిక్ అసలు రూపం తెలియడంతో పాటు.. బెదిరింపులకు పాల్పడటంతో ఏఈ నూకరాజు కుటుంబం తీవ్రంగా భయపడిపోయిందని.. ఇక వేధింపులు తాళలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే, నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అని తెలిసిన వెంటనే ఒక లాయర్ సలహాతో సాధిక్ పరారైనట్లు పోలీసులు విచారణలో బయటపడింది.

ఆగస్టు 16వ తేదీ రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఏఈ నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ గోదావరిలో దూకేశారు. కార్తికేయకు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అదేరోజు రాత్రి 12:45 గంటలకు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని తెలుసుకున్న సాధిక్ సామర్లకోట రైల్వేస్టేషన్ నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పరారయ్యాడు. 17వ తేదీ నూకరాజు మనవడు చెప్పిన విషయాల ఆధారంగా సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ తేదీ ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 24వ తేదీ కాకినాడ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

ఇక అదేవిధంగా, ఈ కేసులో ప్రాణాలతో బయటపడిన ఐదో తరగతి విద్యార్థి రియాన్ష్ కార్తికేయ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన తల్లి సౌజన్యను సాదిక్ కొట్టేవాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే తనను టెర్రరిస్టులకు ఇచ్చేస్తానంటూ బెదిరించాడని బాలుడు ఆరోపించాడు. అంతేకాదు.. తన తండ్రి తాగే ప్రోటీన్ షేక్‌లో కెమికల్ కలిపి సాదిక్ చంపేశాడని ఆ బాలుడు కన్నీటిపర్యంతమయ్యాడు.. తన కుటుంబాన్ని నాశనం చేసిన సాదిక్‌కు కఠిన శిక్ష పడాలని రియాన్ష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాలుడిని పరామర్శించిన సందర్భంగా రియాన్ష్ మీడియాతో ఈ విషయాలను వెల్లడించాడు.

ఇక అదేవిధంగా ఈ కేసులో ఏఈ నూకరాజు కుమార్తె కొవ్వూరి సౌజన్య రాసిన ఐదు పేజీల మరణ వాంగ్మూలం లేఖ విచారణలో కీలకంగా మారింది. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేదానినని, తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుమారుడు రియో ద్వారా సాదిక్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత అతడు తమ కుటుంబ పరిస్థితులు తెలుసుకుని తనకు సపోర్ట్ చేస్తానని నమ్మించాడని తెలిపారు.

తర్వాత తన ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేశాడని.. ఎదిరించిన ప్రతిసారీ కొట్టేవాడని సౌజన్య ఆరోపించారు. సుమారు ఏడాది పాటు వేధింపులు భరించిన తర్వాత భర్తకు విషయం చెప్పానని.. తనను కాపాడాలని కోరినట్లు తెలిపారు. ఆ తర్వాత తన కుమారుడు చదివే స్కూల్‌లో కోచ్‌గా చేరిన సాదిక్.. తేడాగా ప్రవర్తిస్తే కుమారుడిని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించారు.

అంతేకాదు.. తన భర్తను అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ఇచ్చి చంపేశాడని, తన ఆస్తిపై కన్నేశాడని, మతం మారాలని కూడా చిత్రహింసలు పెట్టాడని సౌజన్య లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. చివరకు ఆత్మహత్యే శరణ్యమైందని పేర్కొన్నారు. ఈ ఐదు పేజీల లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.