Houthi Attack on Indian Ship?: భారత నౌకపై హౌతీల దాడి? 🔴రెడ్ సీలో మునిగిన నౌక.. “13 మంది సేఫ్!”

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రెడ్ సీలో భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. యెమెన్ తీరానికి సమీపంలో ఎంఎస్‌వీ ఫైజ్ నూర్ ఒలియా ( MSV Faize Noore Oliya) అనే భారత జెండా ఉన్న కార్గో నౌకపై ఆగస్టు 4న దాడి జరిగింది. దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతిని బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయులతో పాటు మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్‌గార్డ్ సురక్షితంగా రక్షించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. “అసలు భారత నౌకపై ఎవరు దాడి చేశారు? హౌతీల పేరే ఎందుకు తెరపైకి వచ్చింది? రెడ్ సీలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఏం జరిగింది? వన్ బై వన్ డీటెయిల్డ్‌గా చూద్దాం.”


భారత విదేశాంగ శాఖ ప్రకారం.. యెమెన్ తీరానికి సమీప ఎర్ర సముద్రంలో నౌకపై దాడి జరిగింది. ఒక ప్రొజెక్టైల్ బలంగా ఢీకొట్టడంతో, నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. నౌక మునిగిపోతున్న సమయంలో యెమెన్ నేవీ, కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మొత్తం 14 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. అనంతరం యెమెన్‌లోని మోఖా పోర్టుకు తరలించారు. నౌకలో 13 మంది భారతీయులు, ఒక యెమెన్ పౌరుడు ఉన్నారు.


ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వాణిజ్య నౌకలపై ఈ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దాడులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆగాలని.. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం, వాణిజ్యం కొనసాగేందుకు అవసరమైన పరిస్థితులను పునరుద్ధరించాలని భారత్ స్పష్టం చేసింది.


ఇదే సమయంలో యెమెన్‌లోని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. భారత జెండాతో ఉన్న నౌకపై హౌతీలే దాడి చేశారని ఆరోపించింది. పేలుడు పదార్థాలతో నిండిన బోటును ఉపయోగించి నౌకను లక్ష్యంగా చేసుకున్నారని యెమెన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా.. సముద్ర భద్రత, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది.


రెడ్ సీ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఆసియా, యూరప్ మధ్య నౌకాయానానికి ఈ మార్గం ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరిగితే షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.


ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా భారత సముద్ర కార్మికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు 16 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది భారతీయ సముద్ర కార్మికులు ఉన్నారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్లాక్ సీలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో మరో ఐదుగురు భారతీయ సముద్ర కార్మికులు మరణించారు.


ఇటీవల బ్లాక్ సీలో జరిగిన మరో ఘటనలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. రష్యా ప్రాదేశిక జలాల్లో ఉన్న ఎంవీ ఒమోర్ఫీ (MV OMORFI) అనే మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన వాణిజ్య నౌకపై దాడి జరిగింది. నౌకలో ముగ్గురు భారతీయులతో సహా 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దాడిని కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. సముద్ర నావిగేషన్ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని దేశాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను పాటించాలని భారత్ కోరింది.


తాజా రెడ్ సీ ఘటనలో 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడటం ఊరట కలిగించే విషయం. యెమెన్ అధికారులు అందించిన సహాయానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు భారత సముద్ర కార్మికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే భారత నౌకపై దాడి వెనుక అసలు కారణమేంటి? రోజురోజుకూ రెడ్ సీలో వాణిజ్య నౌకలకు ముప్పు ఎందుకు పెరుగుతోంది? ఈ దాడి అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.